చెయ్యేరు నది తీరాన ‘ఆడదరి’ గురించి తెలుసా?

(త్రిభువన్)
“ఆడదరి అనే పేరెప్పుడైనా విన్నావా?” అనడిగాడు పురుషోత్తం. లేదన్నాను.
“నేనూ చాలాయేళ్ల కిందట చూసాను, ఈ ఆదివారమెళ్దామా” అన్నాడు.
“అసలదేంటో, ఎక్కడుందో చెప్పు” అన్నాను.
పురుషోత్తం కడపజిల్లా , సుండుపల్లె మండలంలో ఒక పల్లెలో టీచరు. ప్రకృతిప్రేమికుడుకాబట్టి అడవులు కొండలు అన్నీ తిరుగుతూంటాడు. మావూరుకూడా అక్కడే, మేం బాల్యస్నేహితులం. అప్పుడప్పుడూ వారాంతాల్లో కలుస్తూంటాం.
“అది వందేళ్ల నాటి సంగతి” అంటూ కథ చెప్పడం మొదలు పెట్టాడు పురుషోత్తం.
“కడపజిల్లాలో రాయచోటినుంచి రాజంపేటకు వెళ్తూంటే మధ్యలో సానిపాయి అనే ఊరి దగ్గర వేల అడుగుల ఎత్తైన కొండల వరుసలు వస్తాయి. ఇవి ఉత్తరంనుంచి దక్షిణానికి అడ్డంగా ఉంటాయి. ఇవి ఓ యిరవై మైళ్ల దూరం ఎక్కడా సందులేని రెండువరసలుగా ఉంటాయి. రెండింటి మధ్య లోయలో ‘బాహుదా’నది (చెయ్యేరు) ప్రవహిస్తూంటుంది. ఇవి నల్లమల కొండల్లో భాగం, తిరుపతి శేషాచలం కొండలకు అనుబంధంగా ఉంటాయి.
“మొదటికొండ ఎక్కి దిగాక వచ్చే నదిని దాటగానే బలరాసపల్లె వస్తుంది. ఆవూరినుండి నదివెంబడీ లోయలో కుడివైపు నడుస్తూ వెళ్తే పదిమైళ్ల తరువాత నందలూరువైపున్న అన్నమయ్య ప్రాజెక్టులో తేల్తాం. అదే ఎడమవైపు పదిపన్నెండు మైళ్లు లోయలోని నదిలో నడిస్తే సుండుపల్లి దగ్గరి రాయవరం దగ్గర బయటికొస్తాం.
“బలరాసపల్లె నుంచి రాయవరం వెళ్లేదారిలో నాలుగైదు మైళ్లు వెళ్లాక ఏటికి ఇటూ అటూ కొన్ని వందల అడుగులున్న నిలువెత్తు గోడల్లాంటి బండలొస్తాయి. వాటిని పేటులంటారు. మీ తిరుపతి కొండలమీద అంచులాగా పెద్ద రాయి కనిపిస్తుందే దాన్నే ఇక్కడ పేటు అంటారు.
ఆ బాహుదా లోయలో అక్కడ ఎడమవైపున్న పేటులో మూడొంతుల పైన ఒక చిన్న బాల్కని (గవాక్షం/దరి) లాంటి ప్రదేశం ఉంది. దాన్నే ‘ఆడదరి’ అంటారు.
వందేళ్ల కిందట బాలరాసపల్లెలోని ఐదుగురు అన్నదమ్ముల వడ్రంగుల కుటుంబంలో ఐదోవాడి భార్య మన కథా నాయకురాలు. ఆమె పేరు ప్రస్తుతానికి ‘గంగ’ అనుకుందాం. ఈ గంగ చాలా ధైర్యవంతురాలు. మగవాళ్లు భయపడే పనికూడా అవలీలగా చేస్తుంది. వందేళ్ల కిందట అదిగో సరిగ్గా ఆ పేటుదగ్గర గంగ చేసిన సాహసంవల్ల ఆ దరికి ‘ఆడదరి’ అనే పేరొచ్చిందట” అని కథను ఆపాడు పురుషోత్తం.
“ఏమిటాసాహసం” అని అడిగాను.
“మనం అక్కడికెళ్లాక చెప్తాను, కథ అక్కడ చెప్తేనే దాని గొప్పదనం అర్థమౌతుందట. మేమెళ్లినప్పుడు నాకు ఈ కథ చెప్పిన ఒక పెద్దాయన ఆవిధంగా మాటతీసుకున్నాడు” అన్నాడు పురుషోత్తం.
తిరుపతినుంచి ఆ మరుసటి శనివారంరాత్రే నేను సుండుపల్లి చేరుకుని పురుషోత్తం ఇంట్లో బసచేసాను. పొద్దున్నే ఫలహారాలు, నీళ్లు తీసుకుని బస్సులో బయలుదేరాం. మాకు ఇంకో నలుగురు మిత్రులు తోడయ్యారు.
ఒక గంట ప్రయాణించాక బస్సు సానిపాయి దాటి మొదటి కొండ ఎక్కింది. కొండపైన్నుంచి చూస్తే అవతలివైపున మరో కొండలవరస, మధ్య లోయలో చాలాకిందన సన్నగా మెలికలు తిరుగుతూ ప్రవహిస్తున్న బాహుదానది కనిపించాయి. అదొక అద్భుత దృశ్యం. నేను జీవితంలో చూసిన అతికొద్ది రమణీయ ప్రకృతిదృశ్యాల్లో అదొకటి.
బస్సు కొండదిగుతున్నకొద్దీ నది పెద్దదిగా కనిపించిడం ప్రారంభించింది. కొండ పూర్తిగా దిగకుండానే ఆకొండమీదికి వేసిన కొత్త వంతెన మీదినుంచి అవతలి కొండ చేరుకున్నాము. అక్కడ బస్సుదిగి నడుస్తూ కొండదిగి బలరాసపల్లె పక్కనుంచి నది వొడ్డుకు చేరుకున్నాము.
అప్పుడు నదిలో నీళ్లు మోకాటిలోతుకంటే తక్కువగా ఉన్నాయి నది పాయలుగా పారుతోంది. నీళ్లుపారనిచోట ఇసుకవుంది. నదివొడ్డున ఎడమవైపు తిరిగి రాయవరంవైపు నడవడం ప్రారంభించాము. అక్కడక్కడా కొండమొదలుకు నదికీ ఖాళీలేకపోవడంవల్ల నదిలోకి దిగి ఇసుకలోనో, నీళ్లలోనో చెప్పులు చేతపట్టుకుని నడవాల్సొచ్చింది.
కొద్దిదూరం నడిచాక నదివొడ్డున ఒక చిన్న పల్లెటూరొచ్చింది. ఇంకాముందుకు నడిచాక నది కుడివైపుకు తిరిగింది. ఆ తిరిగిన చోట ఎడమవైపున లోయవెడల్పై పెద్ద అందమైన సమతల ప్రదేశం ఏర్పడింది. అక్కడ వ్యవసాయం చేస్తున్నారు. దానికి ఆధారమైన నీరు ఒక కాలవలాంటి మడుగునుంచి వస్తోంది. మేం నది ఆనుకునే కుడివైపుకు నడిచాం.
క్రమంగా ఆలోయ నిర్జనమైంది. మధ్యలో నది ఇటూ అటూ నిలువెత్తు చెట్లతో కప్పబడిన కొండలవరసలు. ఆకాశం కనబడాలంటే నిలువుగా తలెత్తి పైకి చూడాల్సిందే. ఒక అద్భుతమైన పచ్చని ప్రపంచంలోకి ప్రవేశించాము.
ఒకచోట ఆగి ఫలహారాలు చేసాము. నదిలోని నీళ్లలో కాసేపు సరదాగా ఆడుకున్నాము. గట్లమీదికెక్కి చెట్లను పరిశీలించాము.
లోతైన లోయలో పారుతున్న నర్మద (Wikimedia commons)
అలా ఓ రెండుగంటలు నడిచాక నదికి రెండు వైపులా పెద్ద కోటగోడల్లాగ పేట్లు కనిపించాయి. జబల్పూర్ దగ్గర నర్మదానది, గండికోట దగ్గర పెన్నానది ఉన్నట్టుగా అక్కడ బాహుద నిలువు రాతి పేట్లమధ్య ప్రవహిస్తావుంది. నదికి ఇక అక్కడ గట్లు లేవు. ఒకవేళ వరదవస్తే తప్పించుకోవడం కష్టం, మళ్లీ గట్టు తగిలేదాకా కొన్ని పదులమీటర్లు నదిలో కొట్టుకొని పోవడమే.
గండికోట లోయలో పెన్నా నది (facebook picture)
పురుషోత్తం మమ్మల్ని అక్కడ ఆపాడు. ఎడమవైపున్న పేటు చూపించి దాని పైభాగాన్ని జాగ్రత్తగా చూడమన్నాడు.
దాని ఎత్తు ఎంతో మాకు అంచనాకి దొరకలేదు. ఐదారువందల అడుగుల ఎత్తుండొచ్చేమో అనుకున్నాము. ఆపేటు పైభాగానికి బహుశా ఓవంద అడుగుల కిందుగా నాలుగడుగుల పొడవు, వెడల్పులతో ఒక బాల్కనిలాంటిది (దరి) కనిపిస్తూంది. ఈ కొలతలు ఊహాగానమే, నిలువుగా చాలా ఎత్తులోవుందిగాబట్టి తెలియడం లేదు. అక్కడ నల్లగా ఒక బ్రహ్మాండమైన తేనెతుట్టె పెరుగుతోంది.
 “అదే ఆడదరి” అన్నాడు పురుషోత్తం.
“కథచెప్పు” అనడిగాము. చెప్పడం ప్రారంభించాడు.
“వందేళ్ల కిందట బలరాసపల్లెలో  ఐదుగురన్నదమ్ముల వడ్రంగుల కుటుంబం ఉండేది. ఇందులో ఆఖరితమ్ముడి భార్య ఐన గంగ అనే ఆమె ఇక్కడ చేసిన సాహసానికి గుర్తుగా ఆ తేనె తుట్టెవున్న గవాక్షానికి ‘ఆడదరి’ అనే పేరొచ్చిందని చెప్పాను గదా. అంతకు ముందు కాలంలో ఎంతో సాహస ప్రవృత్తిగల వీరులైన యువకులు తరానికి ఇద్దరో ముగ్గరో మాత్రమే ఆ తేనె తుట్టేనుంచి తేనెను తీయగలిగే వారంట. మన గంగ కాలంలో ఒక్కరు కూడా ఈ సాహసానికి పూనుకోలేదట. తేనె అలాగే ఉండిపోయి తేనెటీగలే తాగేసేవట.
ఇది విన్న గంగ తను తేనె తీస్తానని సవాలు చేసి సాధించడమే కాకుండా ప్రతిసంవత్సరం తీసేదట” అని ఆగాడు పురుషోత్తం.
మాకు ఇది నమ్మశక్యం కాలేదు. ఎక్కడా దారిలేని నిలువెత్టు బండమీది ‘దరి’ని మనిషి, అందులో ఆడమనిషి, చేరుకోవడమెలాగ? చేరుకున్నా తేనెటీగలనుంచి తేనెను తీయడమెలాగ? అదే అడిగాము.
“గంగ ఒకతాడు నడుముకు కట్టుకుని, కంబళి కప్పుకుని, పైన చెట్టుకు కట్టిన తాళ్లను పట్టుకుని, కాళ్లు రాతిమీద అనించి సగంజారుతూ, నెరియలదగ్గర ఆగుతూ వచ్చి ఆ దరిని చేరుకునేది. కాగడా వెలిగించి తేనెటీగలను తరిమేసి, తేనెతుట్టెను ముక్కలుగా చేసి పైన్నుంచి జార్చిన బిందెల్లో ఉంచితే పైనవున్న ఆమె భర్త, బావగార్లు తాళ్లసహాయంతో వాటిని లాక్కునేవారట”
“ఇదసలు నమ్మశక్యంగాలేదు. పొరపాటుతో కాలుజారినా, కిందికి చూసి కళ్లు తిరిగినా అక్కడినుంచి పడితే ఎముకలుకూడా మిగలవు” అన్నాము పైకి చూస్తూ.
“కాని ఇది జరిగిన కథ, ఇంకా అసలుకథ మీరు విననే లేదు” అంటూ చెప్పడం కొనసాగించాడు పురుషోత్తం.
“కొంతకాలం తరువాత ఆడమనిషైన గంగకు వస్తున్న పేరు, ఆమె సాహస ప్రవృత్తి నచ్చని ఆమె బావలు ఆమెను అంతమొందించాలని రహస్యంగా నిర్ణయించుకున్నారు. దానికి ఈ తేనె తీసే సమయమే తగినదని పకడ్బందీగా పథకం వేసారు.
ఆయేడాది వానలు విపరీతంగా పడి ఈ బాహుదా ఇరవైఅడుగుల లోతు నీళ్లతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ రోజు గంగ భర్తను వేరే పని మీద మరో వూరికి పంపి గంగ బావలు ఆమెతో ఈ పేటుపైకి చేరుకున్నారు. వాళ్ల కుట్ర తెలియని గంగ మామూలుగానే కంబళి కప్పుకుని, నడుముకు తాడు కట్టుకుని, తాళ్లు పట్టుకుని వేలాడుతూ దరికి వచ్చింది.
ఆ సంవత్సరం పడ్డ విపరీతమైన వర్షాలవల్ల పేటుపైన పెరిగిన తీగలు పేటంతా వ్యాపించివున్నాయి, పేటు చెమ్మగా వుండి గంగకు దిగడం మరీ కష్టమైంది. మొత్తం మీద ఎలాగో దరిని చేరుకుని తుట్టెని కోసి బిందెల్లో పైకి పంపాక ఇక ఆమెను పైకి లాక్కోవలసిన సమయంలో వాళ్లు ఆపని చేయకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది.
కొంతసేపటికి పైన తాడు కోస్తున్న చప్పుడు విని ఆమెకు వాళ్లు తనని చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు అర్థమైంది. ఆమె అమిత సాహసి గనుక కోపావేశాల్ని, దుఖాన్ని అధిగమించి, భయపడకుండా వెంటనే ఆలోచించి నిర్ణయించుకుంది. నడుముకున్న తాడుని విప్పేసి, ఆ పచ్చనితీగలనే కలిపి పట్టుకుంటూ, తెగిపోతే పక్కవి తీసుకుంటూ ఏటవాలుగా కదులుతూ జాగ్రత్తగా కిందికి మూడువందల అడుగులు ఎలాగో జారుతూ దిగి చివరకు బాహుదలో దూకేసింది. ఆమె అదృష్టంకొద్దీ నది వరదమీద ఉండడంవల్ల ఆమెప్రాణానికి ప్రమాదం జరగలేదు, దెబ్బలు తగలలేదు.
ప్రవాహం ఉధృతంగా ఉండడంవల్ల కొట్టుకొనిపోయి కిందెక్కడో గట్టు చేరుకుంది గంగ. ఆమె బతికేవుందని తెలుసుకున్న ఆమె బావలు ప్రాణభయంతో పారిపోయారు. అదీ కథ. ఆమె చేసిన ఈ సాహసానికి గుర్తుగా ఈ దరిని ‘ఆడదరి’ అంటారు” అని కథ ముగించాడు పురుషోత్తం.
కథవిన్న తర్వాతకూడా మాకు అది జరిగిందని నమ్మడానికి చాలాసేపు పట్టింది.
కిందినుంచి ఆపేటును, దరిని చూస్తే ఒళ్లు జలదరించింది. చాలాసేపు అక్కడే చూస్తూ నిలబడి గంగను ఒకసారి మనసారా తలుచుకుని, ఆమెకు మనసులోనే ఘననివాళి అర్పించి, ఒక గొప్ప ఙ్ఞాపకాన్ని పదిలపరుచుకుని తిరిగి వచ్చాము.
చెప్పులులేకుండా ఇసుకలో చాలాసేపు నడవడంవల్ల పాదం మధ్యభాగం నేలను అని ఇసుక గుచ్చుకుని అరికాళ్లు పుండ్లైపోయాయి. మేం నేర్చుకున్న మరో కొత్తపాఠం ఇది.
ఈ యాత్రజరిగి చాలాయెళ్లైనా స్త్రీసాహసానికి ప్రతీకగా నిల్చిన ఆ ఆడదరి గురించి తెలుసుకోవడం, ఆ అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభూతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *