ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి “ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఏర్పాటు జరిగి 67 సంవత్సరాలైనా”, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కీలకమైన రాయలసీమ హక్కుల పత్రం “శ్రీబాగ్ ఒడంబడిక” లోని “ఏ ఒక్క ఒప్పందం అమలు కాలేదు”. దీనికి నిరసనగా “నవంబర్ 16, 1937” న జరిగిన “శ్రీబాగ్ ఒడంబడిక” ను వెలుగులోనికి తీసుకొని రావడానికి, రాయలసీమ పట్ల పాలుకుల నిర్లక్ష్యాన్ని సమాజం ముందుంచడానికి , పాలకులపై ఒత్తిడి పెంచడానికి, రాయలసీమ అభివృద్ధి సాధించడానికి “రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక అధ్వర్యంలో నవంబర్ 16 న “రాయలసీమ సత్యాగ్రహం” ను 2018 నుండి నిర్వహిస్తున్నాము. విజయవాడ కేంద్రంగా రాయలసీమ సత్యాగ్రహం ను నవంబర్ 16, 2018 న పెద్దఎత్తున నిర్వహించాము. అనంతపురం కేంద్రంగా రాయలసీమ సత్యాగ్రహం ను నవంబర్ 16, 2019 న భారీగా నిర్వహించాము. గత రెండు సంవత్సరాలుగా రాయలసీమ సత్యాగ్రహం పెద్ద ఎత్తున నిర్వహించడం వలన, శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించాలి, పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణతో రాయలసీమ అభివృద్ధి జరపాలి అనే డిమాండ్లను బలంగా వినిపించ గలిగాం.
పాలకులు శ్రీబాగ్ ఒడంబడికను గుర్తించి, అందుకు అనుగుణంగా అభివృద్ధి చేపడతామని శాసన సభలో ప్రకటనలు కూడా చేసారు. శ్రీబాగ్ ఒడంబడిక నేపథ్యంలో న్యాయ రాజదానిని రాయలసీమలో ఏర్పాటు చేయడానికి చట్టసభలో శాసనాలు కూడా చేసారు. సాగునీటి అభివృద్ధికి కూడా అనేక ప్రకటనలు చేసారు.
రాయలసీమకు ఇచ్చిన హామీలు, పాలకుల ప్రకటనలు కార్యరూపం దాల్చడంలో వైపల్యాల చారిత్రక నేపధ్యంలో, ఇవి అన్ని కార్యరూపం దాల్చి పూర్తి అయ్యేంత వరకు, మన చట్టబద్ధ హక్కులున్న నీటిని సక్రమంగా పొందేందుకు నిర్మాణాలు చేపట్టేంత వరకు అలుపెరగని పోరాటం చేయాల్సిన అవసరాన్ని వేదిక గుర్తించింది.
రాయలసీమ అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రాయలసీమ అభివృద్ధి అంశాల పట్ల స్పందించని రాజకీయ పార్టీల వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం కూడా అంతే ఉందన్న విషయాన్ని కూడా వేదిక గుర్తించింది.
ఈ నేపధ్యంలో రాయలసీమ అభివృద్ధికి రాజకీయ పార్టీలు నిర్మాణాత్మకంగా పనిచేసేలాగా, వాటిపై ఒత్తిడి పెంచే కార్యక్రమంలో భాగంగా శ్రీబాగ్ ఒడంబడిక జరిగిన నవంబర్ 16 న రాయలసీమ సత్యాగ్రహం – 2020 ని నిర్వహించడమైనది.
“కోవిడ్ – 19” పూర్తిగా వైదొలగని కారణంతో గతంలో సత్యాగ్రహం నిర్వహించినట్లుగా ఒక పట్టణంలో కేంద్రీకృతంగా కాకుండా రాయలసీమలోని అనేక గ్రామాలలో, పట్టణాలలో రాయలసీమ సత్యగ్రహం – 2020 నిర్వహించాము. అనేక గ్రామాలు/ పట్టణాలలో శ్రీబాగ్ ఒడంబడిక, ఒప్పంద ఉల్లంఘన, రాయలసీమ పట్ల పాలకుల నిర్లక్ష్యం, ప్రజా కర్తవ్యం తదితర అంశాలపై అవగాహన, చైతన్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాము. దీనికై కరపత్రాలను, వాల్ పోస్టర్స్ ను ముద్రించి విడుదల చేయడం, గ్రామ గ్రామానా రచ్చబండ సమావేశాలు, సామాజిక సమాచార సాధనాల ద్వారా ప్రచారంతో పాటు మూడు అంతర్జాల సమావేశాలను నిర్వహించాము. రాయలసీమ సత్యాగ్రహం – 2020 రాయలసీమలోని అనేక గ్రామ / పట్టణాలలో ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల వద్ద విజయవంతంగా నిర్వహించాము. రాయలసీమ సత్యాగ్రహం – 2020 సందర్బంగా “రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సభ్య సంస్థలు రాయలసీమ వ్యాప్తంగా 369 కేంద్రాలలో కార్యక్రమాలు నిర్వహించాయి”.
ఈ సత్యాగ్రహంలో భాగంగా గ్రామ/వార్డు సచివాలయ అధికారులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యుల ద్వారా ప్రజల భాగస్వామ్యంతో పాలకులకు వినతి పత్రాలను పంపించే కార్యక్రమం ప్రభావవంతంగా జరగింది. మాజీ ప్రజా ప్రతినిధులకు కూడా వినతి పత్రాలు అందచేయడం జరిగింది.
రాయలసీమ సత్యాగ్రహం – 2020 కింద వివరించిన ప్రధానమైన డిమాండ్లను పాలకుల ముందుంచింది. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు నిర్మాణాత్మకంగా వ్యవహరించడానికి ఈ డిమాండ్లను రాజకీయ పార్టీల ముందుంచింది.
న్యాయ రాజధానిలో భాగమైన కృష్ణా నది యాజమాన్య బోర్డును, కృష్ణా నది నీటి పంపిణి నిర్వహణకు అత్యంత కీలకమైన శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలి.
కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కల్వకుర్తి – నంద్యాల జాతీయ రహదారిలో భాగంగా సిద్దేశ్వరం వద్ద నిర్మించే వంతెనతో పాటు అలుగు నిర్మాణం చేపట్టాలి.
రాయలసీమ సాంప్రదాయక వనురులైన చెరువుల, కుంటల నిర్మాణానికి, పునరుద్దరణకు, వీటిని వాగులు, వంకలు, కాలువలతో అనుసంధానం చేయడానికి మరియు సామాజిక అడువుల పెంపకంతో పర్యావరణ పరిరక్షణకు సమగ్ర కార్యక్రమాలు చేపట్టడానికి ప్రత్యేక ఇరిగేషన్ కమీషన్ ఏర్పాటు చేయాలి.
ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందే తుంగభద్ర డ్యాం నుండి నీరు పొందుతూ చట్టబద్ద హక్కులున్న కే సి కెనాల్, తుంగభద్ర ఎగువ కాలువ (HLC), తుంగభద్ర దిగువ కాలువ (LLC) లకు కేటాయించిన నీటిలో సగం నీరు కూడా తెలుగు రాష్ట్రం ఏర్పడి 67 సంవత్సరాలైనా పొందలేక పోతున్నాయి. ఈ ప్రాజక్టులకు నీరు సక్రమంగా అందడానికి గుండ్రేవుల రిజర్వాయర్, తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, వేదవతి పై గుళ్యం వద్ద బ్యారేజి మరియు ఎత్తిపోతల ద్వార LLC కి అనుసంధానం ప్రధమ ప్రాధాన్యతతో చేపట్టాలి.
సుమారు నాలుగు దశాబ్దాల క్రితం నిర్మాణం మొదలుపెట్టిన తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజక్టులకు నీటి కేటాయింపులు, నిధుల కేటాయింపులు చేసి యుద్ధప్రాతిపాధికన పూర్తి చేయాలి.
న్యాయ రాజధానితో పాటు రాష్ట్ర సచివాలయంలోని కొన్ని విభాగాలు, రాష్ట్ర స్థాయి కమీషనరేట్లు, కార్పోరేషన్లు సమప్రాతిపధికన రాయలసీమలో ఏర్పాటు చేయాలి.
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక ప్యాకేజి, కడప ఉక్కు పరిశ్రమ, గుంతకల్లు రైల్వే జోన్, అనంతపురంలో AIMMS, కర్నూలులో జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతిలో కాన్సర్ ఇన్స్టిట్యూట్ లను ఏర్పాటు చేయాలి.
రాయలసీమ సత్యాగ్రహం – 2020 పాలకుల ముందుంచిన వివిధ స్థానిక సమస్యలను పరిష్కరించాలి.
రాయలసీమ సత్యాగ్రహం – 2020 విజయవంతం చేసిన వేదిక సభ్య సంస్థలకు, వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున అభినందనలు. సత్యాగ్రహానికి బాసటగా నిలిచిన ప్రజాస్వామిక వాదులకు, పత్రికా విలేఖరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలు.
(బొజ్జా దశరథ రామి రెడ్డి,కన్వీనర్,రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక, 98480 40991)