మనిషిగా జీవించు – మరణాన్ని జయించు గ్రంధాన్ని రాబిన్ శర్మ రచించారు. శర్మ ,తన జీవితంలో ఎదురైన అనుభవాలను సహజ పరిణామాలుగా భావించి వాటి నుంచి గుణపాఠం తీసుకోవా లన్నాడు.
జీవితంలో ఎదురైన సమస్యలన్నీ పరిష్కారం చూపించే అవకాశాలుగా గుర్తించాలని రాబిన్ శర్మ చెబుతాడు. జీవితంలోమనమేం చెయ్యాలో అర్ధం చేసుకొని దానికనుగుణంగా మనకు తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరముందని రాబిన్ శర్మ తన గ్రంథంలో విశదం చేశాడు.
రాబిన్ శర్మ తనకు లభించిన పాత పుస్తకాలను చదివారు.సాధారణంగా ఒక పుస్తకాన్ని చదివినవారు ఆ పుస్తకాన్ని పక్కన పెట్టేస్తారు.రాబిన్ శర్మ మాత్రం తనకు నచ్చిన అంశాలను మన జీవితానికి పనికి వచ్చే విషయాలను ఒక పేజీకి సరిపడా ఒక వ్యాసాన్ని జర్నల్ లాగా రాసుకున్నారు.వాటి సమాహారమే ఈ గ్రంథం.
దీన్ని చదివితే కొంత వెసులుబాటు ఉన్నవారు, జీవితంలో స్థిరపడాలనుకునేవారు,ఊగిసలాటలో వున్న వారు తమ భావాలకు సరైన రూపాన్ని ఇవ్వడానికి నిర్ణయం తీసుకోగలుగుతారు.ఏదో ఒక సంకల్ప బలం చదివేవారిలో కలుగుతుంది.ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉంది.
మహాత్మా గాంధీ చెప్పినట్లు ప్రపంచంలో నువ్వు కోరుకుంటున్న మార్పుని నువ్వే అయిపోవాలి.అలా చేసిన నాడు మన జీవితం మారిపోతుంది. మనం కోట్ల నక్షత్రాలున్న విశ్వం వెలుపల ఉన్న అతి సాధారణమైన నక్షత్రం చుట్టూ తిరిగే ఒక చిన్న గ్రహంలా బతుకుతున్నా మన్నాడు స్టీఫెన్.దీన్ని అర్థంచేసుకుంటే విశ్వానికున్న జీవితంలో మన జీవితం రేణువంతగా గుర్తిస్తాం. అందుకే రేణువంత జీవితాన్ని ఆనందంగా జీవించాలి. క్రమశిక్షణ లేకుండా జీవితంలో లక్ష్యాలను పెట్టుకోలేం. కాలాన్ని సద్వినియోగం చేసుకోలేం. ఈ సత్యం మనిషిని జీవింపజేస్తుంది.
ఈ. విం.గ్రే ఏమంటాడంటే వైఫల్యం చెందిన వారు చేయడానికి ఇష్టపడే పనులను చేసే అలవాటు విజేతలకు ఉంటుందని, సంకల్పబలంతోనే అవి చేయగలరని.
రోజు వారి అనుభవాలను, గుణపాఠాలను ఒక నోటు పుస్తకంలో రాసుకుంటూపోతే మిమల్ని మీరు మాట్లాడుకున్నట్లవుతుంది. రోజుకు 5 నిముషాలు ఈ పనిని దైనందిన చర్యల గురించి రాయకుండా, వచ్చిన అనుభవాలను వాటి వల్ల నేర్చుకున్న అంశాలను విశ్లేషిస్తూ రాయడం అలవాటు చేసుకోవాలి. అత్యంత ఘోరమైన పరిస్థితుల నుంచే అత్యంత ఆనందకరమైన మార్పు రావడానికిఅవకాశముంటుందని ప్రాచీన గ్రీకు నాటక రచయిత యూరిపిదాస్ అంటాడు.
అంటే జీవితంలో వైఫల్యాలు ఎక్కువగా పొందినవారు జీవితం ఎత్తు పల్లాలను చవిచూసిన వారై ఉంటారు. ఏమౌతుందోనని భయంతో చేయకుండా ఉండే బదులు దాని వల్ల ఎదురయ్యే ప్రమాదాలకు సిద్ద పడి సాహసంతో ముందుకు పోవడం చాల మంచిది.
జీవితంలో సఫలమైన వారందరూ తమకు ప్రతిభ ఉన్న రంగాల్లోలోనే కృషి చేస్తారు. తాము ఏది బాగా చేయగలమని నమ్ముతారో దానికే పరిమితమైతే వాళ్ళు జీవితంలో ముందుకు పోతారు.
అందువల్ల ముఖ్యం కానీ ఇతర పనులపై ఎలాంటి ఆసక్తి చూపకుండా నిరాకరించాలి. ప్రపంచంలో బాస్కెట్ బాల్ లో పేరొందిన మైఖేల్ జోర్డాన్ బాస్కెట్ బాల్ కే అంకితమైనాడు.సచిన్ టెండూల్కర్ క్రికెట్ కే అంకితమైనాడు.అలా వారు ఆయా రంగాల్లో నిష్ణాతులైనారు.
ప్రపంచంలో వ్యాయామం కోసం మీరు పెట్టే పెట్టుబడి ఇచ్చినంత లాభాలు ఏ పెట్టుబడి ఇవ్వదని రచయిత చెపుతాడు. వ్యాయాయం కోసం సమయం వెచ్చించని వారు వ్యాధి కోసం వెచ్చించాల్సి వస్తుంది. శరీర ఆరోగ్యం ఫై దృష్టి కేంద్రీకరించడం వల్ల జీవితాన్ని శాసిస్తున్న బాధ నుండి బయట పడవచ్చు. ప్రాణాయామం, ధ్యానం, యోగాసనాలు, ఈత కొట్టడం, నడక మొదలైన వాటిల్లో ఏ ఒక్కటి చేసినా మన ఆలోచనల్లో స్పష్టత, సృజనాత్మక శక్తి పెరుగుతుంది.
ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేవడం అలవాటు చేసుకుంటే ఉదయం పూట వ్యాయామం చేయవచ్చు. అలాగే సంగీతాన్ని వినవచ్చు. మంచి పుస్తకాల్లో కొన్ని పేజీలు చదవవచ్చు.నడక సాగించవచ్చు.
ఇలా ఏవైనా చేయడం మీకు కలిగిన ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఉదయాన్నే లేవాలనుకుంటే రాత్రి పూట తక్కువగా భోజనం చేసి 10 గంటలకు నిద్రపోవటం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది.
మనం ఆనందంగా ఉంటే నవ్వుతాం. నవ్వాలంటే మనసు ఉల్లాసంగా ఉండాలి.దీని కోసం హాస్య రచనలను చదవాలి, హాస్య చిత్రాలను చూడాలి.
జీవితమంటే సాహసం.సాహసాలు చేయకపోతే జీవితంలో ఒక్క మెట్టు కూడా ఎక్కలేవు. కొత్త భూ ప్రాంతాన్ని కనుగొనాలంటే చాల కాలం వరకు ఒడ్డు సంగతే మరిచిపోవాలంటాడు ఆండ్రీ గైడ్.జీవితంలో నేర్చుకోవలసినవి చాలా ఉంటాయి, అవి చిన్న పిల్లలను చూసి కూడా నేర్చుకోవచ్చు. సి
నిమా ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు. ఉత్సాహం కలిగించే విషయం నిన్ను ముందుకు తీసుకు పోతుంది. ‘ఉత్సాహం లేకుండా ఈ ప్రపంచంలో ఏ గొప్ప విజయం సాధింపబడలేదు’ అనంటాడు రాల్ఫ్ నాల్డ్ ఎమర్సన్.
సెనికా అనే రోమన్ తత్వవేత్త ‘నువ్వు జీవించినంత కాలం ఎలా జీవించాలో నేర్చుకుంటూ ఉండమన్నాడు’. చదువు పూర్తి కాగానే పుస్తకాలే ముట్టుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు.ఇది సరికాదు. ఒక మంచి పుస్తకం, ఒక మంచి ఆలోచన మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది.
గొప్ప ప్రేమతో చేసిన చిన్న పనులే గొప్ప పనులవుతాయని మదర్ థెరిస్సా అన్నారు. ఇతరుల పట్ల మరింత ప్రేమగా మెలగడం కోసం, ఎవరో ఒకరికి ఆనందం కలిగించే ఓ చిన్న పని చేయడానికి సిద్ధం కావాలి. ప్రతి రోజూ ఒక చిన్న మంచి పని చేస్తే వచ్చే ఆనందం ఎంతో గొప్పది. ఆనందం పొందాలంటే సాలె పురుగులా చుట్టూ పరచుకుంటూ వెళ్లి ఎంత లాక్కోగలిగితే అంత సరిపోతుందంటాడు టాల్ స్టాయ్.థ్యాంక్స్ అని చెప్పే నాలుగు మాటలు సులభంగా మనం చేయగలిగే పని. ఇదే మనకు స్ఫూర్తినిస్తుంది.
మనస్సులో తలెత్తే సమస్యలను ఒక కాగితం పై రాయాలి. అవే మన మనసులో ఉంటే మనసంతా గందరగోళంగా ఉంటుంది.అవి కలగాపులగం కాకుండా ఉండాలంటే సమస్యల జాబితా రాసుకోవాలి.అప్పుడే ఆ సమస్య పట్ల మనకు స్పష్టత వస్తుంది.వాటికి పరిష్కారం కూడా ఆలోచించే వీలవుతుంది. వాటిని కూడా రాస్తే మరింత సులువుగా సమస్యను పరిష్కరించవచ్చు.
జ్ఞానమే శక్తి అంటారు.అది పూర్తిగా వాస్తవం కాదు.జ్ఞానం శక్తిగా మారాలంటే ఆ జ్ఞానాన్ని ఆచరణగా మార్చాల్సి ఉంటుంది.తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టకపోతే అది ఎంత గొప్ప దైనా మురిగిపోతుంది.
అతి గొప్ప సంకల్పం కంటే అతి చిన్న కార్యాచరణ చాలా గొప్పది. ‘మనిషి అంతిమ లక్ష్యం ఆచరణే గాని ఆలోచన కాదు. అది ఎంత ఉదాత్తమైనదైనా సరే’ అని అన్నాడు థామస్ కార్లెల్. ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించడంలో పొందే ఆనందం కన్నా, దాన్ని సాధించే క్రమంలో మీలో కలిగే ఆనందం లో ఉందనిచెపుతాడు రాబిన్ శర్మ.
విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకోక లక్ష్యానికి పనికి వచ్చే విషయాల్లోనే ఉపయోగించు కుంటే చాలా అలవాట్లలా ఇది కూడా క్రమంగా మన స్వభావంలో ఒక భాగమై పోతుంది. మనం లక్ష్యాన్ని ఛేదించే ప్రతి బాణం వెనుక వందసార్లు గురి తప్పిన అనుభవం ఉంటుందన్నారు బౌద్ధులు.మీ లక్ష్యాలను కాగితాల మీద రాసి ఉంచితే అద్భుతాలు జరుగుతాయి. అలా ఎందుకు రాసుకోవాలంటే లక్ష్యాలను మరిచిపోకుండా ఇతర వ్యామోహాలకు గురి కాకుండా ఉండడానికే.
అయితే ఫలితాలపై శ్రద్ధ వహించడానికి, ప్రకృతితో కొంత సమయాన్ని గడిపితే ప్రకృతి సౌందర్యాన్ని చూడగలుగుతాం. మన మనస్సుకు చురుకుదనం వస్తుంది.పిల్లలతో కొంత సమయాన్ని కూడా గడపలేకపోవడం వల్ల మీరు మీ జీవితాన్ని చాల కోల్పోతారు. పిల్లలకు మీరు ఇవ్వగలిగే గొప్ప కానుక వారితో మీరు గడపడమే.ఇలా చేయడం వల్ల మనలో ఉన్న శక్తి ద్విగుణీకృతమౌతుంది.
మన జీవితంలో ఉత్సాహం, ఆశావాద దృక్పథం తగ్గిపోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఉన్నత లక్ష్యాలను నిర్ణయించు కుంటూపోవాలి.
ఒక లక్ష్యం చేరుకోగానే మరో కొత్తది ఏర్పరుచుకోవాలి. పెట్టుకునే లక్ష్యాలు మీకు తగినవిగా ఉండాలి. అభినయించడం నేర్చుకోండి. అది మన ప్రవర్తనను మార్చేస్తుంది.తరుచుగా చేస్తుంటే ఆ అభ్యాసం వల్ల క్రమంగా మీరు భయాన్ని వదిలించుకోగలుగుతారు.
మీ జీవిత కథను రాయండి. దాన్ని ఒకసారి మీకు నచ్చిన రీతిలో తిరిగి రాయండి.ఇలా ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధిస్తూ పోవాలి.
రోజూ ఏదో ఒకదానికి మనకు ఒళ్ళు మండిపోతుంటే అది చివరకు ఒక అలవాటుగా మారిపోతుంది.మెల్లగా అది మన స్వభావమవు తుంది.దాంతో మన వ్యక్తిగత సంబంధాలు, వ్యాపార భాగస్వామ్యాలు దెబ్బతింటాయి. కోపంతో మనం మాట్లాడే మాటలు చిరకాలమైత్రి ని కూడా దెబ్బ తీస్తాయి. నేనంటున్నమాటలు దయాపూరిత మైనవేనా?అని ప్రశ్నవేసుకుని అనుకూలంగా సమాధానం వస్తేనే మాట్లాడాలి. అడగడానికి మీకు ధైర్యం ఉండాలి. ఊరికే అడగడం వల్ల మీరెంత పొందుతారో తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు.
పిల్లల్ని కనడం, పుస్తకం రాయడం, చెట్లు నాటడం, ఇవి మీరు చనిపోయిన తర్వాత కూడా కొనసాగే వారసత్వాలు.ఒక చిత్రం వెయ్యి మాటల కన్న మించినది. జీవితంలోని అద్భుతమైన జ్ఞాపకాలను ఫోటోలు భద్రపరుస్తాయి. చిన్నప్పటి జ్ఞాపకాలను అవి ఈనాటికీ గుర్తుచేస్తుంటాయి.
స్ఫూర్తి నిచ్చే పలుకులను సేకరించడం వాటిని భద్రపరుచుతూ ఉంటే జీవితం అర్థం, పరమార్థం తెలుస్తుంది.