ఈ రోజు పఠాన్ చెరు లో ఎన్నికల ప్రచారం చేస్తూ ఆర్థిక మంత్రి హరీష్ రావు బీజేపీ మీద ఒక ఆసక్తి కరమయిన వ్యాఖ్య చేశారు. బిజెపిలో నాయకత్వం కోసం బండి సంజయ్ వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్లుగా అగ్గిరాజుకుందని హరీశ్ రావు అన్నారు.
ఇది అక్షరాల నిజం. హరీష్ దీనిని సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి అని సూక్ష్మీకరించినా, నిజానికి తెలంగాణ భారతీయ జనతా పార్టీలో నడుస్తున్న ఫైట్ ‘హైదరాబాద్ వెర్సెస్ రెస్ట్ ఆఫ్ తెలంగాణ’.
ఏమయినా హరీష్ రావు కామెంట్ బిజపి లో పరిస్థితికి అద్దం పట్టింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద హైదరాబాద్ కు చెందిన ముగ్గురు నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. మొదట ఇద్దరే ఉండే వారు. మీడియా కథనాల ప్రకారం తాజాగా సంజయ్ మీద గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తిరుగుబాటు చేశారు. దీనితో సర్కిల్ కంప్లీట్ అయింది. హైదరాబాద్ లో ఉన్న నేతలంతా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన బిజెపి కొత్త టీమ్ ను వ్యతిరేకిస్తున్నారన్నమాట.
మొన్నలోక్ సభ ఎన్నికల్ల ఫలితాలో బిజెపిలో హైదరాబాద్ డామినేషన్ కు హైకమాండ్ చెక్ పెట్టింది.
గతంలో బిజెపిని ఎపుడూ హైదరాబాదే నాయకత్వమే శాసిస్తూ వచ్చింది. హైదరాబాద్ నుంచే పార్టీ అధ్యక్షుడుండే వాడు. పార్టీ అంటే ఆయనే. ఆయన చుట్టూర పార్టీ తిరిగేది.
దత్తాత్రే య కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు లేదా లక్ష్మణ్ కావచ్చు. లేదా అంతకు ముందున్న రామచంద్రారెడ్డి కావచ్చు. వీరంతా హైదరాబాదీయులే. వీళ్ల హాయంలో జిల్లా నాయకత్వానికి గుర్తింపు లేదు.
అయితే, లోక్ సభ ఎన్నికల్లో కథ మారింది. హైదరాబాద్ మసకబారింది. తెలంగాణ రూరల్ నుంచి ముగ్గురు కొత్త వాళ్లు -బండి సంజయ్ (కరీంనగర్ ), ధర్మపురి అర్వింద్ (నిజాంబాద్), సోయంబాపూరావ్ (ఆదిలాబాద్)- నుంచి గెలవడం హైదరాబాద్ ప్రాముఖ్యం తగ్గిపోయింది.
హైదరాబాద్ నుంచి గెలిచింది కిషన్ రెడ్డి ఒక్కరే. దానికితోడు హైదరాబాద్ నాయకులు రూలింగ్ పార్టీతో ఏదో విధంగా అనుబంధం మెయింటెన్ చేస్తున్నారనికూడ పార్టీలో అనుమానముంది. దీనితో ఏకంగా ఎక్కడో కరీంనగర్ లో ఉండిన బండి సంజయ్ ని పార్టీకి అధ్యక్షుడిని చేశారు.
ఈయన వచ్చాక ఎవరూ వూహించలేనంతగా పార్టీని తన గ్రిప్పులోకి తీసుకున్నారు. దానికి తోడు ఆయన రూరల్ ఎంపిలతో బాగా సమన్వయం చేసుకుంటున్నారు. ఈ రూరల్ నేతలంతా కలసి దుబ్బాక ఎన్నికల్లో టిఆర్ ఎస్ ను ఓడించారు. ఇపుడు ఈ టీమ్ కు ఒక ఎమ్మెల్యే (రఘనందన్ రావు) కూడా తోడయ్యాడు.
కేంద్రంలో మంత్రి అయినా కిషన్ రెడ్డి కి దుబ్బాక ఎన్నికల్లో పెద్దగా భాగస్వామ్యమీయలేదు. దీనికి తోడు దుబ్బాక గెలుపు నుంచి సంజయ్ కు విపరీతంగా గుడ్ విల్ వచ్చింది.
ఈ నేపథ్యంలో జిహెచ్ ఎంసి ఎన్నికలొచ్చాయి. ఇందులో సంజయ్ టీమ్ మళ్లీ విజృంభించింది.
టిఆర్ ఎస్ కు కొద్దిగా కంపరం పుట్టించింది. దీనితో జిహెచ్ ఎంసి ఎన్నిక టిఆర్ ఎస్ వర్సెస్ బిజెపిగా మారిపోయింది. నిన్నటినుంచి టిఆర్ ఎస్ ఎన్నికల ప్రచారం చేస్తున్న మంత్రులు కెటిఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, దయాకర్ రావు, హరీష్ రావు పార్టీ సెక్రెటరీ జనరల్ కె కేశవరావులు బిజెపి నెంబర వన్ శత్రువుని చేసి మాట్లాడుతున్నారు. వాళ్ల క్యాంపెయిన్ లో కాంగ్రెస్ ప్రస్తావనే లేదు, ఇది బిజెపికి ముఖ్యంగాఒక విధంగా సంజయ్ కు నైతిక విజయమే.
దీనితో హైదరాబాద్ టీమ్ ఇరుకున పడిందని చెబుతున్నారు. ఏదోవిధంగా సంజయ టీమ్ ప్రాముఖ్యాన్ని డైల్యూట్ చేసేందుకు సినిమా యాక్టర్, జనసేన నేత పవన్ కల్యాణ్ రంగంలోకి దించేందుకు వీళ్లు ప్రయత్నం చేశారనే విమర్శ మొదలయింది.
పవన్ ని రంగంలోకి తీసుకురావడం వెనక హైదరాాబాద్ టీమ్ హస్తం ఉందని గ్రహించిన బండి సంజయ్ దానికి అడ్డుకట్ట వేశారు.
ఇపుడు వీళ్లే పార్టీ లో టికెట్ రాని వాళ్లని నాయకత్వం మీద తిరగబడే లా చేశారని విమర్శలు వినబడుతున్నాయి.
“టికెట్ రాలేదని బీజేపీ ఆఫీసులో అంగీలు, లాగులు చింపుకుంటున్నారు. కుర్చీలు గాలిలోకి ఎగురుతున్నాయి. తలలు పగులగొట్టుకుంటున్నారు. బీజేపీ నేతలమధ్యే సయోధ్య లేదు. వీళ్లు ఇంక ప్రజల కోసం ఏం చేస్తారు,” హరీష రావు దాన్ని బాగా హైలైట్ చేశారు.
మరొక వైపు తన ప్రాముఖ్యం తగ్గించారని, గోషా మహల్ ప్రాంతంలో తనను సంప్రదించకుండా టికెట్ పంచారని ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.
రేపు తాను హైకమాండ్‌కు లేఖ రాస్తానని కూడా ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా ఆయన విడుదల చేశారు.
‘బండి సంజయ్ అన్న నన్ను మోసం చేసిన మాట వాస్తవం.నా నియోజకవర్గం వరకు నేను చెప్పిన వారికే టికెట్ ఇవ్వాలని అడిగాను.150 డివిజన్ లలో ఎక్కడ అడగను అని చెప్పాను. ఇక్కడ నాయకులు ఇస్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు.నన్ను గెలిపించిన కార్యకర్తకు నేను టికెట్ ఇప్పించుకోలేక పోయాను,’ అని రాజాసింగ్ ఆగ్రహంగా ఉన్నారు.
ఈ లోపు సంజయ్ ని జిహెచ్ ఎంసి ఎన్నికల బాధ్యతలనుంచి తప్పించారని మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం కూడా మొదలయింది.
మొత్తానికి చెప్పొచ్చేదేమంటే తెలంగాణ బిజెపిలో హైదరాబాద్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ తెలంగాణ మ్యాచ్ జోరుగా సాగుతూ ఉంది. ఎవరు గెలుస్తారో చూడాలి.
లేక ఇద్దరు కొట్టుకుని జిహెచ్ ఎంసిలో టిఆర్ ఎస్ ను ఎదురు లేని శక్తిగా మారుస్తారేమో చూడాలి.