(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
తిరుపతి సభలో జగన్ రాయలసీమ ప్రజలకు ఇచ్చిన హామీ అమలు కోసం ప్రయత్నం చేయాలి.
పోలవరం ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ లో చర్చ నడుస్తోంది. రాజకీయ కోణంలో చర్చ ఉన్నా చర్చ జరగడం మంచిదే. పోలవరం ఆంద్రప్రదేశ్ జీవనాడి అంటున్నారు. అది నిజమయితే కృష్ణా , గోదావరి డెల్టాకు నేరుగా ప్రయోజనం ఉంటుంది.
రాయలసీమకు కూడా ప్రయోజనం కలగాలంటే మాత్రం కేవలం పొలవరాన్ని పూర్తి చేస్తే యధాలాపంగా ప్రయోజనం ఉండదు. అందుకు ఏకైక మార్గం దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టెల్ పాండు పధకాన్ని పునరుద్ధరణ చేయడం చేయడం ఒక్కటే మార్గం.
పోలవరం – రాయలసీమ
రాయలసీమ ముఖద్వారం గుండా కృష్ణా , తుంగభద్ర నదులు నీటిని శ్రీశైలంకు తీసుకువస్తాయి. శ్రీశైలం డ్యాం గేట్లు తీసి నీటిని విడుదల చేస్తే అవి నాగార్జున సాగర్ జలాశయం నుంచి కృష్ణా డెల్టాకు , తెలంగాణకు నీరు అందిస్తుంది. ఫలితంగా రాయలసీమ ప్రాజెక్టులకు నికరజలాలు లేని పరిస్థితి ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకుంటే కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందుతుంది. అలా వారి సమస్య పరిష్కారం అందుతుంది అపుడు రాయలసీమలోని శ్రీశైలం నుంచి సాగర్ ద్వారా కృష్ణ నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉండదు. ఆ నీటిని సీమ ప్రాజెక్టులు , ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టుకు వాడుకోవచ్చు.
దుమ్ముగూడెం పధకం చేపడితేనే అది సాధ్యం
పోలవరం పూర్తి అయితే కృష్ణా డెల్టా అవసరాలు నేరుగా తిరిపోతాయి. అలా రాయలసీమ నీటి అవసరాల తిరవు. ఎందుకంటే శ్రీశైలం నుంచి సాగర్ జలాశయంకు నీరు విడుదల చేసేది కేవలం కృష్ణా డెల్టాకు మాత్రమే కాదు తెలంగాణకు కూడా 99 టీఎంసీల నీరు విడుదల చేయాలి. ఏపీ ప్రభుత్వం కృష్ణా డెల్టా అవసరాలు పోలవరం నీటితో పరిష్కారం చేసినా రాయలసీమ అవసరాల కోసం శ్రీశైలంలో నీటిని నిల్వ చేయడానికి పరిమితులు ఉంటాయి. ఎందుకంటే తెలంగాణకు 99 టీఎంసీల నీరు హక్కుగా ఉన్నది కాబట్టి. వరదలు వచ్చినప్పుడు ప్రారంభంలోనే తెలంగాణ ప్రభుత్వం నీటిని విడుదల చేసుకుంటుంది. శ్రీశైలంలో పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉంటేనే రాయలసీమ ప్రాజెక్టులకు నీరు విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖర రెడ్డి గారు దాదాపు 700 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టును రూపకల్పన చేసి కొంత మేరకు పనులు ప్రారంభం చేశారు. వారి అకాల మరణం ప్రాజెక్టుకు శాపంగా మారింది. పోలవరం ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా లభిస్తుంది. అక్కడి నుంచి ఎత్తిపోతల పథకం అమలు చేసి నాగార్జున సాగర్ లో కలపడం ద్వారా తెలంగాణ అవసరాలు తీరుతుంది. అపుడు కృష్ణ నీటిని రాయలసీమ , ప్రకారం , నెల్లూరు మరియు దక్షిణ తెలంగాణకు ఆ నీటిని పరిమితం చేయడానికి అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటి మట్టం ఈ ప్రాంత ప్రాజెక్టుల నిర్వహినకు కీలకం.
ముఖ్యమంత్రి జగన్ గారు తిరుపతిలో నాకు ఇచ్చిన మాట నిలుపుకోవాలి
ప్రతిపక్ష నేత హోదాలో నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో తిరుపతిలో తటస్తులతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో పాల్గొన్న నేను ఇదే విషయాన్ని వారి దృష్టికి తీసుకువచ్చాను. నేను చెప్పిన మాటలకు జగన్ మరిన్ని వివరాలు చెప్పి కచ్చితంగా చేద్దాం అని మాట ఇచ్చారు. ( ఆ వీడియో మీ పరిశీలన కోసం ) వాస్తవానికి విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో చేసిన నిర్ణయాలను మార్చాలంటే అఫెక్స్ అనుమతి తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు భిన్నంగా దుమ్ముగూడెం పధకాన్ని రద్దు చేసింది. ఉభయ రాష్ట్రాల మధ్య నీటి సమస్య పరిష్కారానికి కృషి జరుగుతున్న సమయంలో దుమ్ముగూడెం విషయం చర్చకు రాకపోవడం బాధాకరం. రాయలసీమ ప్రయోజనాల కోసం దుమ్ముగూడెం కీలకం కనుక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అటువైపు అడుగులు వేయాలి. పోలవరం ఆంద్రప్రదేశ్ జీవనాడి అని మాట్లాడే వారు రాయలసీమకు ప్రయోజనం కలగాలంటే దుమ్ముగూడెం లేకుండా సాద్యం కాదు కనుక ఆ పథక పునరుద్ధరణ కోసం కచ్చితమైన ప్రయత్నం చేయాలి
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి,సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం
9490493436)