హైదరాబాద్: ”వరద సహాయ నిధి పంపిణీని ఆపొద్దు” అని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్.
ఎన్నికల కమీషన్ గ్రేటర్ లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన నేపధ్యంలో వరద సాహాయ నిధి పంపీణీ ఆపేయాలని ప్రకటన విడుదల చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
ఎలక్షన్ కమీషన్ తీరు చూస్తుంటే విచారం కలుగుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ పది వేల రూపాయిలు కోసం అర్జీ పెట్టుకోవాలని పాపం పేద ప్రజలని రోడ్డుపాలు చేశారని ఆయన విమర్శించారు.
వరదలో సర్వం కోల్పోయిన ప్రజలు కనీసం ఆ సాయం వస్తుందనే ఆశతో రాత్రిపవలు పడిగాపులు కాసి రోడ్డుమీదే నిద్రపోయే పరిస్థితి. కానీ ఇప్పుడు వరద సహాయాన్ని నిలిపివేయాలని, గ్రేటర్ ఎన్నికల కోడ్ అమల్లో వున్న నేపధ్యంలో తక్షణమే సాహాయ వితరణ నిలిపివేయాలని ఎన్నికల కమీషన్ ప్రకటన విడుదల చేయడం చూస్తుంటే ఎలక్షన్ కమీషన్ లో కూర్చువారి మీద అనుమానం కలుగుతుందని తీవ్రంగా మండిపడ్డారు శ్రవణ్.
”ఎన్నికల కమీషన్ టీఆర్ఎస్ పార్టీకి ఒక బానిసల వ్యవహరిస్తుంది. ఒకసారి నోటిఫికేషన్ విడుదల చేసే ముందు పూర్వపరాలు పరిశీలించుకోవాలి. అసలు వరదల్లో సర్వం కోల్పోయి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న నేపధ్యంలో ఎన్నికల నోటిఫిజేషన్ విడుదల చేయడమే తప్పు.ఈ రోజు వరద సాహాయ నిధి పంపీణీ ఆపేయాలని చెప్పడం ఇంకా పెద్ద తప్పు. చూస్తుంటే కేసీఆర్, ఎన్నికల కమీషన్ కుమ్మక్కై ప్రజలని మోసం చేయాలనీ కుట్ర చేస్తున్నారనిపిస్తుంది. ఎలక్షన్ కమీషనే ఆపమని చెప్పింది కదా అని తాము సహాయం పంపీణీ చేయలేమని చెప్పి కేసీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కమీషన్, టీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కైయిందని చెప్పడానికి ఇది మరో నిదర్శనం”అని ఆరోపించారు దాసోజు.
”వరద సాహాయ నిధి పంపీణీ ఆపడం నేరం. వరద సాహాయ నిధి పంపీణీని ఆపొద్దు. మీసేవ కేంద్రాల వద్ద ప్రజలు అర్జీ పెట్టుకునే విధానం కూడా సరికాదు. దాన్ని వెంటనే తొలగించి కోవిడ్ సమయంలో ప్రజల ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు వరద సాయాన్ని కూడా భాదితుల ఖాతాలో నేరుగా జమ చేయాలి” అని డిమాండ్ చేశారు దాసోజు.
‘ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కరోనా మహమ్మారి కబళిస్తున్న కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వరద బాదితుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు అత్యంత బాధాకరం, ప్రమాదకరంగావుందని, వరద సాయం పది వేల రూపాయిలు కోసం ప్రజలని అర్జీ పెట్టుకోమని చెప్పి వారిని రోడ్డుపాలు చేయడం కేసీఆర్, కేటీఆర్ ల అహంకారాని, ప్రజల పట్ల, ప్రజల ప్రాణాల పట్ల వారికున్న చిన్న చూపుకు నిదర్శనమని” విమర్శించారు శ్రవణ్.
”కరోనా సెకెండ్ వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో ప్రజలని ఇలా రోడ్లపైకి తెచ్చి కనీసం మానవత్వం లేకుండా అహంకార పూరితంగా వ్యవహరించడం కేసీఆర్ కి తగదని, ప్రజల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న కేసీఆర్ తీరుని యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుందని, టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు పాతాళంలోకి తొక్కే రోజు దగ్గరలోనే వుందని” ధ్వజమెత్తారు దాసోజు.
”కేసీఆర్ కి మానవత్వం లేదు. వరదల్లో సర్వం కోల్పోయి సాయం కోసం చూస్తున్న ప్రజల నిస్సాయతని అదునుగా తీసుకున్న కేసీఆర్ వారి ప్రాణల పట్ల జాలి లేకుండా రోడ్లపై తీసుకొచ్చారు. పాపం.. బాధితులు రాత్రి పగలు అనే తేడా లేకుండా రోడ్లపై బిస్తర్లు పరుచుకొని అక్కడే నిద్రపోయే పరిస్థితి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రోడ్లపై బిక్కుబిక్కు మంటూ గడుపుతున్న పేద ప్రజలని చూస్తుంటే ఆవేదనగా వుంది. ఇప్పటికే కరోనా కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇలా భయంతో కాలం గడుపుతున్న వారందరినీ కోవిడ్ నిబంధనలకు విరుద్దంగా రోడ్లపై నిలబెట్టారంటే అసలు కేసీఆర్ ప్రభుత్వానికి స్పృహ ఉందా ? మీ చిల్లర రాజకీయం కోసం, ఓట్లు దండుకోవడం కోసం ప్రజల జీవితంతో చెలగాటం ఆడుతారా? ఇదేనా పరిపాలన” అని సూటిగా ప్రశ్నించారు శ్రవణ్.