(రాఘవ శర్మ)
ఓ ఇల్లాలికి ఒక్క సినిమా చూస్తే తనివి తీరేది కాదు.
తిరుపతికి వెళ్ళిందంటే చాలు, రెండు మూడు సినిమాలు చూసి రావాల్సిందే!
సినిమాలు చూడడానికి తిరుపతి వెళితే ఇంట్లో ఆవును ఎవరు చూడాలి? దానికి మేత ఎవరు వేయాలి? కుడితి ఎవరు పెట్టాలి?
దిగూరు (ముత్యాలరడ్డిపల్లె)కు చెందిన ఆ ఇల్లాలు సినిమాలకు ఆటంకమని ఆవును కాస్తా అమ్మేసింది.ఆ ఆవును మేం 300 రూపాయలకు కొన్నాం.
అది 1978 నాటి మాట.మాకు వ్యవసాయం లేకపోయినా, ఆ ఇల్లాలి పుణ్యాన మా ఇంట్లో కూడా ఆవుల సంతతి మొదలైంది
ముత్యాల రెడ్డిపల్లె, ఉల్లి పట్టెడ పేరుకే వేరు వేరు గ్రామాలు.
ఈ రెండు గ్రామాలు కలిసిపోయినట్టే ఉంటాయి. రెంటికీ మధ్యలో రోడ్డే అడ్డం.
ఈ రెండు గ్రామాల్లో పశుసంపద చాలా ఎక్కువగా ఉండేది.
దాదాపు వందకు పైగా ఆవులు, లెక్కలేనన్ని ‘ ఎనుములు ‘ (గేదెలు) ఉండేవి.
‘ ఆవులోచ్చినాయ్ ‘ అని అరిచేవాడు పొద్దున్నే ఆవుల చిన్నబ్బ
ఆ మాట వినపడగానే పాలు పిండాక కొట్టంలో కట్టేసిన ఆవులను అంతా మందలోకి వదిలే వాళ్ళు.
చిన్నబ్బ ఆవుల మందను మేతకు అలిపిరి దగ్గర కు తోలుకెళ్ళే వాడు. సాయంత్రం మళ్ళీ తోలుకొచ్చేవాడు.
ఆవులను మేపినందుకు ఒక్కో ఆవుకు నెలకు రూపాయిన్నర ఇచ్చేవారు. దాదాపు పాతికేళ్ళ క్రితం వరకు చిన్నబ్బ ఆవులను మేపాడు.
తిరుపతి విస్తరించింది. అటవీ శాఖ అభ్యంతరాలు మొదలయ్యాయి. ఆవులను అలిపిరి వద్దకు రానివ్వడం లేదు.
దాంతో చిన్నబ్బ ఆవులను తోలుకెళ్ళడం మానేశాడు. అయినా అతన్నిప్పటికీ ఆవుల చిన్నబ్బ అనే అంటారు.
వయసు ఎనభై ఏళ్ళ దరిదాపులకొచ్చినా చిన్నబ్బ ఇప్పటికీ గొర్రెలను మేపుతూనే ఉన్నాడు. ఉల్లిపట్టిడలో గొర్రెలు కూడా ఎక్కువే!
దాదాపు ప్రతి ఇంట్లో పశువుల కొట్టాలు కనిపించేవి.
పేరూరు బండ నుంచి తెప్పించిన రాతి కూసాలు నాటి, వాటి పైన తాటి దూలాలు వేసి, ఆ పైన గడ్డి వాములు వేసేవారు.
గడ్డి చెడిపోకుండానూ ఉంటుంది, వేరే పశువులు తినిపోకుండానూ ఉంటుంది. దాని కింద పశువులను కట్టేయడం వల్ల పశువుల కొట్టం విడిగా నిర్మించాల్సిన అవసరం ఉండేది కాదు.
ఈ రకమైన పశువుల కొట్టాలు, గడ్డివాములు రాయలసీమ ప్రత్యేకం. ఎవరి ‘ ఎనుము ‘ లను వాళ్ళు అవిలాల చెరువు కేసి మేతకు తోలుకిళ్ళే వారు.
ఈ జంట గ్రామాలలో పశుసంపద ఇప్పుడు దాదాపు అంతరించిపోయింది. ఈ ప్రాంతంలో నాలుగు నీటి కస్యాలు(నీటి గుంటలు) ఉండేవి.ఒక్కొక్క కస్యం దాదాపు వంద అడుగుల పొడవు వెడల్పుతో ఉండేవి.
పేరూరు చెరువు నిండినప్పుడు ఊట ద్వారా ఈ నీటి కస్యాలలోకి నీళ్ళు వచ్చేవి. ఈ నీళ్ళు ఎంతగా వచ్చేవంటే, ఇవి పొంగి, వీటికి ఏర్పాటు చేసిన కాలువల ద్వారా నీళ్ళు ప్రవహించేవి.
మహిళా విశ్వవిద్యాలయానికి వెనుక భాగంలో ఉన్న తుమ్మల గుంట రోడ్డు పక్కన స్మశానం వద్ద ఒక కస్యం ఉండేది.ఈ కస్యం పొంగి వైకుంఠపురానికి దక్షిణ చివరన కాలువలో ప్రవహించేది. దీన్ని కండేరు కాలువ అనేవారు.
మహిళా విశ్వవిద్యాలయానికి ఆగ్నేయాన మరొక కస్యం ఉండేది.
ఈ కస్యం కాలువ కూడా వైకుంఠపురం ఆర్చి ముందర నుంచి ప్రపహించేది. దీన్ని గార కాలువ అనేవారు.
కృష్ణానగర్ నుంచి మహిళా విశ్వవిద్యాలయం వెళ్ళే దారిలో అంకమ్మ ఆలయం దగ్గర ఇంకొక కస్యం ఉండేది. ఇక్కడ నుంచి వచ్చే కాలువను బుగ్గమఠం కాలువ అనేవారు.
కృష్ణానగర్‌లో వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఉండే కస్యం నుంచి వచ్చే కాలువను కృష్ణా నగర్ కాలువ అనేవారు. ఈ కాలువ గట్టునే యానాదులు గుడిసెలు వేసుకుని జీవించేవారు. దాన్ని యానాది సెంటర్ అనేవాళ్ళు.
ఆనాటి యానాదులు ఏమయ్యారో తెలియదు కానీ, ఇప్పుడది సరస్వతీ నగర్ అయిపోయింది.ఈ కాలువలు, కస్యాలు ఆక్రమణలకు గురై, కనీసం ఇప్పుడు వాటి ఆనవాళ్ళు కూడా కనిపించడం లేదు.
కస్యాలు, కాలువలు పూడ్చేసి ఇప్పుడు పెద్ద పెద్ద భవనాలు నిర్మించారు. ఒకప్పుడు ఇక్కడ కస్యాలు, కాలువలు ఉన్నాయన్న విషయం కనీసం ఆ భవనాలలో నివసించే వారికి కూడా తెలిసి ఉండక పోవచ్చు.
(సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ వివిధ పత్రికల్లో, వివిధ జిల్లాల్లో పనిచేశారు. ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి, వర్తమానం, వార్త, సాక్షి పత్రికల్లో స్టాఫ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్ గా, సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేసి ఏడేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు .తిరుపతి, విజయవాడ, హైదరాబాదు, నెల్లూరు, ఏలూరు, కాకినాడ ప్రాంతాలలో పని చేశారు. వివిధ పత్రికల్లో రాజకీయ, సాహిత్య, సామాజిక అంశాలపై అనేక కథనాలు రాసారు . చైనా ఆహ్వానం మేరకు భారత – చైనా మిత్రమండలి తరపున 2015 లో ఆ దేశంలో పర్యటించారు. ఆ పర్యటనానుభవాలతో ‘ ఓ కొత్త బంగారు లోకం ‘ అన్న పుస్తకాన్ని రాసారు. చిత్తూరు జిల్లా సాహితీ దిగ్గ జాల గురించి తన సంపాదకత్వంలో _’ సాహితీ సౌ గంధం ‘ అన్న పుస్తకాన్ని వెలువరించారు. కోస్తా జిల్లాల్లో పుట్టి, తెలంగాణా లో పెరిగి, రాయలసీమ ( తిరుపతి ) లో స్థిరపడ్డారు)
తిరుపతి జ్ఞాపకాలు-10 ఇక్కడ చదవండి
https://trendingtelugunews.com/top-stories/features/tirupati-lakshmipura-agraharam-mr-palle/