1977 నవంబర్ 19
ఈ తేదీ గుర్తుందా?. ఇదంతా సులభంగా మరచిపోయే తేదీ కాదు. కన్నీళ్లతో చెక్కిన చెరగని శిలాక్షరాలవి.
ఊపిరి ఊదాల్సిన గాలి ప్రాణాలు తీస్తుందని, జీవితాన్ని నిలబెట్టాల్సిన నీళ్లు మెడకు ఉరితాడై చుట్టుకుంటాయని, నమ్ముకున్న ప్రజలను ఓలలాడించాల్సిన అలలు ఖడ్గంగా మారిపోయి వందల వేల ప్రజలను నరికేస్తాయని… ఆ రోజు గుర్తుచేసింది. ఆ రోజు దివిసీమను ఉప్పెన కభలించిన రోజు.
“మనిషి ఊపిరి కొయ్యడానికి
కత్తే కానక్కర్లేదు
జీవితాల్ని చెరచడానికి
మరుక్షణం మృతకళేబరం చెయ్యడానికి
తుపాకులూ యుద్ధాలే రానక్కర్లేదు
నూరేళ్లు నవ్వుతూ తుళ్లుతూ వేయిరేకలతో
వెలుగులు వెదజల్లుతూ పుష్పించవలసిన బతుకుల్ని
భగ్గున మండించెయ్యడానికి పెట్రోలే అక్కర్లేదు
ఉప్పు నీళ్లు చాలు
దాహం తీర్చి ప్రాణం నిలబెట్టవలసిన నీరే
గొంతు పిసగ్గలదు.”
ఇది తెలుగు కవి నగ్నముని ఈ ఉప్పెన మీద కడుపు మండి కసిగా చేసిన వ్యాఖ్య.
దివిసీమ సృష్టించిన ఆధునిక మహాకావ్యం “కొయ్యగుర్రం” కవితలోని రెండు ముక్కలివి.
ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదమయిన గొప్పకవిత. ఈ కవితకు ప్రేరణ వేదన. ఈ వేదనకు దివిసీమ ఉప్పెన సృష్టించిన బీభత్సం నేపథ్యం.
1977లో ఇదే రోజున ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆహ్లాదకరమయిన, అందమయిన దివిసీమను ఉప్పెన ముంచేసింది. రోజూ అక్కడి ప్రజలను పలకరిస్తునే ఉన్న సముద్రపు అలలు ఒక్కసారిగా రాత్రి అంతా ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో ఊర్ల మీద విరుచుకుపడి… బీభత్సం సృష్టించి, కనిపించిన వాడి నల్లా కాటేసి శవాల గుట్టలను మిగిలించి పోయిన రోజు.
ఎటుచూసినా ప్రాణాల్లేని జనం,జంతువులు, అమాయకంగా నిలిచిపోయిన నీళ్లు, కూలిపోయిన ఇళ్లు. విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్లే 90 కి.మీ దారిపోడుగునా విషాదపరుచుకుందని, శవాల గుట్టలు కనిపించాయని ఇండియా టుడే రాసింది.
అంతకు ముందు రోజు అక్కడ ఏ ప్రమాద సూచన లేదు. అక్కడి గాలి లో మృత్యు దుర్వాసన లేదు. ఆక్కడి సముద్రం అలల మీద రక్తపు మరకల్లేవు. సముద్రపు ఉప్పునీళ్లు అమయాకంగానే తీరాన్ని చక్కిలిగిలి పెడుతున్నాయి. దీని వెనక ఏముందో తెలియని ప్రజలు ఎప్పటిలాగే తమ జీవితాల్లో మునిగిపోయి ఉన్నారు.
ఉన్నట్లుండి రాత్రి చీకటిలో ఉప్పు నీళ్ల దాడి జరిగింది. గాల్లోనుంచి, ఆకాశం నుంచి, సముద్రం మీది నుంచి…ముప్పేట దాడి.
ముందటి సాయంకాలం ఎప్పటిలాగే మేఘాలు కమ్ముకున్నాయి.చినుకులు రాలాయి. ఇవి మామూలు చినుకులేనని, ఎపుడూ వచ్చిపోయే చుట్టాల్లాంటివేనని అంతా ఏమరిచారు.
జీవితానికి కొద్ది సేపు విరామం పలికి, రాత్రి నిద్రలోకి జారుకున్నారు…
అంతే, కృష్ణ-గుంటూరు తీరంలో ప్రళయం సంభబించింది. పెనుగాలులు వీచాయి. భారీ వర్షం. మృత్యూ భేరి మ్రోగిస్తున్నట్లు గాలి, సముద్రంలో పోటెత్తిన అలలు. రాత్రి తలదాచుకునేందుకు ఏమీ లేదు. ఇల్లెక్కినా అలలు వెంటబడ్డాయి.ఇల్లొదిలి గుడిలోకి వెళ్లినా అలలు వెంటబడ్డాయి. చర్చిలో దాక్కున్న అలలు వదల్లేదు.ఎటుచూసిన అలలు…అలలు, వెంటబడి తరుముతున్న అలలు.
సుమారు 100 గ్రామాలు కొట్టుకుపోయాయి. వేల మంది చనిపోయారు. లక్షల ఎకరాలలో పంట నాశమయింది. లక్షల కోట్ల ఆస్తినష్టం సంభవించింది. ఈ విషాదాన్ని అంకెలతో కొలవలేం. మాటలతో చెప్పలేం. ఈ తుఫాను బీభత్సాన్ని గుర్తు చేస్తూ, ప్రాణాలు కోల్పోయిన వారికినివాళులర్పిస్తూ అవని గడ్డలో ఒక స్మారక స్థూపం ఏర్పాటు చేశారు.
“నదుల మంచినీళ్లని కౌగిలిలోకి
తనివితీరా తాగితాగి తెగబలిసిన కొండచిలువలా
మెలికలు తిరిగి
కాలంపై భూగోళంపై ‘అలగాజనం’ ముఖాలపై
వృక్షాలపై పక్షులపై సమస్త జంతుజలంపై
చీకటి ముసుగు హఠాత్తుగా కప్పి
నీటితో పేనిన తాళ్లతో గొంతులు బిగించి
కెరటాల్తో కాటేసి వికటాట్టహాసంతో బుసలు కొడుతూ
పరవళ్ళు తొక్కింది
మనిషి బతికుండగా దాహం తీర్చలేని
ఉప్పునీటి సముద్రం
మిగిలింది కెరటాలు కాదు
శవాల గుట్టలు
శరీరాల్నుండి తెగిపోయి గాలికి ఊగుతున్న
ఊపిరి దారాలు.”
(దివిసీమ ఉప్పెన జ్ఞాపకాలకు నగ్నముని కొయ్య గుర్రం చదవడానికి మించిన మరొక మార్గమేముంటుంది)