(కె ఎస్ ఎస్ బాపూజీ)
పల్లె బతుకులకు జీవం పోసిన రచయిత బలిజేపల్లి రాఘవరావు.
సాహితీ ప్రక్రియల్లోకల్లా కధకు ఆదరణ ఎక్కువ. గత రెండు శతాబ్దాలుగా వేలాది తెలుగు కధలు వెలుగుచూసినట్టు ఒక అంచనా. ఈ కధలన్నీ దిన, వార, మాస పత్రికల్లొ ప్రచురణకు నోచుకొని ప్రజలకు చేరువయ్యాయి.
మరికొంతమంది రచయతలు తమ రచనలను సంకలనాలుగా ప్రచురించి వాటిని ప్రజా బాహుళ్యంలోనికి తీసుకువచ్చారు. మరికొంతమంది రచనలు కేవలం కాగితాలికే పరిమితమైపోయాయి. ఇలాంటి వెలుగు చూడని రచనలెన్నో. ఆ రచనలుకూడా పరిగణిస్తే తెలుగు సాహిత్యం మరెంత పరిఢివిల్లేదో.
ఇలా వెలుగులోనికి రాని రచనలు చేసిన రచయితలను మన విజయనగరంలో కూడా వున్నారు. అలాంటి వారిలో బలిజేపల్లి రాఘవరావు గారొకరు.
‘అంగీరస’ అన్న కలం పేరుతోను, తన పేరుతోను ఎన్నో కధలు రాసారు. విజయనగర గ్రామీణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈయన 1950 నుంచి రెండువేల సంవత్సరం వరకు రచనలు చేసారు.
రామభద్రాపురం దగ్గరున్న బాడంగిలో 1936 లో జన్మించిన రాఘవరావు వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. తెర్లాం పాఠశాలలో హెడ్మాస్టర్ గా పనిచేస్తూ పదవీ విరమణ పొందారు.
తరువాత విజయనగరం లో స్థిరపడ్డారు. తెర్లాం మాస్టారుగా ప్రసిద్ధి పొందిన ఈయన పిల్లలకు విద్యను నేర్పడంలో మంచి క్రమశిక్షణ పాఠించేవారు. రామభద్రాపురం, బాడంగి మండలాల్లో ఈయన శిష్యులు అనేకమంది ఉన్నారు.
అభ్యుదయ దృక్పథంగల వ్యక్తిగా, కధారచయతగా తన రచనలతో ప్రజలకు సన్నిహితులయ్యారు రాఘవరావు. పల్లె బతుకుల్ని చిత్రిస్తూ కధ శిల్పాన్ని పోషించడంలో ఈయనిది అందెవేసిన చేయి.
రాఘవరావు కధ 1953లో తొలిసారిగా వెలుగుచూసింది. మతావేశం అన్న పేరుతో గృహలక్ష్మి పత్రిక ఫిబ్రవరి సంచిక లో ముద్రణకు నోచుకుంది. మొగలాయి చక్రవర్తి అక్బర్ మతసామరస్యాన్ని విడమరిచి చెప్పే కధ ఇది.
హిందూ యువకులకు సైన్యంలో ప్రధాన పాత్ర ఇస్తున్నరాజును చంపాలని మతావేశంతో రగిలే ముర్టాజ్ అనే వ్యక్తి అక్బర్ ని హతమార్చేందుకు సిద్ధమవుతాడు. అయితే ఆ పన్నాగం నుంచి రాజుని ముర్టాజ్ కుమార్తె రషీదా కాపాడి తాను ప్రాణాలను కోల్పోతుంది.
రషీదా కోరిక మేరకు ముర్టాజ్ కు విధించిన మరణశిక్షను రద్దు చేస్తాడు అక్బర్. తన ప్రాణాలను రక్షించిన రషీదా జ్ఞాపకార్ధం ఒక సామాధి నిర్మిస్తాడు అక్బర్. చారిత్రాత్మిక నేపధ్యం లో సాగిన కధ పాఠకులను ఎంతగానో ఆకట్టికొంటుంది.
ఆంధ్రప్రభ వారపత్రిక లో ప్రచురించిన ‘దానవుడు-మానవుడు ‘ కధలో సహజమైన వాంచలు పురివిప్పివికటనృత్యం చేసినప్పుడే అబల కాలు జారుతుంది. కాని అదృష్టవశాత్తు జారినకాలుకు ఒక గట్టి ఆధారమే లభించినప్పుడు ఆ ఆలంబనను సద్వినియోగం చేసుకోవాలి. ఆపైన పొరపాటునైనా జారుడుమెట్లపైన కాలువేయకూడదు అని ఈ కధలో వివరించి చెబుతారు రచయిత. ఇది 1968 లో వచ్చిన కధ.
‘పత్రిక’ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమైన గెలుపు కధ గ్రామీణ ప్రాంత రాజకీయాలకు అర్ధం పడుతుంది. కధ అంతా రెండు గ్రామాల మధ్య నడుస్తుంది.
పండుబాబు 30ఏళ్ళగా ఆ వూరికి ప్రెసిడెంట్. పక్కనేవున్న మరో చిన్న గ్రామాన్ని ఈవూర్లో కలిపి ప్రెసిడెంట్ ఎలక్షన్లు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. పండుబాబుకు పోటీగా యెండుబాబు పోటీకి దిగాడు. ప్రచారం ముమ్మురంగా చేసాడు. పెద్ద ర్యాలీ నిర్వహించాడు. ఆ ప్రచారశైలిచూసి పాత ప్రెసిడెంట్ చవటనుకున్నారు. యెండుబాబు గెలుపు ఖాయం అనుకున్నారు. “ఎలక్షన్ రోజు వచ్చింది!! పోలింగ్ జరిగింది!! ఫలితాలు ప్రకటించారు! కాని ఆశ్చర్యం! రెండువందల వోట్ల మెజారిటీతో పండుబాబు గెలిచాడు! ఇదెలా జరిగింది? పండుబాబుని అడిగితే ‘అవతలోడ్ని బాగా అలసిపోనివ్వాలి! అప్పుడు మనం బలం చూపాలి.! ఎగిరిదంచినా, కూర్చొని దంచినా అదేకూలి… మనం రెండోది యెంచుకున్నాం… ఇప్పటికైనా తెలిసిందా ఎలక్షన్లంటే మందు పేకట్లు, సొమ్ము సంచులూను. ఇదంతా దాని మహిమే అన్నాడు చిద్విలాసంగా నవ్వుతూ!.” రెండు గ్రామల ఎలక్షన్ల కధ ఇది.
ఇందులో ఆ పల్లె జనం మాట తీరు, నడత, నడక, పెద్ద మనుషుల చిన్నబుద్ధులు పాఠకులకు విడమరిచి చెబుతారు.
ఈయన రాసిన చాలాకధలు అలభ్యం. సుమారు వందకు పైగా రచనలు చేసారని వీటిని ప్రచురించేందుకు ఒక విశ్వవిద్యాలయం ముందుకురావడంతో ఆ రచనలన్ని ఆ విశ్వవిద్యాలయానికి ఇచ్చారని అయితే అనివార్యకారణాలవల్ల ఆ విశ్వవిద్యాలయం ఈయన రచనలను ప్రచురించలేదని వారికుటుంబసభ్యులు చెబుతున్నారు.
కనీసం తామిచ్చిన రచనలైనా తిరిగివ్వండి అని అడిగితే కనిపించడంలేదని విశ్వవిద్యాలయాధికారులు చెప్పారని వారు వాపోయారు.
ఆవిధంగా ఎంతో విలువైన ఆయన రచనలు గాల్లో కలిసిపోవడం ఎంతో బాధకర విషయం. రాఘవరావు రాసిన ఓ నాలుగు ఐదు కధలు శ్రీకాకుళం కధానిలయం వారుస్కాన్ చేసి బధ్రపరిచారు. అవి మాత్రమే ఇప్పుడు మనకి అందుబాటులో వున్నాయి.
1963 లో మక్కువ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మేథ్స్ టీచర్ గా ఉద్యోగంలో చేరారు. 1970 వరకు ఇక్కడే పనిచేసారు. 1970 లో తెర్లాం పాఠశాలకు హెడ్మాస్టర్ గా వచ్చారు. తెర్లం, పెరుమాలి, బాడంగి పాఠశాలల్లో పనిచేసి 1994 లో తెర్లాం హైస్కూల్ హెడ్మాస్టర్ గా పదవీవిరమణ చేశారు.
మక్కువతో పనిచేసినప్పుడు సహోద్యోగి అయిన ఆకుండి నారాయణమూర్తి తో కలసి కొన్ని కధలు రాశారు. మంచి గాయకుడైన రాఘవరావు అనేక బుర్రకధలు, నాటకాలలో వివిధ పాత్రలను పోషించారు.
ప్రముఖ సినిమా నటుడు జె.వి.సోమయాజులు తో కలసి కన్యాశుల్కం నాటకంలో కూడా ఒక పాత్రను పోషించారు. రచయితగా, గాయకుడిగా, నటునిగా విభిన్న పాత్రలకు జీవం పోసిన ఈయన2006 డిసెంబర్ 14 వ తేదీన తుదిశ్వాస విడిచారు.
అంగీరస రచనలు
1) జ్ఞానోదయం ( గృహలక్ష్మి-1952)
2) తీర్పు ( గృహలక్ష్మి-1953)
3) నూర్జహాన్ యుక్తి ( ఆంధ్ర పత్రిక – 1955)
4) తానీషా ( ఆంధ్ర పత్రిక – 1955)
5) మెధాశక్థి( ఆంధ్ర పత్రిక -1956)
6) అస్తమయం ( ఆంధ్ర పత్రిక – 1957 )
7) ప్రతీకారం ( జాగృతి -1963)
8) సంభవామియుగే యుగే ( జాగృతి – 1969)
9)ధర్మపధం ( జాగృతి – 1969)
10) హూణాంతకుడు ( జాగృతి – 1969)
11) చరిత్ర గతి ( జాగృతి -1969)
సాంఘికాలు
1) నివృత్తి -( ఆనందవాణి -1958 )
2) కుర్చీలో కూనిరాగం ( ఆనందవాణి -1958)
3) ఆకుచాటు పిందె (కృష్ణా పత్రిక 1963)
4) గొడుగు (కృష్ణా పత్రిక 1963)
5) విలువలు (కృష్ణా పత్రిక 1965)
6) దానవుడు మానవుడు ( ఆంధ్ర ప్రభ 1968)
వ్యాసాలు
1) భోగరాజు వారి ‘పండగకట్నం” ( ఆంధ్రజ్యోతి -1963)
2) గురజాడ వారి సుభద్ర ( ఆంధ్ర జ్యోతి 1963)
3) తాజ్ మహల్ -చారిత్రాత్మిక ( ఆంధ్ర జ్యొతి 1969)
4)దుర్గపూజ ( ఆంధ్రజ్యోతి -1969)
నాటికలు
1) వసతిగృహం ( భారతి – 1958)
2) పెళ్ళికుదిరింది ( భారతి – 1958)
3) రంగ మార్తాండులు – నాటకం ( సీరియల్ ) ( భారతి – 1961)
4) తధాగతుడు – (సాహితీ 1969)
5) శాకారి – (సాహితీ 1969)
6) దొంగలున్నారు జాగ్రత్త
7) సర్వనామం
8) సరదాతీరింది
9) దొరికితే దొంగలు
10)దొంగాట
11) బొమ్మరిల్లు
12) బూచి
(కె ఎస్ ఎస్ బాపూజీ, సాహిత్యభిమాని, జర్నలిస్టు, ఉత్తరాంధ్రవాసి. ఇపుడు నివాసం హైదరాబాద్ లో)