ఆ మధ్య గాంధీ జయంతి సందర్భంగా వెబినార్ ద్వారా కవిసమ్మేళనం నిర్వహించారు డా. అడిగోపుల సదయ్య. ఆ కవి సమ్మేళనంలో గానం చేసిన కవితల్ని అయన సంపాదకత్వంలో గాంధీ గురించి కవితా సంకలనం వెలువరించడం ఆయన కృషికి నిదర్శనం. ఈ సంకలనంలో 76 కవితలున్నాయి. వీటిలో దాదాపు 18 మంది మహిళలు కవితలు రాశారు. నలుగురు పద్య కవితలు రాశారు. తక్కినవన్నీ వచన కవితలే.
ఈ సంకలనాన్ని కరీంనగర్ కు చెందిన ‘మహతి’ సాహితీ కవి సంగమం ప్రచురించింది. ఇందులో గాంధీ పై రాసిన కవులందరికీ అభినందనలు.
గాడ్సేకు కూడా విగ్రహాన్ని పెట్టాలని కోరుతున్న ముష్కరులున్న నేటి పరిస్థితుల్లో గాంధీ త్యాగ నిరతిని స్మరిస్తూ, ఒక కవితా సంకలనం రావడం చాలా ముదావహమైనది. దీనిలో రాసిన కవులందరూ ఇంచుమించుగా గాంధీ తత్వంపై ఏకీభవిస్తూ గాంధీ తత్వాన్ని ఆకాశంలో హరివిల్లులా భిన్న భావాలతో వ్యక్తం చేశారు.
శాంతి, అహింస గాంధీజీ మార్గాలు. సత్యాగ్రహం ఆయన ఆయుధం. సత్యంతో ఆయన ప్రయోగం చేశాడు. బుద్ధుడు అహింసకు ప్రతీకగా నిలిచాడని మనకు తెలుసు. బౌద్ధమెప్పుడైతే భారత దేశం నుండి తరిమివేయబడిందో అప్పుడే దేశం తన ఆత్మను కోల్పోయిందని గురజాడ చెప్పారు.
అయితే ఆ బుద్ధుడి బాటలో గాంధీ అహింస మార్గం తీసుకున్నాడు. సహనానికి నిలువెత్తు రూపంగా భాసించాడు. గాంధీ ఆచరణాత్మక వాది. అందుకే ‘నా జీవితమే నా సందేశం’ అని స్పష్టంగా ప్రకటించాడు. తాను చెప్పిన సత్యాన్ని ఆచరణాత్మకంగా చూపించిన మహోన్నతమూర్తి. తప్పు చేసిన వాడు తన తప్పులు ఒప్పుకోడు. కానీ ఆ తప్పుల్ని తన ఆత్మకథలుగా రాసుకున్నాడు కూడా. ఆయన దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం, మతసామరస్యం కోసం ప్రాణాల్ని ఫణంగా పెట్టాడు. అందువల్లనే ఆయన జాతిపిత అయ్యారు.
గాంధీజీ ఆశయాలను, మానవత్వాన్ని, త్యాగనిరతిని కవులు చక్కగా అర్ధం చేసుకున్నారు. వాటినే తమకవితల్లో ప్రతిబింబించారు. అయితే గాంధీజీ తత్వాన్ని వ్యక్తీకరించినంతగా వర్తమానానికి ఆయన తత్వం అవసరం గురించి చెప్పలేక పోయారు. వర్తమాన రాజకీయ సామాజిక పరిస్థితులను కవులు సరిగా అర్ధం చేసుకోలేక పోవడం కనిపిస్తుంది.
కవి ఎప్పుడూ భవిష్యత్తుకు బాటలు పరచాలి. నూతన తరానికి చైతన్యం అందించాలి. ఉన్నది ఉన్నట్లు చెప్పడం చరిత్రకారుల పని. దేశ పునర్నిర్మాణానికి ప్రజలను చైతన్యం చేయడం రచయితల పని.
ఏ వార్తా పత్రిక చూసినా నిత్యం మహిళలపై అఘాయిత్యాలు, హింస, సొంత కుటింబీకుల మధ్య హింస. మద్యం మత్తులో జరిగే అనేక అరాచకాలు దర్శనమిస్తుంటాయి. అందుకేనేమో ఆరుద్ర’ గాంధీ పుట్టిన దేశమా ఇది ! నెహ్రూ కోరిన సంఘమా ఇది !” అంటూ ప్రశ్నిస్తాడు ఒక పాటలో. నేడు సామాజిక వాస్తవికతను గమనించిన కవి పుట్టూరి చంద్రశేఖర్ “బాపూజీ మరో కోణం” కవితలో చెబుతాడు.
అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగే రోజు స్వాతంత్ర్య ఫలితమన్నావు అర్ధరాత్రి కాదు గదా ! మిట్ట మధ్యాహ్నం కూడా తిరగలేని రోజులివి మద్యపాన సేవనం అధః పాతాలమన్నావు మద్యం ఏరులై పారుతుంది. అర్ధరాత్రి కూడా” ఇటీవల మనం చూశాం.
లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయకముందే పాలకులు ఆదాయం కోసం మద్యం దుకాణాల్ని తెరిచారు. గాంధీ చెప్పిన మద్య నిషేధాన్ని తుంగలో తొక్కేశారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా రాజకీయ నాయకుల కులమత పక్షపాతాలు, అవినీతి మొదలైన దుర్గుణాల్ని కూడా కవి చంద్రశేఖర్..
“స్వార్థ రహిత పాలన నాయకుల లక్షణం ఆనాడు స్వార్థం, బంధుప్రీతి, అశ్రిత పక్షపాతాల లక్షణం ఈనాడు” అంటూ నిరసించాడు.
“అవకాశవాదం హెచ్చుమీరి స్వార్థం బుసలు కొడుతున్న ఈ సమాజాన్ని ఉద్దరించ” మళ్ళీ బాపు జన్మించాలంటారు వైరాగ్యం ప్రభాకర్.
గాంధీ నిర్వహించిన పోరాటాలకు ప్రజలతో పాటు నాయకులు వెన్నుదన్నుగా నిలిచారు నెహ్రూ, సరిహద్దు గాంధీగా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, భగత్ సింగ్, నేతాజీ మొదలైన వారెందరో ఉన్నారు. భగత్ సింగ్, నేతాజీ పోరాటాలు వేరైనా గాంధీ పోరాటాన్ని వారెప్పుడూ వ్యతిరేకించలేదు. వారందరి త్యాగ ఫలమే నేటి స్వేచ్ఛకు మూలధనం.
‘శాంతి కపోతం’ కవితలో ముత్యాలవారి ఉమ ‘మద్యనిషేధం కోరి మగువల మనసు దోచాడు/ ఆడపిల్లకు చదువే ఆభరణమని చాటాడు/మాంసాన్ని ముట్టకుండా జంతువధను నిరసించిన కరుణామూర్తి’.. అంటూ గాంధీ మహిళల వైపు ఎలా నిలబడినాడో ఆమె చెప్పింది.
అలాగే గాంధీ దళితుల పక్షాన ఎలా నిలిచాడో ముక్కా సత్యనారాయణ తన కవితలో ‘మహాత్ముని తత్వం’ లో చెపుతారు. “అస్పృశ్యతకు వ్యతిరేకంగా హరిజన పత్రిక స్థాపించి మౌలిక విద్య ప్రతిపాదించే చంపారన్ లోన పాకీ కార్మికులకు సంఘీభావం పలికె”.
అలాగే అడిగొప్పుల సదయ్య ‘హరిజనోద్ధ రణత ధర్మమనియు’ దళితుల సమస్యలపై అంబేద్కర్, గాంధీల మార్గాలు భిన్నమైనవి. దళితులను సమాజస్రవంతిలోకి తీసుకురావాలని గాంధీ సహపంక్తి భోజనాలు, దేవాలయాల్లోకి ప్రవేశాల కొరకు పోరాటాలను చేపట్టాడు. కుల నిర్మూలన జరగాలని వర్ణ వ్యవస్థ దీనికి ఆటంకంగా ఉందని డా!!బి.ఆర్. అంబేద్కర్ భావించారు. దళితులకు అధికారం రాకుండా ఇది సాధ్యం కాదని అయన భావించారు. చంపారన్‌లో పారిశుధ్య కార్మికుల పోరాటానికి గాంధీ మద్దతివ్వడం ఆయన నిబద్ధతకు నిదర్శనమని చెపుతున్నాడు.
గాంధీ అంబేద్కర్లు ఎంత పోరాడినా, ఎన్ని చట్టాలు చేసినా ఇప్పుడు కూడా గ్రామాలలో కుల వివక్షత కొనసాగుతోంది. ఇటీవల కులాంతర వివాహాలు చేసుకున్న యువతీ యువకులను, వారి తల్లిదండ్రులను హత మార్చడం చూస్తుంటే ఆ నాయకులు కలలుగన్న సమాజం ఇంకా సుదూరంలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. వారి కల నెరకవేరడానికి రచయితలు, కవులు తమ కలాలను పదను పెట్టాల్సిన అవసరం నేడు ఎంతో ఉంది.
పిళ్ళా విజయ్ తన ‘గాంధేయమే జాతికి దారిదీపం’ కవితలో..’విలువలు అఘాతంలోకి పడిపోతున్న వేళఅతని కర్రే మనకు ఆలంబన/ ఆయన నేర్పిన పాఠాలు, ఆయన రాసిన సద్భావన జాతి జీవనానికి వెలుగునిచ్చే మణిదీపాలు..’ అని ప్రకటిస్తాడు.
విలువలకు వలువలూడదీస్తున్న నేటి సమాజంలో గాంధీ మార్గమే శరణ్యం. గాంధీ విధానాలు నేడు సరిపోవని వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ గురజాడ చెప్పినట్లు కొంత స్వార్థం మానుకొని పరులకోసం పాటుపడాలి. ఇదే గాంధీ జీవితం చెప్పిన పాఠం.
కానీ నేడు పాలకులు బిల్ గేట్లని ఆదర్శం చేశారు. దీనిని మార్చాల్సిన అవసరం నేడుంది. మత విద్వేషాలకు వ్యతిరేకంగా ఆయన దృఢంగా నిలిచాడు. “ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్ కో సమ్మతిదే భగవాన్’ అంటూ ప్రార్థించాడు. అందువల్లనే హిందూ మతోన్మాదులు ఆయన్ని కాల్చివేశారు.
మతవిద్వేషాలు పెచ్చురిల్లుతున్న నేటి సందర్భంలో ప్రజలందరి ఐక్యత అవసరం. ఆ ప్రజల నుండి ఆత్మీయత అవసరం.దానిని సాధించడానికి గాంధీ తత్వమే అనుసరణీయం. ఆయన భావాలను ప్రచారం చేయాలి. ఆయన సత్య మార్గాన్ని, పోరాట పటిమను, సహనశీలతను నేటి తరానికి అందించాలి. పాఠ్య పుస్తకాల్లోకి తీసుకోవాలి.
గాండ్ల వీరమణి తన ‘జాతిపిత బాపూజీ’ కవితలో చెప్పినట్లు ‘మనమంతా మీ పథమున నడుస్తాం/మీవారసులమౌతాం/ సత్యధర్మ అహింసలను/ మా మదిలో నిలుపుతాం’ అంటూ ప్రతిన చేయాలి.
ఆచరణాత్మకంగా, గుణాత్మకంగా మంచి జీవిత విధానాన్ని మార్చుకోవాలి. అప్పుడే ఈ కవితా సంకలనంలో కవులు గాంధీ పైన వ్యక్తం చేసిన ‘కవితా ధారలు’ వాస్తవమౌతాయి. అప్పుడే సమాజం సుసంపన్నమౌతుంది.