హైదరాబాద్ కు ఇంతవరకు ముగ్గురు మేయర్లు ఉండినారు. ఇందులో ఒకరు రాణి కుముదినీ దేవి (23 జనవరి 1911- 6ఆగస్టు 2009). మిగతా ఇద్దరు సరోజనీపుల్లారెడ్డి, బండకార్తీకరెడ్డి.
ఇందులో రాణి కుముదిని తొలిమహిళా మేయర్. రాజకీయాలు సేవా కార్యక్రమం అనే ‘సత్తెకాలం’ లో ఆమె మేయర్ గా ఉన్నారు. దానికి తోడు అధునిక లిబరల్ విలువలున్న జమిందారీ కుటుంబం నుంచి రావడం కూడా ఆమె ధైర్యంగా ప్రజల మధ్యకు వచ్చి తన పదవీ కాలమంతా సేవచేసేందుకు తోడయింది.
ఏదయినా మంచిపని చేద్దాం, పేరొస్తుందని ఆమె ఎపుడూ ఉవ్విళ్లూరారు. హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా ఉన్నపుడు, అంతకు ముందు, ఆ తర్వాత కూడా ఆమె సేవాకార్యక్రమాలు వదల్లేదు. 90 వ సంవత్సరం పడే దాకా ఆమె చురుకుగా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు.
ఈ కారణాలతోనే రాణికుముదినీ దేవి హైదరాద్ మునిసిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఒక మరపురాని అధ్యాయంగా నిలిచిపోయారు.
ఇపుడు రాజకీయాలు బాగా భారీ వ్యాపారమయ్యాయి. టికెట్ అడిగితే, ఏ మాత్రం ఖర్చు పెట్టకుంటావ్ అని పార్టీనేతలు ప్రశ్న వేస్తున్నారు. ఇలాంటపుడు హైదరాబాద్ కు మళ్లీ ఒక మహిళ మేయర్ గా రాబోతున్నారు. డిసెంబర్ 1 జరిగే ఎన్నికల్లో మేయర్ సీటును మహిళకు కేటాయించాలని లాటరీ పద్ధతిలో నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో రాణి కుముదిని దేవీ సహజంగానే గుర్తుకొస్తుంది. నివాళులర్పించాలనిపిస్తుంది.
రాణికుముదిని దేవి 1955 నుంచి 1964 దాకా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ గా ఉన్నారు. 1962లో హైదరాబాద్ మేయర్ అయ్యారు. బహుశా నాటి రాజకీయాలే కావచ్చు ఆమె సంపాదనకంటే సేవకే పెద్ద పీట వేశారు. రాజకీయాలల్లో అమె ప్రత్యేకత చాటుకున్నారు. ఆమె జీవితం, మేయర్ పదవి… రాజకీయాలకోసం కాకుండా ప్రజల కోసం కేటాయించారు.
గత నెల హైదరాబాద్ వరదల్లాగే రాణి కుముదిని దేవీ మేయర్ గా ఎన్నికయిన కొన్ని నెలల్లోనే సెప్టెంబర్ 18,1962న హైదరాబాద్ కు వరదలొచ్చాయి. నగరంచుట్టూర ఉన్న అనేక చెరువుల కట్టలు తెగిపోయాయి. మూసి పొంగింది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరద పరిస్థితిని ఆమె చాలా చాకచక్యంగా అదుపులోకి తెచ్చారు. నిరాశ్రయేలకు ప్రభుత్వషెల్టర్లు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఆమె చాలా స్వతంత్రంగా పనిచేసే వారని పేరొచ్చింది. పైవాళ్ల రాజకీయ పెత్తనానికి ఆమె అవకాశమీయలేదు.రాష్ట్ర ప్రభుత్వంతో చాకచక్యంగా వ్యహరిస్తూ సాయం పొందుతూ వచ్చారు. ఈ విషయంలో ఆమె చాలా ప్రతిభావంతురాలు. 1962నాటి వరద పరిస్థితులను, అప్పటి హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసిహెచ్) దానిని ఎలా ఎదుర్కొందనేది ఆమె బయాగ్రఫీలో కూడా రాశారు. ఇపుడున్న హైదరాాద్ ఈ షేప్ లోకి వచ్చేందుకు మొదటి మహిళా మేయర్ తీసుకున్న చాలా నిర్ణయాలు కూడా దోహదపడ్డాయని ఆమె గురించి తెలిసిన వారు చెబుతారు.
ఇంతకీ రాణి కుముదిని ఎవరు?
ఆమె హైదరాబాద్ సంస్థానంలో డిప్యూటీ ప్రధానిగా పనిచేసిన పింగళి వెంకటరమణారెడ్డి కూతురు. వరంగల్ జిల్లా వాడెపల్లిలో ఆమె జన్మించారు. ఆ రోజుల్లో ఈ కుటుంబాల మీద ఇంగ్లీష్ వాళ్ల ప్రభావం బాగా ఉండేవి. తమ పిల్లలు కూడా ఇంగ్లీష్ వాళ్లలాగా పెరగాలని భావించేవాళ్లు. అందుకే మగపిల్లల్లాగనే కుముదిని దేవీ సైకిల్ తొక్కడం, గుర్రపుస్వారీ చేయడం,హాకీ , పుట్ బాట్, టెన్నిస్ ఆడటం నేర్చుకున్నారు.. ఇలా ఆమె ఆధునిక పంధాలోకి వచ్చారు. స్వతంత్ర వ్యక్తిత్వం అలవర్చుకున్నారు. ఆమెకు 1928లో రాజా రామ్ దేవ్ రావ్ తో వివాహమయింది. తన కిష్టమయిన రీతిలో సామాజిక రంగంలో పని చేసేందుకు ఆమెకు భర్త నుంచి కూడా ప్రోత్సాహం లభించింది. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇది బాగా దోహదపడింది.
కౌన్సిలర్ గా ఉన్నపుడు ఆమె సేవా దృక్పధంతో పని చేశారు. మేయర్ అయ్యాక కూడా దానిని కొనసాగించారు. మేయర్ గా ఆమె చేసిన పనులు అనేకం ఇంకా సజీవంగా ఉన్నాయి. హైదరాబాద్ లో లిబర్టీ సర్కిల్ వద్ద ఉన్న జిహెచ్ ఎంసి కార్యాలయం అక్కడి నిర్మించేందుకు అవసరమమయిన భూమి లభించేందుకు ఆమె కృషియే కారణం. నౌబత్ పహాడ్ మునిసిపాలిటిలోకి తెచ్చింది కూడా ఆమెయే.అక్కడ వరదలొచ్చేప్రమాదం ఉన్నందున అక్కడి నిర్మాణాలను తొలగించి పార్క్ ఏర్పాటుచేయాలనుకున్నారు. అక్కడే తర్వాత బిర్లా మందిర్, ప్లానెటేరియం వచ్చాయి.
సేవా కార్యక్రమాలు
ఆమె రాజకీయాల్లో ఉన్నపుడు చేసిన సేవకార్యాక్రమాలకు లెక్కలేదు. ఆమె ఎంసిహచ్ హెల్త్ కమిటీ ఛెయిర్ పర్సన్ గా ఉన్నపుడు జహీరాబాద్ లో ఉన్న లెప్రసీ హోం ను చూసి ఉత్తేజం పొందారు.అలాంటిది హైదరాబాద్ లో ఏర్పాటుచేయాలనుకున్నారు. ఆది 1958లో ‘శివానంద రిహాబిలిటేషన్ హోం’గా కార్యరూపం దాల్చింది. తన అధ్యాత్మిక గురువు స్వామి శివానంద పేరుతో ఈ సంస్థను ఆమె ఏర్పాటు చేశారు. కూకట్ పల్లిలో ఇప్పటికీ ఇది ఉజ్వలంగా ఉంది.
లెప్రసీ వారికి సేవచేయడం, పునరావాసం కల్పించడానికి ఆమె చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆమెతో స్ఫుర్తి పొంది చాలా మంది ఈ రంగంలో అమెతో పాటు పని చేసేందుకు ముందుకు వచ్చారు. దీనితో ఆమె అనేక సంస్థలను కూడా స్థాపించి రకరకాల సేవా కార్యక్రమాలు చేశారు. పురేందర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు. చైతన్యమెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మదర్ అండ్ చైల్డ్ సొసైటీ,సేవాసమాజం బాలికా నిలయం. చూఢామణి వృద్ధాశ్రమంలను స్థాపించారు. ఆమెకు లెక్కలేనన్ని అవార్డులు కూడా వచ్చాయి. 98వ యేట ఆగస్టు 6,2009 న అమెచనిపోయారు.