ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలకు ఈ టివి, టివి 5,ఎబిఎన్ ప్రతినిధులను అనుమతించక పోవడాన్ని వ్యతిరేకిస్తూ శాసన మండిలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఛైర్మన్ ఎం ఏ షరీఫ్ కు రాసిన లేఖ
(యనమల రామకృష్ణుడు)
ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభల్లో జరిగే అంశాలను అన్నివర్గాల ప్రజలు తెలుసుకునే అంశాన్ని భారత రాజ్యాంగమే కల్పించింది. తమ సమస్యలపై, తమ ప్రతినిధులు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే 1998లోనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా చట్టసభల సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను ప్రవేశపెట్టింది.
ఎటువంటి ఎడిటింగ్ లేకుండా ఎప్పటికప్పుడు సభా కార్యక్రమాలను లైవ్ టెలికాస్టింగ్ చేయడం ద్వారా చట్టసభల నిర్వహణలో పారదర్శకతతో పాటు, పార్లమెంటరీ వ్యవస్థను ప్రజలతో అనుబంధం అయ్యేలా చేశాం. అప్పట్లో ఎథిక్స్ కమిటిని కూడా ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వమే. ప్రజా ప్రతినిధుల ఆస్తుల ప్రకటన సంప్రదాయాన్ని కూడా ప్రారంభించాం. టిడిపి ప్రభుత్వం చేపట్టిన ఈ 3 ప్రధాన నిర్ణయాలతో శాసన నిర్మాణ వ్యవస్థ గౌరవాన్ని ఇనుమడింప చేశాం.
అప్పటినుండి రాష్ట్ర చట్టసభల ప్రాంగణంలోకి మీడియా సంస్థల విలేకరులను, కెమెరాలను కొన్ని దశాబ్దాల తరబడి అనుమతించడం జరుగుతోంది. తద్వారా ప్రజలకు, పార్లమెంటరీ వ్యవస్థతో మరింత అనుసందానం పెంపొందింది. ఆ తరువాత ఈ ప్రత్యక్ష ప్రసారాలను మన దేశ అత్యున్నత సభ పార్లమెంటులోనూ చేస్తున్నారు, అనేక రాష్ట్రాలు, దేశాలు కూడా దీనినే అనుసరిస్తున్నాయి.
అలాంటిది వైసిపి అధికారంలోకి వచ్చాక అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం, సత్ సంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడం శోచనీయం. చట్టసభలకు అనుమతించడంలో కొన్ని మీడియా సంస్థల(ఈ టివి, టివి 5, ఎబిఎన్..)పై ఆంక్షలు విధించడాన్ని ఖండిస్తున్నాం.
సదరు మీడియా ప్రతినిధులను, కెమెరాలను కూడా శాసనమండలి ప్రాంగణంలోకి అనుమతించడం లేదు, గ్యాలరీల్లోకి కూడా రానివ్వడం లేదు. బ్లూ మీడియాను మాత్రమే అనుమతించి మిగిలిన మీడియా సంస్థల ప్రతినిధులను అనుమతించక పోవడం అప్రజాస్వామికం. ఈ పోకడలు ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలైన చట్టసభలకే విరుద్దం. పార్లమెంటరీ వ్యవస్థకు తూట్లు పొడిచేలా వైసిపి ప్రభుత్వ నిర్ణయాలను గర్హిస్తున్నాం.
ప్రజాప్రతినిధులు చట్టసభలకు జవాబుదారీతనంగా ఉండాలి. చట్టసభలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది మన రాజ్యాంగ పెద్దల ఆకాంక్ష. సభా ప్రసారాలను ప్రత్యక్షంగా చూసే హక్కు ప్రజలకు ఉంది. ప్రసార సంస్థలు, పార్లమెంటరీ వ్యవస్థ మధ్య బలమైన బంధం ఉంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత వీటిపైనే ఉంది.
కొన్ని మీడియా సంస్థలు(ఈటివి, టివి 5, ఎబిఎన్..) సభా ప్రాంగణంలోకే రాకూడదు, కెమెరాలు తీసుకు రాకూడదు, గ్యాలరీలోకి వెళ్లకూడదు, లాబీలలో తిరగరాదనే ఆంక్షల విధింపు అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, పార్లమెంటరీ వ్యవస్థనే కించపర్చడమే.
రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో సిఎం జగన్మోహన్ రెడ్డి ఘనుడు. సిఎం సొంత మీడియా ప్రతినిధులను, తన అనుకూల సంస్థల ప్రతినిధులను, కెమెరాలనే సభలోకి అనుమతించడం ఏకస్వామ్యమే తప్ప ప్రజాస్వామ్యం కాదు.. ప్రజల తరఫున పోరాడే ప్రతిపక్షాల గొంతు వినిపించకుండా అణిచేయడం భావ ప్రకటనా స్వేచ్ఛకు, పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకం, పార్లమెంటరీ వ్యవస్థకు వ్యతిరేకం, రాజ్యాంగానికే వ్యతిరేకం.
చట్ట సభలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జనరల్ పర్పస్ కమిటికి రిఫర్ చేసి వారి అభిప్రాయాలకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయాలు తీసుకోవాలే తప్ప ఏకపక్ష చర్యలు చేపట్టరాదు.
ఇటువంటి అప్రజాస్వామిక రాజ్యాంగ వ్యతిరేక పార్లమెంటరీ వ్యవస్థను కించపరిచే చర్యలను టిడిపి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రేపటినుంచి ప్రారంభం కానున్న సభా సమావేశాల్లో దీనినే ప్రధానాంశంగా చేపడ్తాం. దీనిపై శాసనమండలిలోని ఇతర పార్టీల ప్రతినిధులను కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి గౌరవ ఛైర్మన్ గా మీరు సముచిత రీతిన స్పందించి, కౌన్సిల్ ప్రాంగణంలోకి మీడియాను అనుమతించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతున్నాం.
ప్రజా సమస్యలపై చట్టసభలో జరిగే చర్చలను స్వేచ్ఛగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలి. శాసనమండలి సభ్యులకు అందుబాటులో ఉండేలా కౌన్సిల్ లో మీడియా సెంటర్ ను ఏర్పాటు చేయాలి. నిష్పక్షపాతంగా కౌన్సిల్ ప్రసారాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.
మీడియా ప్రతినిధులకు రక్షణ, పూర్తి భద్రత కల్పించాలి. మీడియాకు వ్యతిరేకంగా స్పీకర్ తీసుకున్న నిర్ణయాలు కౌన్సిల్ కు వర్తింపచేయకుండా శాసనమండలి ఛైర్మన్ గారు సముచిత నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.