(సలీమ్ బాషా)
క్రికెట్ అనేది భారతదేశంలో ఒక మతం. కోట్లాది మంది భారతీయుల ఇష్టమైన ఆట క్రికెట్. అయితే క్రికెట్ ఆటలో మనకు తెలియనివి మనం చూడనివి కొన్ని విచిత్రమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో జరిగాయి, జరుగుతున్నాయి. క్రికెటర్ల గురించి మనకు తెలియని కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం.
1
అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్లలో హైదరాబాదీ బ్యాట్స్ మన్ అజారుద్దీన్ ఒకడు. వివాదాస్పద క్రికెటర్ అయినా అజారుద్దీన్ తన స్టైలిష్ బ్యాటింగ్కు ప్రసిద్ది చెందాడు, కాని అతని ఆన్-ఫీల్డ్ పద్ధతులు, కొన్ని అలవాట్లు అతని తోటి క్రికెటర్లలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. అలాంటిదే ఒకటి కాలర్, వైట్ హెల్మెట్.రేడియో స్టేషన్, ఫీవర్ 104 ఎఫ్ఎమ్ తో మాట్లాడుతూ, “పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, సూర్యరశ్మి కి గురికావడం వల్ల నా మెడ చర్మం కమిలి పోయేది. నా కాలర్ను పైకి ఎత్తి పెట్టుకోవడం ద్వారా ఆ సమస్య నుంచి బయట పడాలి అనుకున్నాను.. అలా అది ఒక అలవాటుగా మారింది”. వైట్ హెల్మెట్ గురించి మాట్లాడుతూ “టెస్టులు ఆడేటప్పుడు మేము చాలా హెల్మెట్లు ఉపయోగించాము కాబట్టి నాకు వైట్ హెల్మెట్ అంటే చాలా ఇష్టం. నీలిరంగు హెల్మెట్ వాడటం తప్పనిసరి కానందున, నేను తెల్లటి హెల్మెట్ తో ఆడాను” అని అజర్ రేడియో ఛానెల్తో అన్నాడు.
2
హార్డ్ టాక్ ఇండియా షో కోసం కరణ్ థాపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, డబ్బు సంపాదించాడని మరియు మ్యాచ్లను ఫిక్సింగ్ చేశాడనే ఆరోపణల గురించి అడిగినప్పుడు మాజీ ఇండియన్ కెప్టెన్, హర్యానా హరికేన్ ఏడ్చేశాడు. దానికి వివరణ గా ఇలా చెప్పాడు” డబ్బులు తీసుకునే కంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నా డబ్బు అంతా తీసుకోండి, నాకు అది అక్కర్లేదు. నేను ఆత్మగౌరవం చాలా ప్రాణప్రదంగా భావించే కుటుంబం నుండి వచ్చాను. ” అని చెప్పాడు.
3
అక్టోబర్ 4, 1996 న, 16 ఏళ్ల షాహిద్ అఫ్రిది శ్రీలంకపై 37 బంతుల ప్రదర్శనలో వేగంగా వన్డే అంతర్జాతీయ సెంచరీని కొట్టాడు. అతని రికార్డును 2014 లో న్యూజిలాండ్ కోరీ ఆండర్సన్ వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో బద్దలు కొట్టాడు.యువ ఆటగాడైన ఆఫ్రిదీ సరైన క్రికెట్ కిట్ లేకపోవడం వల్ల పాకిస్తాన్ స్పిన్నర్ సక్లైన్ ముష్తాక్ తన బూట్లు ,హెల్మెట్ లను ఇచ్చాడు. . డైలీ పాకిస్తాన్ కు ఆఫ్రిది ఇంటర్వ్యూ ఇస్తూ ఇలా చెప్పాడు”నేను అప్పుడే పాకిస్తాన్ క్రికెట్ జట్టులోకి వచ్చాను , నైరోబిలో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో, వకార్ యూనిస్ నాకు బ్యాట్ ఇచ్చి, దీనితో ఆడు ఇది సచిన్ బ్యాట్ అని అన్నాడు నా మొదటి వన్డే మ్యాచ్లో సచిన్ బ్యాట్తో ఆడినందుకు చాలా గౌరవంగా భావిస్తున్నాను, సియాల్కోట్ నుండి ఇలాంటి ఒక బ్యాట్ తెచ్చి ఇవ్వమని సచిన్ వకార్ యూనిస్ కోరి ఈ బ్యాట్ ఇచ్చాడట”. అని చెప్పాడు.
4
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తన సహచరుడు వకార్ యూనిస్ 1999 టెస్టులో ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో అనిల్ కుంబ్లే రికార్డు 10 వికెట్ల నీ దాదాపుగా నాశనం చేయడానికి ప్రయత్నించాడని వెల్లడించాడు. “కుంబ్లేకు తొమ్మిది వికెట్లు వచ్చాయి, నేను మరియు వకార్ (యూనిస్) క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నాము” అని అక్రమ్ గుర్తు చేసుకున్నాడు. “వకార్ నా దగ్గరకు వచ్చి, మనం రనౌట్ అవుతే ఎలా ఉంటుంది? అప్పుడు కుంబ్లే తన 10 వ వికెట్ పొందలేడు”. అని అన్నాడు. అప్పుడు నేను “అతను ఈ ఘనతను సాధించాలని రాసిపెట్టి ఉంటే నువ్వు అతనిని ఆపలేవు. కాని నేను కుంబ్లేకు నా వికెట్ ఇవ్వబోనని మాత్రం చెప్పగలను. అన్నాను కాని, తదనంతరం, నేనే కుంబ్లేకు నా వికెట్ ను సమర్పించుకున్నాను”. అని చెప్పుకొచ్చాడు.
ఇలాంటి మరికొన్ని విశేషాలు మరో సారి చూద్దాం…
(సలీం బాషా, స్పోర్ట్స్ జర్నిలస్టు,కమ్యూనికేషన్ స్కిల్స్ కోచ్)