తిరుచానూరు :తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజున శుక్ర వారం ముత్యపు పందిరి వాహనంపై వెన్నముద్దకృష్ణుడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు.
పెద్ద శేష వాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో పద్మావతి
రెండో రోజైన గురువారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠనాథుని(శ్రీ మహావిష్ణువు) అలంకారంలో శంకుచక్రాలు, గదతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవ దర్శనం వల్ల యోగశక్తి కలుగుతుంది.