అనుభవంతో వచ్చిన సత్యాన్ని పరిశీలించి సరిచూసుకోవడమే జ్ఞానం
(పిళ్లా విజయ్)
బుద్ధుని కాలంలో కాలములనే తెగ ఉండేది.వారితో బుద్ధుడు ఒకసారి సంభాషిస్తారు. ఆ సందర్భంలో బుద్ధుడు వారికి జ్ఞానానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. వాటిని ‘కాలామ సుత్తం’ పేరుతో పీకాక్ క్లాసిక్ వారు డి.చంద్రశేఖర్ రాసిన చిన్నపుస్తకాన్ని ప్రచురించారు. ఈ కాలామ సుత్తం అంగుత్తనికాయంలో ఉంది. బుద్ధుడు కాలాములతో చెప్పిన విషయాలను బౌద్ధంలో జ్ఞానసిద్ధాంతంగా పరిగణిస్తారు.
వైదికమతం వేదాన్ని జ్ఞానానికి ప్రమాణంగా భావిస్తుంది. దేవునిపై వుండే భయభక్తులే జ్ఞానానికి తొలి అడుగని బైబిలు చెపుతుంది. అలాగే అనుభవంతో వచ్చిన సత్యాన్ని పరిశీలించి సరిచూసుకోవడమే సరైన జ్ఞానమని కాలాములతో బుద్ధుడు చెప్పిన ఉపదేశాలే బౌద్ధంలో జ్ఞాన సిద్ధాంతమని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
మహాభారతంలో యక్ష ప్రశ్నలున్నాయి. అందులో యక్షుడు ధర్మరాజుతో జ్ఞానమెలా వస్తుందని అడుగుతాడు.పండితుల సాంగత్యంతో జ్ఞానమొస్తుందని ధర్మరాజు చెపుతాడు.
దీన్నే ఇప్పటికీ చాలా మంది ఆచరణయోగ్యంగా, సరైందిగా భావిస్తుంటారు. మరికొంత మందైతే ఎవరో ఏదో చెపితే అది సరైందా కాదా అని ఆలోచించకుండా, తనమీద తనకు నమ్మకం లేకపోవడం వల్ల తనకది నచ్చిందనినమ్మి దాన్ని ఆచరిస్తూ వుంటారు. వీళ్లను సంప్రదాయవాదులని అంటారు.
ఇంకొంత మంది ఆ విషయాన్ని తర్కం ద్వారా విశ్లేషించి దానిని సత్యంగా భావించి ఆచరిస్తూ వుంటారు. ఈ పద్ధతులు సరైనవికాదని బుద్ధుడు చెపుతాడు.
సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రతి విషయాన్ని ఆచరణలో చూడాలని ఆధునిక విజ్ఞానం చెపుతుంది. చాలా మంది స్వంత ఆలోచనలను చొప్పించి నిర్ధారణకు వస్తారు. దీనిని స్వీయమానసిక ధోరణి అంటారు.అలాకాక ప్రతి విషయాన్ని పరిశీలించి, విశ్లేషించి నిర్ణయించాలి. దాన్ని ఆచరణలో చూడాలి.
అప్పుడు వచ్చిన సత్యాన్ని/ వాస్తవాన్ని అందరూ స్వీకరిస్తారు. ఇదే నేడు ఆధునిక విజ్ఞానం చెపుతున్న జ్ఞానసిద్ధాంతం. నిరూపించిన విషయాలను మళ్లీ మళ్లీ పరిశీలించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు విషం తింటే మరణిస్తారు. మళ్లీ విషం తిని దాన్ని రుజువు పరచడానికి సాధ్యం కాదు.
కరెంటు ముట్టుకుంటే చనిపోతాం. దీన్ని మళ్లీ స్వంతంగా
పరిశీలించాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిని స్వీకృతాలు అంటారు. అయితే ఒక వేళ పాత సత్యం తప్పని ఎవరైనా నిరూపిత మైతే పాతదాన్నే పట్టుకుని వేలాడకుండా కొత్త దాన్ని స్వీకరించాలి. ఇదే ఆధునిక విజ్ఞానం చెపుతున్నది.
మానవుడు ఆలోచించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నో భావాలు ప్రచారంలోకి వచ్చాయి. అవే మనిషి తాత్విక చింతనగా రూపుదిద్దుకొన్నాయి.
బుద్ధునికి పూర్వం ఎన్నో తాత్వికభావధారలుండేవి. బుద్ధుని తరువాత కూడా ఎన్నో చింతనలు వచ్చాయి. అయితే మనిషి తన వ్యక్తిగత జీవితంలో ఆచరించడానికి అనువైన శాస్త్రీయమైన పద్ధతులు ఇంకా రూపుదిద్దుకుంటూనే వున్నాయి.
అయితే కాలామ సుత్తంలో చెప్పిన బుద్ధుని ఉపదేశాలు ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆచరించదగిన శాస్త్రీయ పద్ధతులుగా రచయిత డి. చంద్రశేఖర్ పేర్కొన్నారు. వీటిని బుద్ధునికి సంబంధించిన జ్ఞాన సిద్ధాంత సూచికలుగా భావించవచ్చునని చెప్పినారు.
ఎవరో చెప్పారని, ఆ చెప్పింది మంచిదో కాదో తర్కం ద్వారా కనుక్కోలేం. ఇది శాస్త్రీయ పద్ధతి కాదు. కొన్నిసార్లు అది సత్యం కావచ్చు, కాకపోవచ్చని మధ్యమ నికాయంలో ఆయస్మ ఆనందుడు చెపుతాడు.
సత్యాన్ని ఆచరణ ద్వారానే నిరూపించగలం తప్ప మరో మార్గం లేదు. బుద్ధుడు పాత భావాలను కాలామతెగ ప్రజల ముందుంచి వాటిని పూర్వపక్షం చేస్తాడు. అవన్నీ ప్రామాణికం కావని చెపుతాడు. సంప్రదాయాలను, వివిధ గ్రంథాలను, గురు బోధలను, స్వీయ మానసిక ధోరణులను నిశితంగా పరిశీలించుకోవాలని బుద్ధుడు చెప్పినట్లు చంద్రశేఖర్ విశ్లేషించారు.
అనుభవమైతేగాని తత్త్వం (సత్యం) బోధపడదంటారు. అనుభవ పూర్వకంగా తెలుసుకున్న సత్యాన్ని లోకానుభవంతో ప్రత్యేకించి విజ్ఞుల అనుభవంతో సరిచూడటం అవసరమని బుద్ధుని భావనగా చంద్రశేఖర్ గుర్తించారు.
ఈర్ష్య, ఆందోళన, మందగొడితనం (చురుకుదనం లోపించడం), కుశంక(లేనిపోని అనుమానం) మొదలైనవన్నీ మానసిక రోగాలని బౌద్ధం చెపుతుంది. లోభం, మోహం, ద్వేషం నుండి మనిషి విముక్తి పొందడమే మానవుని జీవిత లక్ష్యమని చెపుతుంది. స్వార్ధం మనిషిలో ఏర్పడటానికి కారణం ప్రధాసం ఆస్తిహక్కు ఉండటమే, బౌద్ధ సన్యాసులకు ఆస్తిపై మమకారం ఉందదు. కానీ సాధారణ గృహస్తుకు మాత్రం ఉంటుంది.
ఇదే మనిషిలో స్వార్థానికి కారణమవు తోంది. అయితే వీటిని తొలిగించుకోవడానికి ప్రేమ, స్నేహం, కరుణ, సహానుభూతి,స్థిత ప్రజ్ఞత (ఉపేక్ష) మొదలైన గుణాలను అలవర్చుకోవాలని బుద్ధుడు చెపుతారు. ఇవన్నీ మనిషి ధర్మాచరణకు
దోహదపడతాయని కాలామ సుత్తం చెపుతోంది.
జ్ఞానసిద్ధాంతానికి ప్రధానమైనది ఆచరణ. ఆచరణే జ్ఞానానికి కొలబద్ధ బౌద్ధం దీనిని నొక్కివక్కాణించింది.కానీ చాలా మంది బుద్ధున్ని కొలిస్తే చాలని, బుద్ధుని ప్రవచనాలు చదివితే చాలని లేదా వింటే చాలని భావిస్తారు. కానీ అన్నింటికంటే ముఖ్యమైనది బౌద్ధధర్మాచరణ. ఇదే కాలామ సుత్తం చెప్పేది.
(పిళ్లా విజయ్ , రచయిత,విమర్శకుడు, అనంతపురం)