(CS Sheriff)
భూమ్యాకాశాలు కలిసే చోట ఒక బృందావనాన్ని వూహిస్తూ, కిటికీ బయట విరబూస్తున్న గులాబీ లను విస్మరించడం మనలో చాలామందికి అలవాటు. చేయ వలసిన పనుల్ని వాయిదా వేసి, “నేను ఏదో ఒక రోజు….” అనే తాత్వికతతో బ్రతికేయడం చాలా సుళువు. అవసరం కొద్దీ పనుల్ని వాయిదా వేస్తే ఫరవాలేదు. అలవాటు కొద్దీ వేస్తేనే ప్రమాదం.
ఇంగ్లీష్ లో ప్రొక్రాస్టినేషన్ (procrastination) అనే పదానికి ఒక పనిని కానీ ఒక విషయాన్ని కానీ వాయిదాలు వేస్తూ సాగదీసి జాప్యం చేయడమనే అర్థం అయితే వుంది. ఈ గుణాన్ని చాలా మంది ఒక రాక్షసుడి తోనే పోల్చుకుంటారు ఎందుకంటే దీనివల్ల అనేక మైన కష్టాలూ, నష్టాలు వున్నాయి.
మనలో చాలా మందికి పనుల్ని వాయిదా వేయడమంటే హ్యాపీ. పనుల్ని వాయిదా వేయడానికి సోమరితనం కారణం అనుకుంటారు చాలామంది. సోమరితనం కూడా కారణం కావచ్చు కానీ, ఇదొక్కటే కారణం కాదు. ఇంతకంటే ఘనమైన కారణాలు కూడా వున్నాయి.
మనలో ప్రతి ఒక్కరూ ఎప్పుడొ ఒకప్పుడు ఏదో ఒక పని చేయడాన్ని వాయిదా వేస్తూ వుండవచ్చు. అది సహజం అయితే మనుషుల్లో దాదాపు 20 శాతం మందికి ఇలా వాయిదా వేయడమన్నది ఒక అలవాటు(ట). విచిత్రమేమి టంటే కొంత మేర ఈ ప్రక్రియలో చిన్న చిన్న సాకుల ద్వారా ఆత్మ వంచన కూడా చోటు చేసుకుంటుంది. అంటే వాయిదా వేయడం వల్ల వచ్చే కష్టనష్టాలు తెలిసి కూడా మనం ఏమీ తెలియనట్లు నింపాదిగా వాయిదా వేస్తామన్న మాట. ఇలా పనుల్ని వాయిదా వేసే వాళ్లని కార్పోరేటు సమాజం “ప్రొక్రాస్టినేటర్స్” అని పిలుస్తుంది.
ఒత్తిడి వుంటేనే పని చేయగల్గిన వాళ్లు సాధారణంగా పనుల్ని వాయిదా వేస్తారు. వీరు “రేపు చేయాల్సిన పనిని ఈ రోజే చెయ్యి. ఈరోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చెయ్యి” అన్న పెద్దల మాటను విని ” ఏమంత తొందర?” అంటారు. పరిపూర్ణతా వాదుల్లో (perfectionists) కూడా వాయిదా వేయడం ఎక్కువగానే వుంటుంది. వీరు ప్రతి పనిని పరిపూర్ణంగా, ఏ మాత్రం లోపాలు లేకుండా చేయాలనుకునే వారు. వీరి పనుల్లో చాలా సబబు లేని (unreasonable) ప్రమాణా (Standards) లుంటాయి. వీటిని సిధ్ధించుకోవడం లో పని మామూలు కంటే బరువవుతుంది. వాయిదా పడుతుంది. వీరు కాల వ్యవధి తక్కువయ్యే కొద్దీ తాము ఏర్పరచుకున్న ప్రమాణాలను సడలించు కుంటారు. ఇక దీనిలో రెండొ తరహా మనుషులు తమ మీద ఒత్తిడి కలిగితే తప్ప పని పూర్తి చేయలేని అలవాటు వున్న వాళ్లు. చాలా మంది విద్యార్థుల్లో ఇది చూడొచ్చు. సంవత్సరమంతా పోనిచ్చి పరీక్షలప్పుడు మాత్రమే చదివే మనస్తత్వం. దీన్నే స్టూడెంట్ సిండ్రోం అని పిలుస్తారు. ఇప్పుడు చదివితే తలకెక్కదు. మళ్లీ పరీక్షలప్పుడు చదవాల్సిందే అన్న మనస్తత్వం వున్న వాళ్లు. ఈ విద్యార్థులు పరీక్షలప్పుడు చదవాలి కాబట్టి చదువును సంవత్సరం పొడుగుతా వాయిదా వేస్తారు.
ఇటువంటి మనస్తత్వానికి సవాలు, పనిని మొదలుపెట్ట గలగటం. దీనికి పరిష్కారం, పని ముగిసే సమయాన్ని గుర్తించి దానికి తగినట్లు పని మొదలు పెట్టాల్సిన సమయాన్ని ముందుగా నిర్ణయించాలి. పని ముగించాల్సిన సమయం మీది కంటే మొదలు పెట్టాల్సిన సమయం మీద ఎకాగ్రత నిలిపి పనిని మొదలు పెట్టేయాలి. “సవ్యంగా మొదలు పెట్టిన పని సగం పూర్తి అయినట్లే” అన్నారు పెద్దలు.
కొంతమంది అలసట వల్ల పని చేయలేక వాయిదా వేసే వాళ్లుంటారు. ఈ అలసట కూడా కొనితెచ్చుకున్నదే. ఈ తరహా మనుషులు పనులు చేసీ చేసీ అలసి పోయి వుంటారు. కానీ, తాము అలసి పోయినట్లు ఒప్పుకోరు. “ఈ పని చేయలేను లే” అని వాయిదా వేసేస్తారు. ఇండ్లలో గృహిణులు చాలా మంది ఈ తరహా లోకి వస్తారు. వాళ్లకి విశ్రాంతి దొరకదు. అందువల్ల పనులు వాయిదా వేస్తారు. సరియైన సమయం లో సరియైన బ్రేక్ తీసుకుంటే వాయిదా వేయడాన్ని తగ్గించ వచ్చు. ఇది విద్యార్థులకు కూడా వర్తిస్తుంది. వారు చదివీ చదివీ అలసిపోయి కొన్ని చాప్టర్లను వాయిదా వేస్తారు. ఆ తరువాత వాటిని అందుకోలేక పోవచ్చు. దీని బదులుగా కొద్ది కొద్ది గా అంచెల్లో తగిన బ్రేక్ తీసుకుంటు చదవడం సుళువు. ఇంటి పనుల్లో కొన్ని మొదలు పెట్టి మధ్యలో వాయిదా వేసి వదిలిపెట్టే పనులెన్నొ వున్నాయి.
ఇటువంటి మనస్తత్వానికి సవాలు, ఒక బ్రేక్ తీసుకుని అలసట తీర్చు కోవడం. వీళ్లు బ్రేక్ తీసుకోరు. అసలు బ్రేక్ మీదికి ధ్యాస వెళ్లనే వెళ్ళదు. అందుకే అలసి పోతారు. PMP పరీక్ష నాలుగు గంటల సేపు వుంటుంది. ఈ పరీక్షలకి వెళ్లే నా స్టూడెంట్ లకి నేను ప్రతి గంటకొకసారి 5 నిముషాల బ్రేక్ తీసుకోండి అంటాను. దీనివల్ల మన సమయం 15 నిముషాలు పోతుంది కానీ అది తెచ్చే ఫలితాలు గొప్ప గా వుంటాయి. ఒక పని వాయిదా వేయాలని నిర్ణయించుకుంటున్నప్పుడు ఒక్క సారి బ్రేక్ తీసుకుని, తమని తాము రిచార్జి చేసుకోవడం వల్ల సమస్య కొంత వరకు తీరుతుంది.
ఇంకో తరహా మనుషులుంటారు. వాళ్లు ప్రతి పనీ మీద వేసుకుని, లోడ్ ఎక్కువ కావటం వల్ల చివరికి కొన్ని పనుల్ని వాయిదా వేసేస్తారు. వీళ్లు ఏ పని ముందు చేయాలి, ఎది తరువాత చేయాలి, ఏది ముఖ్యం, ఏది వాయిదా వేయొచ్చు అని చూడరు. విద్యార్థులు ఈ రకమైన సవాలును ఎదుర్కుంటారు. అంటే రొజుకి ఒక చాప్టర్ చదవగలము అనుకుంటే ఆ ఒక్క చాప్టరే చదవాలి. ముందు నుంచి సబ్జెక్టు మొత్తం దానికి అనుగుణంగానే విడదీసి పెట్టుకోవాలి. అలా కాక నాలుగైదు చాప్టర్లు చదవాల్సి వచ్చినప్పుడు కొన్ని చాప్టర్లు వాయిదా పడతాయి. వీళ్ల సమస్య ఇప్పుడు ఎదుర్కోలేక వదిలేసిన పని వల్ల భవిష్యత్తు లో కష్టాల్ని కొని తెచ్చుకోవడం . దీనికి పరిష్కారం తమని తాము ఆత్మశోధనం (introspection) చేసుకుని “నేను నిజానికి ఏం వదిలేస్తున్నాను?” అని చూసుకోవడం.
మరో తరహా మనుషులున్నారు. వీళ్లు సర్వదా నూతనత్వాన్ని వెదుకుతూ వుంటారు. ఇంతకంటె మంచి ఐడియా ఇంకోటుంది అనే మనస్తత్వం. ఒక పని చేయాలనుకుంటున్నప్పుడు ఇంకో కొత్త ఆలోచన వస్తుంది. ఒక దానిమీద నిలబడరు. ఒక కొత్త ఆలోచనని అమలు పరచాలనుకుంటారు, కానీ చివరి వరకూ వెళ్లరు. మధ్యలో మరో కొత్త ఆలోచన వస్తుంది. మొత్తానికి మొదలు పెట్టిన పని వాయిదా పడిపోతుంది. వీరి ముఖ్య సమస్య పని పూర్తి చేయడం. దీనికి పరిష్కారం కొత్త ఆలోచనలు వచ్చినపుడు వాటిని ఒక చోట రాసుకోవాలి. చేస్తున్న పని పూర్తి అయిన తరువాత ఆ రాసుకున్న విషయాలని అవలోకించాలి తప్పితే చేస్తున్న పని వాయిదా వేసి కొత్త పని లోకి దిగరాదు.
ఒక పని పట్ల అనేక పర్యాయాలు నిర్ణయాలు తీసుకోవడం తో అలసి పోవడం వల్ల పనులు వాయిదా వేస్తారు కొంతమంది. ఉదాహరణకి ఆన్ లైన్ లో మీరొక్ వాటర్ ప్యూరిఫైయర్ కొనాలనుకుంటున్నారు అనుకుందాం. మీరు ముందుగానే నిర్ణయించుకున్న కొన్ని ప్రమాణాలను అనుసరించి మీరు ఆ వస్తువుని సెలెక్ట్ చేయబోతూ ఇంకో కొత్త ఆప్షన్ చూస్తారు. అరే ఇది బావున్నట్టుందే అనుకుంటారు. అంతలో ఇంకో చొట ఒక డిస్కౌంట్ ఆప్షన్ కనబడుతుంది. ఇదా, అదా అనుకుంటారు. ఇలా అనేక మార్లు నిర్ణయాలు తీసుకోవడంలో అలసట వచ్చేస్తుంది. నిర్ణయం తీసుకునే ఓపిక తగ్గి పోతుంది. అప్పటికి ఆ వస్తువు కొనడాన్ని వాయిదా వేస్తారు. కొన్ని సార్లు ఆ వస్తువు కొనక పోవచ్చు కూడా. ఇటు వంటి సమస్యకు పరిష్కారమేమిటంటే మనకు ఏం కావాలో నిర్ణయించుకుని, ఆ ఆప్షన్లు కలిస్తే ఇక మరోవైపు చూడకూడదు, కొనేయాలి. కొంతమంది షాపింగ్ మాల్స్ కు వేళ్లి కొనాల్సిన వస్తువు కొనుగోలును వాయిదా వేసి వట్టి చేతులతో తిరిగి వస్తారు. అఫెక్టివ్ ఫోర్కాస్టింగ్ (Affective Forecasting): వల్ల కూడా మను షులు పనుల్ని లేదా తమ నిర్ణయాల్ని వాయిదా వేస్తారు. భవిష్యత్తులో ఒక విషయం పట్ల తాను ఎలా ఫీల్ అవుతాను అని ఊహించడాన్ని అఫెక్టివ్ ఫోర్కాస్టింగ్ (Affective Forecasting) అంటారు . ఉదాహరణకి, భవిష్యత్తులో ఒక లక్జురీ కారు కొంటానులే అనుకునే వ్యక్తి ఈ రోజు ఒక మామూలు కారు ను కొనడం వాయిదా వేయ వచ్చు. ఆ కారు కొంటే అది తనకు ఎలాంటి సంతోషాన్ని ఇస్తుందో ఊహిస్తాడు. తనలో తాను ఆ ఆనందాన్ని పంచుకుంటాడు. మూడ్ ఎలివేట్ చేసుకుంటాడు. అయితే నిజంగా కారు కొన్న తరువాత అతడు అంతే సంతోషాన్ని పొందలేక పోవచ్చు. ఈ సంతోషం ఊహించినంతగా వుండక కాల క్రమేణా అంతరించి పోతుంది. ఇలాగే, ఉద్యోగాలూ, విహార యాత్రలూ, సినిమాలూ, స్వంత విల్లాల విషయం లో జరగొచ్చు. బహుశా ఇలా భవిష్యత్తులో తమ ఫీలింగ్సు ను ఊహించే వారు ఇలాంటి సంఘటనలను అనుభవించిన వారితో మాట్లాడి వారి అనుభవాలు తెలుసుకుంటే కొంత మేలు.
పనుల్ని వాయిదా వేయడం వల్ల అప్పటికి మానసికంగా స్వాంతన పొందవచ్చు, కృంగదీసే మూడ్ నుంచి బయట పడవచ్చు కానీ తరువాత ఈ వాయిదా వేసిన పనుల మూల్యం చెల్లించాల్సి రావచ్చు. ఈ ప్రొక్రాస్టినేషన్ వల్ల తిరిగి తిరిగి ఆ పని తగుల్తూనే వుంటుంది. ఈ అసంపూర్తి పని వల్ల వెలితి కలుగుతుంది. దీని వల్ల న్యూనత ఏర్పడుతుంది. ఆరోగ్య పరంగా చూస్తే అది డిప్రెషన్ కు దారి తీయ వచ్చు.
ఖచ్చితంగా వాయిదా వేయకూడని విషయాలు కొన్ని వున్నాయి. ఉదాహరణకు, హెల్త్ చెకప్ లు, ఎక్సర్ సైజులు, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలనుకోవడం. ఇటువంటి విషయాల పట్ల అలసత్వం పనికిరాదు. పైన వుదహరించిన మనస్తత్వాల్లో, ఏ కారణంగా మనం పనుల్ని వాయిదా వేస్తున్నామో తెలుసుకుంటే పరిష్కారం వెతకడం కష్టమేమీ కాదు. ఎటొచ్చీ, ఈ రోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయడం వల్ల నష్టాలే ఎక్కువ. ఈ తరహాల్లో మీరే తరహాకి చెందుతారో చూసుకోండి. ప్రతి తరహాలో సవాలూ దాని పరిష్కారం సూచించ బడ్డాయి. పనులు వాయిదా వేయకుండా వుండటానికి ఇవేమయినా పనికొస్తాయేమో చూడండి.
(Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM
Consultant, PMP Certification, Project Management & Quality
Mob: +91 9849310610)
Mob: +91 9849310610)