ముగ్గురం చంద్రగిరి వైపు వెళుతున్నాం. ‘ యో వ్.. ఏమియా సంగతి ‘ అడిగాడు శంకర్ రెడ్డి నవ్వుతూ.
‘ కోటలో కోడేనాగు సినిమా షూటింగ్ జరగతా ఉందంట ‘ చెప్పాడు.
ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. కనీసం ల్యాండ్ ఫోన్లు కూడా పెద్దగా లేవు!
సినిమా అంటే చాలు సుబ్రమణ్యానికి సమాచారం ఎలా వస్తుందో వచ్చేస్తుంది. అతనికి అంత నెట్ వర్క్!
చంద్రగిరి కోటలోకి ప్రవేశించడానికి ముందు రోడ్డుకు ఎదురుగా ఒక ఆలయం ఉంది. అక్కడి నుంచే మెలికలు తిరిగే దారితో కోట మొదలవుతుంది.
గుడి ముందు ఉన్న రావి చెట్టు చుట్టూ కట్టిన తిన్నె పైన రాజ్ బాబు, మరి కొందరు కూర్చుని పేకాడుతున్నారు.పేక ముక్క వేసినప్పుడల్లా రాజ్‌బాబు ఏదో ఒక జోక్ విసురుతున్నాడు. చుట్టూ గుమి గూడిన జనం కూడా నవ్వుతున్నారు.
లక్ష్మీ, చంద్ర కళా కుర్చీల్లో కూర్చున్నారు. శోభన్ బాబు కొంచం దూరంగా కూర్చున్నాడు. అంతా మేకప్ చేసుకునే ఉన్నారు.
‘ శోభన్ బాబు ఎంత అందంగా ఉన్నాడో చూడు ‘ అన్నాడు సుబ్రమణ్యం. నిజమే! మిసమిసలాడుతున్నాడు బాగా పండిన దబ్బపండులా.
సినీ నటుల్ని , షూటింగ్ ను చూడడం నాకు అదే తొలిసారి. జనం చుట్టూ మూగారు. షూటింగ్లో శోభన్ బాబు ఫైటింగ్ సీన్ ప్రారంభ మైంది.
వాళ్ళను చూస్తుంటే సుబ్రమణ్యానికి అనందంతో ముఖం వెలిగిపోతోంది. కడుపు నిండి పోతోంది.
సూర్యుడు నడినెత్తికొచ్చాడు. నాకు ఆకలేస్తోంది. ఇంటికి వెళ్లి పోదామన్నాను. చంద్రగిరి కోటను అంతకుముందే చూశాం. ముగ్గురం ఇంటి ముఖం పట్టాం.
మళ్ళీ కొన్నాళ్ళకు కోటలో సినిమా షూటింగ్ జరుగుతోందని తెలిసింది.
‘ఇటలీ వాళ్ళు సినిమా తీస్తున్నారంటబ్బా’ అని సుబ్రమణ్యం మమ్మల్నిమళ్ళీ కోటకు తీసుకెళ్ళాడు.
మేం వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరూ లేరు. కోనేరు నుంచి నీళ్ళు బైటికి వెళ్ళే కాలువపై అందమైన కొయ్యవంతెనలు కట్టారు ఇంగ్లీషు సినిమాలలో సెట్టింగ్‌లాగా. రాజ్ మహల్ లోపల గోడలకు పాత రంగు చెరిపేసి కొంత మేరకు పింక్ రంగు వేశారు.
ఆర్కియాలజీ వాళ్ళు అభ్యంతరం చెప్పారట. షూటింగ్‌కు అనుమతి ఇచ్చాం కానీ, మహల్ రూపాన్ని మారుస్తే ఒప్పుకోం అని. మరి కొన్ని అభ్యంతరాలతో అది కాస్తా ఆగిపోయిందట.
ఆ రోజుల్లో శంకర్ రెడ్డి పెద్దన్న జయచంద్ర డిగ్రీ చదివేవాడు. పొట్ట లేకుండా, పొడవుగా, బలంగా ఉండేవాడు. శోభన్ భాబులా అందగాడు. మంచి స్నేహ శీలి. చాలా సౌమ్యుడు.
ఆ అందానికి అసలు కారణం మడక దున్నడం, వ్యవసాయ పనులు చేయడం. ఆ రోజుల్లో నేను కూడా జయచంద్రలా ఉండాలనుకునే వాణ్ణి .
పెరుమాళ్ళపల్లె చాలా బాగుంది. మంచి స్నేహితులు, మంచి మనుషులు, తిరుపతి టౌన్‌కు దగ్గర, పల్లె వాతావరణం, పట్టణ సదుపాయాలు.
కానీ, ఆ ఊళ్ళో ఒక సమస్య చాలా ఇబ్బంది పెట్టేది. ఎవరింట్లోనూ టాయిలెట్లు లేవు! ఒకరిద్దరి ఇళ్ళలో ఉన్నాయేమో నాకు తెలియదు.
మగవాళ్ళంతా రోడ్డు పక్క…! ఆడవాళ్ళంతా చేలలోకి మరోపక్క ..! ఎవ్వరూ నీళ్ళు తీసుకుని వెళ్ళేవాళ్ళు కాదు! కడుక్కొడానికి ప్రతి ఇంట్లో బాత్రూం ఉండేది,
తెల్లారకముందే పూర్తి చేసుకోవాలి. మళ్ళీ చీకటి పడే వరకు ఆగాలి. ఏ రోజూ నియమ ఉల్లంఘన జరగలేదు. కట్టుబాటు కట్టుబాటే.
అలవాటు లేని పని. ఆ ఒక్క విషయానికే చాలా ఇబ్బంది పడ్డాం. పెరుమాళ్ళపల్లెలో మూడు నెలల ముచ్చట ముగిసింది. తరువాత తిరుపతికి ఇల్లు మారాం.
ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితి లేదు బైటికి వెళ్ళేవాళ్ళు ఎవరూ లేరు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి వచ్చేసింది.
ఏడాది తర్వాత (1974 మే) కోడెనాగు సినిమా రిలీజ్ అయ్యింది. మేం ముగ్గురం కలిసి షూటింగ్ చూశాం కనుక, కూడా బలుక్కుని మళ్ళీ ముగ్గురం కలిసి సినిమాకు వెళ్ళాం.
‘ఇదే చంద్రగిరి..శౌర్యానికి గీచిన గిరి ఇదే చంద్రగిరి’ పాట మొదలైంది. విద్యార్థులను తీసుకొచ్చి జగ్గయ్య కోట అంతా చూపిస్తూ ఆ పాటపాడుతున్నాడు.
‘వీళ్ళంతా చంద్రగిరి స్కూలు పిలకాయలే ‘ అన్నాడు శంకర్ రెడ్డి.
ముగ్గురం ఆ పాటలో లీనమైపోయాం. సుబ్రమణ్యం ఆనందంలో ఉబ్బితబ్బిబ్బైపోయాడు.
నాగరాజు పాత్రలో శోభన్ బాబు ఆవేశం యువ తరాన్ని భలే ఆకట్టుకుంది.
శోభన్ బాబు ఫ్యాంటు లోపల కాళ్ళకు ఆన్సరు కాగితాలు అంటించుకుని పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడతాడు. నవ్వులే నవ్వులు. ఆ సీన్లో ఎస్వీ యూనివర్సిటీ పరిపాలనా భవనాన్ని చూపించారు. నా మిత్రులిద్దరూ మహదానంద పడిపోయారు.
అత్రేయ ఎంత మంచి పాటలు రాశాడో! మనసు గురించి ఆత్రేయ రాసినట్టు మరొకరికీ సాధ్యం కాలేదు.
ఆత్రేయ నెల్లూరు జిల్లా వాసి. స్వాతంత్య్ర సమర యోధుడు! క్విట్ ఇండియా ఉద్యమం 1942 లో ప్రారంభమైన రోజు చిత్తూరులో ఉపాద్యాయులను పాఠశాలలోకి వెళ్ళనీయకుండా విద్యార్థులు ధర్నా చేశారు.
విద్యార్థి నాయకుడిగా అత్రేయ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులను ఉద్దేశించి ఆవేశంగా ప్రసంగించాడు.ఇంటర్ మీడియట్ ఫెయిల్ అయ్యాడు. కమ్యూనిస్టు భావజాలం ఉన్నవాడు.
ఆందోళన చేసిన విద్యార్థులలో ప్రముఖ భాషా శాస్త్ర వేత్త జీఎన్ రెడ్డి కూడా ఉన్నారు.
ఆత్రేయ అసలు పేరు కిడాంబి నరసింహాచారి. ఆ రోజుల్లో ఆ పేరుతోనే పిలిచేవారు.
కోడెనాగు సినిమాలో ఆత్రేయ శోభన్ బాబుకు ఉపాధ్యాయుడుగా నటించాడు.
శోభన్ బాబు, చంద్రకళ (అమృతవల్లి) ప్రేమించుకుంటారు. వారి కులాలు వేరు. శ్రీవైష్ణవ కుటుంబానికి చెందిన చంద్రకళకు తల్లి దండ్రులు వేరే సంబంధం చూస్తారు. వాళ్ళను విడదీసే బాధ్యతను వారు ఆత్రేయకు అప్పగిస్తారు.
శోభన్ బాబుకు, ఆత్రేయకు మధ్య సంభాషణ రసవత్తరంగా సాగుతుంది. శోభన్ బాబు ఆత్రేయ ముఖంలోకి చూసి సూటిగా మాట్లాడతాడు.
ఆత్రేయ పక్కకు తిరిగి ప్రేక్షకులను చూస్తో మాట్లాడతారు. అత్రేయ రంగస్థల నటుడు, గొప్ప నాటక కర్త. ఆ నాటకీయత నుంచి ఆయన బయటపడలేదు.
‘ మాస్టారు మాస్టారు మాస్టారు… రెండు జీవితాలు ఎందుకిలా ముక్కలవ్వాలి!? ‘ అంటాడు శోభన్ బాబు
‘ చంద్రగిరి లాగా ఆ చంద్రార్కం నీపేరు నిలిచిపోతుంది ‘ అంటాడు ఆత్రేయ. పెద్దలు కుదిర్చిన పెళ్ళికి చంద్రకళను ఒప్పించమని గురు దక్షిణగా కోరతాడు ఆత్రేయ.
ఆ డైలాగుతో మా సుబ్రమణ్యానికి ఒళ్ళు మండిపోయింది. ‘ ఏం అయ్వారయ్య ఈయన! పిలకాయలను విడదీస్తుండాడు ‘ అన్నాడు
సినిమా సీరియస్‌గా నడుస్తోంది. నా పక్కకు తిరిగి ‘ పుదిపట్లలో మా పీటీ అయ్‌వారు ఎంత మంచోడంటే.. ‘ అంటూ చెప్పబోయాడు.
‘ మన అయ్‌వారు గురించి మళ్ళీ మాట్లాడదాం సినిమా చూడు ‘ అన్నాడు శంకర్ రెడ్డి.
అబ్బా.. ‘అయ్‌వారు’ పదం బలే ఉందే! అనుకున్నా మనసులో. వనపర్తిలో ఉపాధ్యాయుడిని టీచర్ అనే వాళ్ళం. ఎదురు పడితే సార్ అనే వాళ్ళం.
కోస్తా జిల్లాల్లో మాస్టారు. మరీ ముద్దొచ్చేలా ఉంటే ‘మేషారండి అని మెలికలు తిరిగిపోయేవారు
అసలీ ‘అయ్‌వారు ‘ ఎప్పటి మాట! ఎంత బాగుంది! అచ్చమైన తెలుగు పదం! చిన్నప్పుడెప్పుడో విన్న పాట.
జన వ్యవహారంలో ఆ పదాన్ని నేను తొలి సారిగా వినడం అదే.
చంద్రగిరిలో కథ జరిగినట్టు అక్కడే సినిమా తీస్తూ, ‘ మాస్టారు ‘ అనడం ఏమిటి? ఇక్కడి పలుకు బడులు ఒక్క టంటే ఒక్కటీ లేదు ఆ సినిమాలో. సినిమా వాళ్ళకు స్థానిక పలుకుబడులు బొత్తిగా లోపించాయని నాకు ఆరోజే అనిపించింది. అప్పటి సినిమాలు గుడ్డిలో మెల్లలా కాస్త మేలు. స్థానికి భాష, పలుకుబడులు వాడకపోతే పోయారు.
ఇప్పటి లాగా రాయలసీమ వాసులను రౌడీలుగా, గూండాలుగా చూపించేంత కావరం పెరగలేదు.
‘కథ విందువా నా కథ విందువా.. విధికి బదులుగ నువ్వు నా నుదుట రాసినా కథ విందువా నా కథ విందువా! ‘ అంటూ చంద్రకళ పాడిన పాట శోభన్ బాబునే కాదు ప్రేక్షకులందరినీ ఏడిపించింది.
శారద సినిమాను మించి తెగ బాధపడి పోయాం.
శోభన్ బాబు మళ్ళీ లక్ష్మి(లిల్లి) ని ప్రేమిస్తాడు. మతాంతర వివాహానికి పెద్దలు ఒప్పుకోరు. ఆత్రేయ మళ్ళీ మధ్యవర్తిత్వం. ఇద్దరూ కొండ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు.
సినిమా విషాదాంతం. ప్రేక్షకుల కళ్ళ నిండా నీళ్ళు. నిర్మాత గల్లా పెట్టె నిండా నోట్ల కట్టలు. దటీజ్ కోడెనాగు.
ఆ తరువాత సుబ్రమణ్యం వ్యవసాయంలో పడ్డాడు. వీఏవో అయ్యాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. బాగానే సంపాదించాడు. మాకు కాస్త దూరమయ్యాడు. అయిదేళ్ళ క్రితం తన జ్ఞాపకాలను అలా మాకు వదిలేసి, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు.
శంకర్ రెడ్డి తో స్నేహం కొనసాగింది. మాది 47 ఏళ్ళ స్నేహం . డిగ్రీ చదివాడు. వ్యవసాయం చేస్తూనే సరసింగాపురం తౌడు ఫ్యాక్టరీలో పనిచేశాడు. కార్మిక నాయకుడిగా వారి హక్కుల కోసం పోరాడాడు.
పక్కనే ఉన్న కొప్పర వాండ్ల పల్లె లోని తన పొలంలో ఇల్లు కట్టుకున్నాడు. తిరుపతికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి రాకుండా వెళ్ళేవాడు కాదు.
‘ ఏం లేటయ్యింది? ‘ అని భార్య అడిగితే ‘ శర్మా వాళ్ళింటికి వెళ్ళాను ‘ అని చెప్పేవాడు. ఆమె కిమ్మనేది కాదు. మా ఇంట్లో ఏ కార్య క్రమం జరిగినా వచ్చేవాడు. నేను కూడా వెళ్ళే వాడిని.
ఎప్పుడు వాళ్ళింటికి వెళ్ళినా భోజనం చేయ్యమనేవాడు. భోజన సమయం కాక పోయినా భోజనం చేసి వెళ్ళమనే వాడు. తొలుత ఆశ్చర్యం వేసేది. తరువాత అర్థమైంది అదిక్కడి పల్లెల్లో ఆనాడున్న మంచితనం అని.
శంకర్ రెడ్డికి గొంతు క్యాన్సర్ వచ్చింది. కొన్ని నెలల పాటు నాకు చెప్ప లేదు.నేను కూడా కలవ లేదు ఇంటి పనిలో పడి.
స్విమ్స్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. క్యాన్సర్ అని తెలిసి స్విమ్స్ కెళ్ళి కలిశాను.
ఇంటికి కూడా వెళ్ళాను. ఇల్లు కదలడం లేదు.
‘శర్మా నాకు బాగుంటే నేనే దగ్గరుండి మీ ఇల్లు కట్టించే వాడిని’ అన్నాడు.
హైదరాబాదులో నాకు తెలిసిన అంకాలజిస్టు డాక్టర్ సుష్మకు అతని రిపోర్టులు, వాడే మందులు పంపి కనుక్కున్నాను. ‘ఇప్పటికి ఫరవాలేదు. మూడు నెలల తరువాత తిరగబెట్టకుండా ఉంటే కోలుకుంటాడు ‘ అని ఆమె చెప్పారు. ఆ చివరి మాట వాళ్ళకు చెప్పలేదు, బాధపడతారని.
లాక్ డౌన్ విధించారు. కరోనా మనుషుల్ని కబళిస్తోంది. కరోనాతో కంటే ఇతర జబ్బులకు వైద్యం అందక చాలా మంది చచ్చిపోతున్నారు.
స్విమ్స్‌లో ఓపీ చూడడం లేదు. శంకర్ రెడ్డికి తగ్గినట్టే తగ్గి మళ్ళీ తిరుగబెట్టింది. ఒక రోజు మరీ ఎక్కువైంది.
స్విమ్స్‌లో వైద్యులు అందుబాటులో లేరు.ఫోన్ చేస్తే ఏదో మందు రాసిచ్చారు.
అది వాడితే ఆ రోజు మరింత ఎక్కువైంది. ఆ రాత్రి ఎంత నరకాన్ని అనుభవించాడో! గత ఏప్రిల్ 4 వ తారీకు మర్నాడు పొద్దున్నే వాళ్ళింటికి వెళ్ళాను.
వాళ్ళింటికి ఎప్పుడు వెళ్ళినా ఎదురొచ్చి నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళే శంకర్ రెడ్డి నాకోసం ఎదురు చూస్తున్నట్టు ఇంటి ముందే నిర్జీవంగా పడుకుని ఉన్నాడు.
పదకొండు గంటలకు అంత్యక్రియలు. అప్పటి వరకు అక్కడే ఉందామనుకున్నా. పదకొండు దాటితే లాక్డౌన్ ఆంక్షలు. తిరిగి ఇంటికి వళ్ళలేను.
కడసారి చూసి భారంగా వెనుతిరిగాను. ఈ దిక్కు మాలిన లాక్ డౌన్ అత్యవసరం వైద్యం అందకుండా చేసింది