కృష్ణా జిల్లా ప్రజలకు రాష్ట పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుభవార్త వెల్లడించారు.
జిల్లాలో ప్రకాశం బ్యారేజికి ఎగువన ఒక బ్యారేజి, దిగువన రెండు బ్యారేజీల నిర్మాణం జరుగుతుంది. త్వరలోనే టెండర్లు పిలుస్తారని ఆయన వెల్లడించారు.
కృష్ణా జిల్లా ఇంచార్జ్ మంత్రి అయినా రామచంద్రారెడ్డి అధ్యక్షతన కృష్ణా జిల్లా 33వ నీటిపారుదల సలహామండలి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు.
ఇది కృష్ణా జిల్లా ప్రజలకు శుభవార్త అని, ఒకే జిల్లాకు 3 బ్యారేజిల నిర్మాణం శుభపరిణామం అని ఆయన వ్యాఖ్యానించారు.
“ముఖ్యమంత్రి గారు బ్యారేజిల నిర్మాణంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ రోజు క్యాబినెట్ సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. గత ఏడాది రబీకి 16 టీఎంసీల నీరు ఇచ్చాం. ఈ ఏడాది 26 టీఎంసీలు ఇస్తున్నాం. బందరు కాలువకు కూడా 1 టీఎంసీ నీరు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ ఏడాది నీటి లభ్యత ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయించాం,” అని ఆయన చెప్పారు.