ప్లాస్టిక్ పై పోరాటమంటే ఇలా వుండాలి…
(కెెఎస్ ఎస్ బాపూజీ)
ఆయనొక కలెక్టర్…
నాలుగు గోడలమధ్య కూర్చొని ఆర్డర్లు జారీచేయవచ్చు.
ఆ ఆర్డర్లు అమలయ్యేది లేనిది కిందవున్న సిబ్బందిని అడిగి తెలిసుకోవచ్చు..
కాని ఈయన అలా కాదు… సమస్య దగ్గరకే వెళతాడు… ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయమని కోరుకొంటాడు.. చేతిలో చెయ్యివేసి చెప్పమంటాడు… కలెక్టరంతవాడు అడిగితే కాదంటారా…. కాదనురుగదా.. ఇదిగో చూడండి ఈ వీడియో…
ఆ బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఒక జిల్లాకు కలెక్టర్… అతను వెళ్ళింది ఓ సామాన్యమైన ఇడ్లీ దుకాణానికి… ఇది ఈ రోజు విజయనగరం జిల్లాలో జరిగింది..
విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్ తన పర్యటనలో భాగంగా రావివలస అనే చిన్న గ్రామం వెళ్ళారు.
ఆ వూరి జంక్షన్లో ఓ ఇడ్లీ కొట్టు ఒకటుంది.కొట్టు నాయుడు మంచి రుచికరమైన ఇడ్లీలు అమ్ముతాడు. అట్లు కూడా అమ్ముతాడు. నాలుగు ఇడ్లీలు పది రూపాయలు. అట్టు ఐదు రూపాయలు. వీటితో పల్లీలతో చేసే చట్నీ ఇస్తాడు. ఆ చట్నీతో ఆ ఇడ్లీ తింటే సూపర్.. రుచి అమోఘం…
కాని ఆ కొట్టు చుట్టూ అ అపరిశుభ్రత… ప్లాస్టిక్ చెత్త.. అవి చూస్తే తినాలనిపించదు. రుచి అమోఘం.. పరిసరాలు అధ్వాన్నం.
కొట్టు గురించి విని అక్కడికి వెళ్లిన కలెక్టర్ పరిసరాలు చూసి అసంతృప్తి చెందారు. నాయుడి చేత ఒక మంచిపని చేయిస్తే బాగుంటుందనుకున్నారు.
ఆ కొట్టుకు వెళ్ళి నాయుడు జిల్లా కలక్టర్ గా నేను ఒకటి అడుగుతాను ఇస్తావా అని అడిగారు.. తబ్బిబిబ్బు అయిన నాయడు అలాగే ఇస్తాను బాబు అన్నాడు. రోజుకు వెయ్యిరూపాయల వ్యాపారం చేస్తున్నావ్… నీ ఇడ్లీలు చెట్నీ బాగుంటాయని అందరూ చెబుతున్నారు… కాని నీ షాప్ చుట్టూ చూడు ఎంత చెత్త వుందో.. అంతా ప్లాస్టిక్ చెత్త. ఈ చెత్తను రోజూ శుబ్రం చేసుకుంటానని నాకు మాటివ్వు అని అడిగారు.
ఏదో అడుగుతారూనుకున్న నాయుడుకి కలక్టర్ గారు అడిగినదానికి అవాక్కయిపోయాడు. అయ్యో బాబు ఇక రోజు చెత్తనంతా జాగ్రత్తగా శుభ్రం చేస్తానని మాటిచ్చాడు.
ఇదండీ ప్లాస్టిక్ పై కలెక్టర్ హరి జవహర్ చేసిన యుద్దం. మాటలు చెప్పడం కాదు. మనసులను దోచుకొనే విధంగా పనులు చేయిస్తున్నారాయన. ఇదేమి కొత్తకాదు విజయనగరం లో వున్న పెద్దచెరువును, అయ్యకోనేరును కూడా ఈవిధంగానే ప్రజల భాగస్వామ్యంతో శుభ్రం చేయించారు. అందుకే ఆ కలెక్టరంటే ఇప్పుడు ఆ జిల్లా ప్రజలకు చాలా ఇష్టం.
(బాపూజీ సీనియర్ జర్నలిస్టు,రచయిత)