• ఖరీఫ్ సీజన్ పంట నష్ట పరిహారాన్ని తక్షణమే చెల్లించాలి
• రైతుల నిరసన ధర్నాలో పాల్గోని మద్దతు తెలిపిన జనసేన పార్టీ రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కమిటీ సభ్యురాలు జె రేఖ, జిల్లా నాయకులు పవన్ కుమార్, టీడీపీ యూత్ నాయకులు ఎంవిఎన్ రాజు యాదవ్
తెలుగు గంగ ఆయకట్టు రైతులకు రబీ పంటకు నీళ్లు ఇవ్వాలని, ఖరీఫ్ సీజన్ పంట నష్ట పరిహారాన్ని తక్షణమే ప్రభుత్వం చెల్లించి రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కమిటీ సభ్యురాలు జె రేఖ, టీడీపీ యువ నాయకులు ఎంవిఎన్ రాజు యాదవ్ డిమాండ్ చేశారు. స్థానిక వెలుగోడు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట తెలుగు గంగ ఆయకట్టు రైతులకు మార్చి వరకు నీళ్లు ఇవ్వాలని రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు, కన్వీనర్ ఎం మోహన్, కోకన్వీనర్ బి భాస్కర్ నాయుడు అధ్వర్యంలో బిసి సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు పల్లపు శంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కమిటీ సభ్యురాలు జె రేఖ మాట్లాడుతూ తెలుగు గంగ కాలువ కింద పంటలను సాగు చేసుకునే రైతులు ఖరీఫ్ సీజన్ లో అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిని నష్టపోయారని, ఇలాంటి సమయంలో రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం ఇప్పటి వరకు పంట నష్ట పరిహారం పై సర్వే కూడా చేపించ లేదన్నారు. పాలకుల నిర్లక్ష్యం మూలంగా 15 సంవత్సరాల కాలంగా పెండింగ్లో ఉన్న తెలుగుగంగ లైనింగ్ పనులు కేవలం కమిషన్ల కోసం ప్రస్తుతం రైతులు రబీ పంటలు పండించుకునే సమయంలో నీటి సరఫరాను ఆపి చేయడం అనేది సరైనది కాదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్రాఫ్ హాలిడే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు.
టీడీపీ యువ నాయకులు ప్రభుత్వం రైతులతో సంప్రదించకుండా క్రాఫ్ హాలిడే ప్రకటించడం సరైనది కాదని, రబీ పంట పూర్తయిన తర్వాత లైనింగ్ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి రబీ సీజన్ పంట పూర్తయ్యే వరకు రైతాంగానికి నీళ్లు అందించి పంటలు పండించుకునేందుకు తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ లైనింగ్ పనులను వచ్చే ఏప్రిల్ నుండి జూన్ లోగా మూడు నెలల వ్యవధిలో పూర్తి చేసి ఆ తదుపరి సీజన్ కు కూడా నష్టం జరగకుండా చూడవలసిందిగా తెలుగు గంగ రైతాంగం తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.
విద్యార్థి సంఘాల జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు, కన్వీనర్ ఎం మోహన మాట్లాడుతూ తెలుగు గంగ లైనింగ్ పనులకు మేం వ్యతిరేకం కాదని అయితే రబీ పంట పూర్తయిన తర్వాత లైనింగ్ పనులు చేస్తే రైతులకు ఎలాంటి నష్టం ఉండదని ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం పాల్గొన్న రైతులు, రైతు సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థి జెఎసి నాయకులు తెలుగు గంగ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వెలుగోడు ప్రాజెక్టును సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఓపిడిఆర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ ఖాజా మొహిద్దిన్, జనసేన పార్టీ జిల్లా నాయకులు పవన్ కుమార్, ఆత్మకూరు నియోజకవర్గం నాయకులు శ్రీ రాములు, వెలుగోడు నాయకులు శాలు భాషా, విద్యార్థి సంఘాల జెఎసి నేతలు అర్జున్, ఎం రవి, టీడీపీ నాయకులు వేణు గోపాల్ రెడ్డి, సుబ్బా రెడ్డి, శేతు మహేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.