*నంద్యాల RARS భూములను మెడికల్ కాలేజి కి కేటాయిస్తూ విడుదల చేసిన జీవో నెంబరు 341ని తక్షణమే ఉపసంహరించుకోవాలి
*రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్
(బొజ్జా దశరథరామిరెడ్డి)
నంద్యాల వారసత్వ సంపద నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం. బ్రిటిష్ ప్రభుత్వం 1906 వ సంవత్సరం పత్తి పరిశోధనా స్థానంగా స్థాపించిన ఈ సంస్థ దినదినాభివృద్ధి చెంది భారత దేశ వ్యవసాయ రంగం అభివృద్ధిలో కీలక స్థాయికి ఎదిగింది. అనంతపురం, కర్నూలు జిల్లాల వ్యవసాయాభివృద్ధికి పరిశోధనలు చేస్తున్న ఈ పరిశోధన స్థానం అభివృద్ధి చేసిన విత్తనాలు స్థానికంగానే కాకుండా జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాయి.
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం దేశంలోనే అత్యున్నత మూడు పరిశోధనా స్థానాల్లో ఒకటి. ఇది ఈ ప్రాంత చరిత్రలో ఒక భాగం. ఈ ప్రాంత సామాజిక, సాంస్కృతిక తో ఈ వ్యవసాయ పరిశోధనా స్థానానికి విడదీయలేని అనుబంధం ఉంది. ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నది.
నంద్యాల చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాలతో ముడిపడిన నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను ప్రభుత్వం సేకరించి, ఈ పరిశోధన స్థానానికి స్థానచలనం చేసే ప్రభుత్వం నిర్ణయాన్ని ఖండిస్తున్నాము.
అభివృద్ధి అంటూ ఇంకొక అభివృద్ధి చెందిన సంస్థను అంతం చేసే చర్యలను ఆపాలని డిమాండ్ చేస్తున్నాము. నంద్యాల వైద్య కళాశాల ఏర్పాటుకు అనేక ప్రత్యామ్నాయ స్థలాలు ఉన్నాయి, వాటిలో వైద్యశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములలో 50 ఎకరాలు భూమిని నూతనంగా ఏర్పాటు చేయదలచిన వైద్యశాలకు కేటాయీస్తూ నవంబర్ 12 వ తేదిన ఇచ్చిన జివో నెంబర్ 341ని తక్షణమే ఉపసంహరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాము.
నంద్యాల వారసత్వ సంపదైన నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానంను పరిరక్షించే బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులదే… ఆ దిశగా వారు కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము.
(బొజ్జా దశరథ రామి రెడ్డి,అధ్యక్షులు,రాయలసీమ సాగునీటి సాధన సమితి)