మొత్తానికి భారతీయ జనతా పార్టీకి, జనసేనకు హైదరాబాద్ ఎన్నికల్లో పొత్తు కుదర్లేదు. పవన్ కల్యాణ్ కూడా ఈ విషయం మీద స్పష్టత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో లాగానే
తెలంగాణలో బీజేపీతో కలిసి పని చేస్తామని జనసేన అధినేత ప్రకటించారు. అయినా, బండి సంజయ్ నాయకత్వంలో ముందుకు పోతున్న బిజెపి ఆయన సాయం తీసుకుంటుందా అనేది ప్రశ్న.
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలివాలి. జిహెచ్ ఎం సి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో జనసైనికులకు అసంతృప్తి ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేయరాదని నిర్ణయం తీసుకున్నాం. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుంది,’’ అని పవన్ చెప్పారు.
అసలు బిజెపికి జనసేనకు పొత్తు ఎందుకు కుదర్లేదు?
దీనికి గురించి బిజెపి వర్గాల్లో ఆసక్తికరమయిన కథనం ఒకటి ప్రచారంలో ఉంది.
పొత్తుకోసం నిన్ననే చివరి క్షణంలో ప్రయత్నాలు జరిగాయి. ఎన్నికలు డిసెంబర్ లో కాకపోతే, జనవరిలోనో, ఫిబ్రవరిలోనో జరగాలి. జరిగితీరాలి. ఇలాంటపుడు పొత్తుకోసం ఒక నెల రోజుల ముందు ఎందుకు ప్రయత్నం జరగలేదు.
సడన్ గా నిన్ననే జనసేన నుంచి పొత్తు కోసం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో పవన్ సమావేశం అవుతున్నట్లు ప్రకటన వెలువడింది. ఎందుకలా జరిగింది?
ఇది బండి సంజయ్ కు చీకాకు కలిగించింది. అలాంటి సమావేశమేమీ లేదని, బిజెపి ఇప్పటికే అన్ని డివిజన్లకు అభ్యర్థులను ప్రటించిందని ఆయన స్ఫష్టం చేశారు.
అయితే, ఈ రోజు కేంద్రహోం శాఖసహాయ మంత్రి జి కిషన్ రెడ్డి, బిజెపి మాజీ అధ్యక్షుడు లక్ష్మన్ పవన్ ను కలిశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నేత పవన్ కల్యణ్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. బిజెపి అధ్యక్షుడు సంజయ్ రాలేదు. వచ్చింది కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మాత్రమే. ఈ సమావేశంలో పోటీ చేయరాదని జనసేన నిర్ణయించింది.
తెరవెనకటి కథ
అయితే, జనసేనాని పవన్ తో పొత్తు పెట్టుకోవడం బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు ఇష్టం లేదని విశ్వసనీయ సమాచారం.
దీనికి కారణం, దుబ్బాక విజయంలో వూపులో ఉన్న సంజయ్ జిహెచ్ ఎంసి లో కూడా పార్టీని గెలిపించే బాధ్యత తనొక్కడి మీద వేసుకుంటున్నాడు.
దుబ్బాక విజయం క్రెడిట్ ఆయనకు దక్కింది. ఇపుడు మరొక వ్యక్తి ముఖ్యంగా సినిమా గ్లామర్ ఉన్న పవన్ బిజెపి గెలుపుకు ప్రచారం చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయమని తెలిసింది.
దీనితో బిజెపి లో ఒక వర్గం గుర్రుగా ఉంది. ఇపుడు పొరపాటున జిహెచ్ ఎంసిలో కూడా బిజెపి గెలిస్తే.. గెలకవపోయినా ప్రతిపక్ష పార్టీగామారినా ఇక సంజయ్ కు తిరుగుండదనేది వారి భయమని చెబుతున్నారు.
అందువల్ల బిజెపితో జనసేనకు పొత్తు కుదిరించి, ప్రచారం చేయించి, రేపు వచ్చేక్రెడిట్ పూర్తిగా బండి సంజయ్ కు రాకుండా ఉండాలని కొంతమంది నేతలు పవన్ తో చర్చలు ప్రారంభించారని సంజయ్ అభిమానులు చెబుతున్నారు.
వాళ్లంతా లక్షణ్, కిషన్ మీద బాగా ఆగ్రహంతో ఉన్నారు. పవన్ ను ప్రచారానికి కూడా పిలువ రాదని సంజయ్ మద్దతుదారులు ‘ట్రెండింగ్ తెలుగు న్యూస్’ కు చెప్పారు.
‘‘మంచికైనా చెడుకైనా జిహెచ్ ఎంసి ఎన్నికల్లోబిజెపి స్వయంగా పోటీ చేయాలి. ప్రచారం చేయాలి. బలమెంతో నిరూపించుకోవాలి,’ అని ఒక మద్దతుదారుడు ఆవేశంగా చెప్పారు.
పవన్ కల్యాణ్ ని రంగంలోకి తీసుకురావడం వెనక దురుద్దేశం ఉందని ఆయన అన్నారు.
అందుకే ఈ చర్చలకు సంజయ్ దూరంగా ఉన్నారని ఆయన తెలిపారు.
పవన్ కల్యాణ్ ఆంధ్రలో ఘోరంగా విఫలమయ్యారని, ఇక తెలంగాణలో ఆయన ఎలా పనిచేస్తారని ఆయన ప్రశ్నించారు.
ఏది ఏమయినా తెలంణ రాజకీయాల్లో ఈ సారి కూడా పవన్ ఎంటర్ కాలేకపోయారు. ఇంకెపుడవుతారు?