రేపే దేశవ్యాప్త  సార్వత్రిక సమ్మె

(పి. ప్రసాద్ (పీపీ),కే. పొలారి)
గత నూరేళ్లుగా భారత కార్మిక వర్గం అనుభవించిన అనేక హక్కులు, సౌకర్యాలు, సదుపాయాల్ని నేడు అది తన కళ్ళెదుటే కోల్పోతోంది. ఏకార్మిక చట్టాలని ఆలంబన చేసుకొని ఇప్పటి వరకి అవి అమలు జరిగాయో, ఆ చట్టాలు సైతం నేటి కుహనా సంస్కరణల గాలి దుమారంలో ఆనవాళ్లు కూడా మిగలకుండా పేల పిండిలా ఎగిరి పోతుండడం గమనార్హం. అసలు సంస్కరణలకు అర్థాలే నేడు పూర్తిగా మారిపోయాయి.
ఔను, సంస్కరణలకు అర్థం పూర్తిగా మారిపోయింది. 1990 కి ముందు సంస్కరణలంటే కార్మికులకు మెరుగైన కార్మిక చట్టాలు చేయడం. లేదంటే, మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించడం. ఇంకా కార్మికులకు నివాస గృహాలు నిర్మించడం, వారి పిల్లలకు విద్యా బోధన కల్పించడం, ఆరోగ్య వైద్య వసతుల్ని కల్పించడం. ఇంకా ప్రైవేటు రంగాల్ని జాతీయం చేయడం. ప్రభుత్వరంగ సంస్థల స్థాపన. 1990 తర్వాత వాటికి అర్థాలు మారాయి. ఔను, నాటి సంస్కరణల ద్వారా పొందిన సంక్షేమాన్ని తొలగించడమే నేడు సంస్కరణలకు అర్థంగా మారింది. నాటి పాజిటివ్ సంస్కరణలు, నేడు నెగిటివ్ సంస్కరణలుగా మారాయి. ఇలా ఎందుకు జరిగింది?
కార్మికవర్గం రక్త తర్పణలు చేసి సాధించినవి పాజటివ్ సంస్కరణలు. అవి ఒకానొక చారిత్రిక దశలో ఆవిష్కృతమై కార్మిక వర్గ జీవన పరిస్థితుల్ని మెరుగు పరి చాయి. ఐతే అవి అంతకంటే ముందుకు నడిచే కార్మికవర్గ విప్లవ పథంలో నాటి పాజిటివ్ సంస్కరణలు మెట్లు గా మారలేదు. అందుకే అవి తిరోగమన మార్గంలో మెట్లుగా మారాయి. ఇక్కడ దాగిన ఓ గతితర్కం గూర్చి చెప్పాలి. అది తెలిస్తే, నేటి సంస్కరణల పుట్టుక నేపథ్యం కూడా బోధపడుతుంది.
సంస్కరణలకు విధిగా ద్వంద్వ స్వభావం వుంటుంది. వాటికవే చలన రహతమైన జడపదార్థంగా వుండజాలవు. అవి సమాజ గమనంతో సంబంధం లేకుండా విడిగా కూడా వుండవు. సంస్కరణల యొక్క స్థానం నాటి నిర్దిష్ట సమాజంలో జడ పదార్థంగా వుండదు. అవి కూడా నిత్య చలనంలో వుంటాయి. అవి అంతకంటే, ముందుకు వెళ్లే రాడికల్ రాజకీయ మార్గంలో మెట్లుగానైనా మారాలి. లేదంటే వెనక్కి వెళ్లే రాడికల్ రాజకీయ మార్గంలోనైనా అవి మెట్లుగా మారాలి. అంతే తప్ప, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వున్నట్లు అవి జడ పదార్థంగా వుండవు. ప్రకృతి చలనాశీల నియమాలే సమాజానికి వర్టించినట్లుగా అందులో అంతర్భాగమైన సంస్కరణలకు కూడా అదే సూత్రం వర్తిస్తుంది. ఆనాడు కార్మికవర్గం పోరాడి సాధించి అనుభవించిన నాటి ప్రగతిశీల సంస్కరణల్ని అంతకంటే రాడికల్ విప్లవాత్మక సమాజ నిర్మాణం కోసం సాగే విప్లవ పథంలో మెట్లుగా మార్చడం శ్రామికవర్గ విప్లవ సంస్థల రాజకీయ కర్తవ్యం. కారణాలు ఏమైనప్పటికీ ఆ చారిత్రిక కర్తవ్యాన్ని చేపట్టడంలో అవి విఫలం అయ్యాయి. ఫలితంగా కార్మికవర్గం తన రాజ్యాధికార దిశలో వాటిని సోపానాలుగా నాడు మార్చుకోలేక పోయింది. అవి ఆచరణలో పురోగమన రాడికల్ రాజకీయ మార్గంలో ఉపయోగ పడలేదని చరిత్ర తేల్చింది. అవి జడపదార్థంగా వుండవని పైన పేర్కొనడం జరిగింది. అంటే ముందుకు వెళ్లే రాడికల్ రాజకీయ శక్తులు వాటిని తమ శత్రు పక్షానికి వదిలేసినవి. అందుకే రాడికల్ విప్లవ ప్రతీఘాత దారిలో అదే సంస్కరణలు రివర్స్ మెట్లుగా మారాయి. ఈ స్థితి విప్లవ ప్రతీఘాత ఫాసిస్టు రాజకీయ శక్తులకు జన్మనిచ్చాయి.
నాటి ప్రగతిశీల సంస్కరణల్ని తొలగించడమే నేటి ప్రగతి వ్యతిరేక సంస్కరణల లక్ష్యంగా మారింది. ఇది సహజ సమాజ చలన నియమమే. ఇందులో వింత గానీ, విడ్డూరం గానీ లేనే లేదు. ఇది అతి సాధారణమైన గతితార్కిక నియమమే. ఔను, తూర్పు దిశలో పురోగమించే శక్తులు విఫలమైనప్పుడు, సహజంగానే పడమటి శక్తులకు బలాన్ని ఇస్తుంది. ద్వంద్వ స్వభావం గల కార్మిక సంక్షేమ సంస్కరణలు కూడా చరిత్ర గమనంలో ఒక చేతి నుండి మరో చేతికి బదిలీ అయ్యాయి.
నిజానికి ప్రభుత్వ రంగ వ్యవస్థలు పేక మేడలా నేడు కుప్పకూలి పోతున్నందుకు సాధారణ కార్మికవర్గం బాధ పడితే పడొచ్చు. కార్మిక చట్టాలు రద్దు అవుతున్నందుకు వారు కుమిలిపోతే పోవచ్చు. ఉద్యోగ భద్రత, హక్కుల రక్షణ వ్యవస్థ లు హరించ బడుతుంటే వారు నిస్పృహకు గురైతే కావచ్చు. కానీ కార్మికవర్గం తరపున పని చేసే శ్రామికవర్గ విప్లవ సంస్థలకి అలా దిగులుపడే హక్కు లేదు. కుమిలిపోయే పరిస్తితి వాటికి రాకూడదు. అవి గతం కంటే మించి రెట్టింపు కర్తవ్య భారాన్ని భుజస్కందాల మీద వేసుకొని, నిస్పృహ లో వున్న నేటి కార్మిక వర్గానికీ మరింత ఎక్కువ ఆత్మ విశ్వాసాన్ని ఇవ్వాల్సి ఉంది.
గత పాజిటివ్ సంస్కరణలు అదే స్వభావంతో నేటికీ అవి లేవు. అవి అలా యధాతథంగా వుండ జాలవు. కాలగమనంలో లో “తాజా” రేపు “మాజీ”గా మారడం ఎంత సహజమైనదొ, నిన్నటి పాజటివ్ సంస్కరణలు, నేడు నెగిటివ్ సంస్కరణలుగా మారడం కూడా సహజమైనది. ఈ సహజ సామాజిక నియమాల పట్ల గతితార్కిక అవగాహన లేకపోతే కార్మికవర్గ “స్వర్గం” నేడు కూలిపోయినట్లు భ్రమాజనిత భావం కలగవచ్చు. లోకం ఆకస్మికంగా తలక్రిందులు ఐనట్లుగా అనిపిస్తుంది. అదే నేడు జరిగేది. ఇప్పుడు పేక మేడలా కూలి పోయేది భ్రమాజనిత కార్మిక స్వర్గం మాత్రమే. అంతే తప్ప, అది కార్మికవర్గ భౌతిక స్వర్గం కాదు. ఈస్పష్టత శ్రామికులకు ఒకవేళ లేకపోయినా, శ్రామికవర్గ విప్లవ సంస్థలకు వుండి తీరాలి.
చరిత్ర గమనం చాలా విచిత్రమైనది. ఏ పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయ శక్తులు కార్మికవర్గ విప్లవీకరణ ప్రక్రియని మొద్దు బార్చడానికి, తద్వారా విప్లవ పురోగమన నియంత్రణ కోసం మెరుగైన సంస్కరణల్ని ఒకనాడు తెచ్చాయో; అవి నేడు రాజకీయంగా బలహీన పడ్డాయి. దానితో పాటు అవి నేడు భౌతికంగానూ బలహీన పడ్డాయి. అదే విధంగా ఆనాడు ఏ కార్మికవర్గం తన రక్తతర్పణల తో పాజిటివ్ సంస్కరణలను సాధించిందో, వాటి ఆలంబన, ఆధారాలతో రాజ్యాధికార దిశ లో పురోగామించడంలో అది విఫలం చెందింది. ఆనాడు పాజటివ్ సంస్కరణలను సాధించింది కార్మికవర్గం. వాటి మంజూరుకు ఆమోదించింది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. నాడు సంస్కరణలను ఆమోదించిన బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నేడు బలహీనపడింది. వాటిని నాడు సాధించి అనుభవించిన కార్మికవర్గ రాజకీయ సామర్ధ్యం బలహీన పడింది. ఎవరికి ఇష్టం వున్నా లేక పోయినా చేదు నిజాలు చెప్పి తీరాల్సిందే. ఇటు పోరాడి సంస్కరణల్ని సాధించుకున్న కార్మిక వర్గమూ; అటు విప్లవ నియంత్రణకై వాటిని మంజూరు చేసిన పార్లమెంటరీ బూర్జువా పాలక వర్గమూ నేడు నష్టదార్లు (loosers) గా మారారు. పై రెండు విరుద్ధ వర్గాల మధ్య వర్గ సంకర రాజీ విధానాలు దశాబ్దాల పాటు కొనసాగాయి. అది భౌతిక సత్యం. ఫలితమే నేడు కొత్తగా ఫాసిస్టు రాజకీయ శక్తులు పురుడు పోసుకొని ఏపుగా ఎదగడం గమనార్హం.
ఇప్పుడు పేక మేడలా కూలి పోతున్న నిన్నటి సంక్షేమాలతో కూడిన సంస్కరణల గూర్చి వాపోవడం వల్ల ఫలితం రాదు. కన్నీళ్లు, వలపోత, వేదన, రోదన, ఆవేదన, నివేదనల వంటి భావోద్వేగాలు నేడు కార్మికవర్గం కోల్పోతున్న గత కాలపు అనుభవాల్ని తిరిగి ఆవిస్కరింప జేయలేవు. గత కాలంలో ఏ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పై పోరాడి కార్మికవర్గం అనేక పాజిటివ్ సంస్కరణలను సాధించిందో, తిరిగి వాటి పునరుద్దరణ కోసం చేసే నేటి పోరాటం మాత్రం అదే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద కాదు. నేడు దాని స్థానంలో రంగు మారకుండా గుణం మారిన ఫాసిస్టు తరహా పాలనా వ్యవస్థ వుంది. నేడు కార్మిక వర్గం దానిపై పోరాడాల్సి వస్తోంది. ఇదో ముమ్మాటికీ ఒక కొత్త భౌతిక, రాజకీయ పరిస్తితి.
ఎవరికి ఇష్టం వున్నా, లేకపోయినా, కార్మికవర్గం నేడు పోరాడాల్సిన శత్రువు నిన్నటి తరహా శత్రువు కాదు. వాడి వర్గ స్వభావం మారక పోయినా, రాజకీయ స్వభావం మారింది. రాశిలో, వాసిలో మారి పోయిన కొత్త శత్రువు రూపొందాడు. ఫాసిస్టు రాజకీయ ప్రవృత్తితో నేడు కార్మికవర్గం ఎదుట నిలిచిన ఈ కొత్త శత్రువు పై సుదీర్ఘ సాహసోపేత వర్గ పోరాటాల ఆవశ్యకత ఉంది. అలా పురొగమించే లక్ష్య సాధన కోసం నిబద్దతతో దీక్ష వహించడం తప్ప భారత కార్మిక వర్గానికీ నేడు మరో దగ్గరి దారి లేదు. అట్టి సంక్లిష్ట విప్లవ సాహసోపేత మార్గంలో నడిపించడానికి కార్మిక వర్గాన్ని రాజకీయంగా సంసిద్ధం చేయడం నేడు శ్రామిక వర్గ విప్లవ సంస్థల ఎదుట వున్న ఏకైక రాజకీయ కర్తవ్యం.
నేడు చరిత్ర ఒక కొత్త అవకాశాన్ని కార్మిక వర్గానికి కల్పిస్తోంది. గత సంక్షేమం, సంస్కరణలను కోల్పోతున్న భారత కార్మికవర్గం ఓవైపు తీవ్ర నిరాశ నిస్పృహ, వైరాగ్యాలకి గురవుతుంది. మరోవైపు అది ప్రభుత్వాల మీద అన్ని రకాల ఆశల్నీ, భ్రమల్నీ కోల్పో తుంది. మొదటి ధోరణి ఆధిక్యంలో వుంటే, పెట్టుబడిదారీ వర్గానికి లాభాల పంట పెరుగుతుంది. రెండో ధోరణి ప్రబలిపోతే, బూర్జువా వర్గం తీవ్ర అస్థిరతకి గురవుతుంది. శ్రామిక వర్గ విప్లవ సంస్థల కర్తవ్యం రెండో అంశాన్ని ఆధారం చేసుకొని కార్మిక వర్గంలో వర్గ పోరాటాల పట్ల విశ్వాసం కలిగించాలి.
రానున్న కాలంలో వర్గ సంకర విధానాలకు భౌతిక ప్రాతిపదిక లేకుండా పోతుంది. కార్మిక శాఖ (లేబర్ డిపార్ట్ మెంట్) మధ్యవర్తిత్వం కి గల ప్రాతిపదిక లేకుండా పోతుంది. ఇప్పటి వలె లేబర్ ట్రిబ్యునల్స్, లేబర్ కోర్టు లకు ఇకనుండి గతంలో వలె స్థానం వుండదు. కార్మిక వర్గానికీ ఈ వ్యవస్థల మీద ఆశలు లేదా భ్రమలు లేకుండా చేస్తుంది. ఈ స్థితి కార్మికవర్గం లో తీవ్ర అసహనం పెంచుతుంది. అది అస్తిరతకు దారి తీస్తుంది. అరాజకతకు కూడా కారణం అవుతుంది. అందులో నుండే ఒక నిర్మాణ యుత కార్మికవర్గ పోరాటాలకు అనువైన భౌతిక రాజకీయ పరిస్తితి ని ఏర్పరుస్తుంది. సామాజిక చలన సూత్రాల ప్రకారం ఈ ప్రక్రియ చోటు చేసుకుంటుంది. ఫలతంగా నేటి సాంప్రదాయ ట్రేడ్ యూనియన్ పద్ధతులకు భౌతిక ప్రాతిపదిక మున్ముందు వుండదు. దానికి బదులు ఒక నూతన పోరాట క్రమం రూపొందుతుంది. రేపు ఫాసిస్టు రాజకీయ వ్యవస్థ మీద పోరాడే రాజకీయ సామర్ధ్యం సంతరించు కోగలిగిన శ్రామిక వర్గ విప్లవ రాజకీయ సంస్థలు మాత్రమే నిలబడ గలవు. అలా నిలబడలేని కార్మిక సంస్థలు, శక్తులు సమాజ గమనంలో సహజ మరణం చెందుతాయి. మనుగడ కోసం పోరాటం (STRUGGLE FOR EXISTENCE) అను డార్విన్ సిద్ధాంతం రేపటి కొత్త ప్రతికూల భౌతిక రాజకీయ పరిస్తితులకు వర్తిస్తుంది. రేపటి ఫాసిస్టు రాజకీయ పరిస్తితి మధ్య కూడా కార్మికవర్గం పక్షాన ఏ శక్తులు గట్టిగా నిలబడగలవో అవే నిలదొక్కుకుని, మిగిలినవి అనివార్యంగా తెర మీది నుండి అదృశ్యం కాక తప్పదు. ఆయా ట్రేడ్ యూనియన్ల లేదా కార్మిక నాయకుల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా జరిగే అనివార్య పరిణామమే.
రైల్వే, బొగ్గు, భీమా, రక్షణ, టెలికాం, బ్యాంకింగ్ తో సహా ప్రభుత్వ రంగసంస్థలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని గట్టిగా కోరుకుందాం. ఔను, ప్రవేట్ రంగంలో కంటే వీటిలో పని చేసే కార్మిక, ఉద్యోగ వర్గాల ఉద్యోగ భద్రత, హక్కుల రక్షణ, జీత భత్యాలు ముమ్మాటికీ మెరుగ్గా ఉంటాయి. అందుకే వాటిని కాపాడుకోవడం కార్మికవర్గ కర్తవ్యమే. వారి పక్షాన కార్మిక సంస్థలు నిలబడి పోరాడా ల్సి వుంటుంది. అంతవరకూ భిన్నాభిప్రాయం ఎవరికీ లేదు. కానీ ఈ ఆశలు ఫలించక పోతే ఎం చేయాలి?
రేపటి సార్వత్రిక సమ్మె విజయవంతం ఐనప్పటికీ, మోడీ షా ప్రభుత్వం ఒకవేళ ఈ సమ్మె డిమాండ్ల పట్ల తన మొండి వైఖరి విడనాడ లేదని అనుకుందాం. ఫాసిస్టు దుర్ణీతి తో పైన పేర్కొన్న ప్రభుత్వ రంగ సంస్థల ను అంబానీ, ఆదానీ వంటి కార్పోరేట్ సంస్థలకు మోడీ షా ప్రభుత్వం కారుచౌక గా అప్పగిస్తే పరిస్తితి ఏమిటి? ఈ సమ్మెలకు నేడు సారధ్యం వహించే కార్మికవర్గ సంస్థలకు ఇలాంటి భావి పరిణామాల పై కూడా రాజకీయంగా ముందు చూపు వుండాలి. రేపు 26వ తేదీ సమ్మె విజయం పొందిన వెంటనే, మన సమ్మె డిమాండ్ల ని మోడీ సర్కార్ అంగీకరిస్తూ ఏ క్షణంలో ఏ శుభ ప్రకటన చేస్తుందో అని ఎదురు చూసే ధోరణులు కార్మికవర్గ సంస్థలలో వుండరాదు. దాని వల్ల నేడు సమ్మె ఎంత స్ఫూర్తిని ఇస్తుందో, సమ్మె అనంతరం మోడీ ప్రభుత్వ వైఖరి అంతే నిరాశను కూడా మిగిలించే ప్రమాదం వుంది. ఎండమావి వంటి ఫాసిస్టు తరహా మోడీ ప్రభుత్వం ఒక్క సమ్మెతో తమ దాహం తీరుస్తుందనే దురాశకి కార్మికవర్గం గురి కారాదు. అలా గురైతే, మున్ముందు ఫాసిస్టు పాలనలో అంబానీ, ఆదానీ వంటి కార్పోరేట్ సంస్థల ఎదుట సాగిలపడే ప్రమాదం వుంది. అలాంటి దుస్తితిలోకి కార్మిక వర్గాన్ని గురి చేయకుండా వారిని చైతన్య పరిచే కర్తవ్య భారం శ్రామిక వర్గ విప్లవ సంస్థలపై అధికంగా వుంది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ తన స్వీయ రక్షణ కోసం ఒకనాడు పాజిటివ్ సంస్కరణ ప్రక్రియను ప్రవేశ పెట్టింది. నేడు ఫాసిస్టు స్వభావం గల రాజ్య పాలక శక్తులు వాటిని వెనక్కి తీసుకుంటోంది. అంబానీ, ఆదానీ వంటి ప్రైవేట్ కార్పొరేట్ల కి ప్రభుత్వ రంగ సంస్థలను ఒక ఎలా రేపు అప్పగిస్తే దాన్నొక చారిత్రిక అవకాశంగా శ్రామిక వర్గ విప్లవసంస్థలు భావించాలి. అది చరిత్ర ఇచ్చే రాజకీయ కానుక గా మార్చుకుందాం.
ప్రభుత్వ రంగ సంస్థలైన బొగ్గు, రైల్వే, బీఎస్ఎన్ఎల్, డిఫెన్స్, భీమా, BSNL, బ్యాంకింగ్, నవ రత్నాలు వంటి ప్రజా ఆస్తుల్ని రేపు ఫాసిస్టు రాజ్య బలంతో, ఒకవేళ మోడీ ప్రభుత్వం అంబానీ, ఆదానీ వంటి కార్పోరేట్ సంస్థలకు అప్పగిస్తే కార్మికవర్గం ఎందుకు భయపడాలి? నూరేళ్ల క్రితం కార్మిక సంఘాలు పెట్టుకునే చట్టబద్ధ హుక్కులు, స్వేచ్చ లేని కాలంలోనే భారత కార్మికవర్గం వీరోచిత పోరాటాలు చేసింది. నాటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకుల కంటే నేటి మోడీ షా ప్రభుత్వం అంత బలమైనదా? బ్రిటిష్ ఇండియా లో నాటి బ్రిటిష్ బూర్జువా వర్గం మీద తొడగొట్టి బరిలో నిలిచి పోరాడిన ఘన చరిత్ర భారత కార్మికవర్గానికి వుంది. అంత ఘన చరిత్ర గల భారత కార్మిక వర్గం నేడు కూడా పోరాడ గలదు.
జారిస్తు రష్యా లో ఏ కార్మిక చట్టాలు వున్నప్పుడు లెనిన్ నేతృత్వంలో రష్యా కార్మిక వర్గం పోరాడింది? ఏ ప్రభుత్వ రంగ సంస్థలు వున్నాయని పోరాడింది? కార్మిక చట్టాలు ఉంటే తప్ప కార్మిక వర్గాన్ని సంఘటితం చేయలేమేమో అని సందేహించడం కార్మిక సంస్థలకు తగదు. ప్రభుత్వ రంగం సర్వస్వం కాదు. కార్మిక చట్టాలు శాశ్వతం కాదు. కార్మిక చట్టాలు పుట్టిన తర్వాత కార్మిక సంఘాలు పుట్టలేదు. అందుకు భిన్నంగా కార్మిక సంఘాలు పెట్టి పోరాటాలు నడిపిన తర్వాతే చట్టాలు, సంక్షేమ సంస్కరణలు ఆవిర్భవించాయి. ప్రభుత్వ రంగం మరింత ఆలసంగా ఆవిర్భవించింది. ఈ చారిత్రిక అవగాహన ఉండాలి.
నూరేళ్ల క్రితం కంటే నేడు భారత కార్మిక వర్గం వాసిలో, రాశి లో అనేక రెట్లు అధికంగా పెరిగింది. (అంకెలు, సంఖ్యల లోకి ఇప్పుడు వెళ్ళడం లేదు) నూరేళ్ల క్రితం భారతదేశ జనాభాలో కార్మికవర్గం తక్కువ శాతం మంది మాత్రమే వుంది. ఐనా బ్రిటిష్ ప్రభుత్వాన్ని అది గడగడ లాడించింది. బ్రిటీష్ కాపిటలిస్ట్ వర్గాన్ని చెమటలు పట్టించింది. నేడు అది అనేక రెట్లకు చేరింది. ఐనపుడు అది నేడు ఎంతటి చారిత్రిక విప్లవ కర పాత్రని పోషించ గలదో అంచనా వేసుకోవచ్చు.
కార్మికవర్గం కళ్లు తెరిస్తే ఫాసిస్టు పాలక శక్తులు మట్టి గరుస్తాయు. చరిత్ర పదేపదే ఈ నిజాన్ని నిరూపించింది. నేడు దేశంలోని వివిధ వర్గాల ప్రజలకి విప్లవ స్ఫూర్తిని ఇవ్వగలిగే చారిత్రిక పాత్రను కార్మికవర్గం పోషించగలదు. దేశం ఫాసిస్టు రాజకీయ పథంలో సాగే కాలం లో రేపటి సార్వత్రిక సమ్మెకు ఒక చారిత్రిక స్థానం వుంది. అది ఏమిటో చూద్దాం.
(పి. ప్రసాద్ (పీపీ),అధ్యక్షులు;కే. పొలారి,
ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర కమిటీ, ఆంధ్ర ప్రదేశ్, భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టు))

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *