తిరుమల తిరుపతి దేవస్థానాల(టిటిడి)కు అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం రాత్రి 7 గంటలకు పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహించారు. నవంబరు 11 నుండి 13వ తేదీ వరకు ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.
సంవత్సరం పొడవునా ఆలయంలో జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా మొదటిరోజైన నవంబరు 11న పవిత్రప్రతిష్ఠ, రెండో రోజు నవంబరు 12న పవిత్ర సమర్పణ, చివరిరోజు నవంబరు 13న పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేపడతారు. పవిత్రోత్సవాల కారణంగా నవంబరు 11 నుండి 13వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం సేవను టిటిడి రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో జెఈఓ శ్రీ పి.బసంత్ కుమార్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి విఆర్.శాంతి, ఏఈఓ ధనుంజయులు, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయలు, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.