1950 లోనే 4 హాలివుడ్ ఆఫర్లను తిరస్కరించిన బాలివుడ్ భామ
(Ahmed Sheriff)
లండన్ రియల్టో ఆడిటొరియం – జూలై 18, 1952. ఒక హిందీ సినిమా ప్రిమీయర్ చూడటానికి ఆహూతులంతా వస్తున్నారు. వాళ్లలో హాలీవుడ్ ప్రముఖులతో కలిపి చాలా మంది గొప్ప వాళ్లున్నారు. ఒక హాలీవుడ్ ప్రముఖుడు ఆ సినిమా హీరోయిన్ చేతిని ముద్దు పెట్టుకో బోయాడు. అప్పుడా హీరోయిన్ అతడ్ని వారించి,“నువ్వలా చేయ కూడదు, నేను భారత దేశపు అమ్మాయిని” అంది. మరునాడులండన్ పత్రికల్లో ” Unkissed girl of India”(ముద్దొద్దన్న భారతీయ ముద్దుగుమ్మ ) అనే వార్త సంచలనాన్ని సృష్టించింది.
అలా అన్న అమ్మాయి అలనాటి మేటి నటి నిమ్మి. ప్రిమీయర్ లో ప్రదర్శించింది మహబూబ్ ఖాన్ నిర్మాణత, దర్శకత్వం వహించిన ఆన్ (Aan 1952) సినిమా. దీనిలో హీరో దిలీప్ కుమార్.
భారత దేశపు మొట్టమొదటి ఓవర్ సీస్ ప్రిమీయర్ “ఆన్” సినిమా కోసం లండన్ వెళ్లిన నిమ్మీ కి అప్పట్లో నాలుగు హాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. ఆఫర్లు ఇచ్చిన వారిలో ఆమె నటనను గొప్పగా కొనియాడిన హాలీవుడ్ ప్రముఖుడు Cecil B. DeMille కూడా వుండటం విశేషం. ఈ ఆఫర్ల గురించి తెలుసుకున్న మహబూబ్ ఖాన్ తదితరులు ఆమెతో ” మేము స్వార్థ పరులమని అనుకోవద్దు. ఇక్కడ వుండటానికి మాకు కుదరదు. నీకు తగిన వసతులు ఏర్పాటు చేసి మేము భారత దేశానికి తిరిగి వెళ్లిపొతాం” అన్నారట. ఆ నాలుగు ఆఫర్లనూ తిరస్కరించి వారందరితో పాటు తాను కూడా స్వదేశానికి తిరిగి వచ్చేసింది నిమ్మి.
ఒక్కో సారి కొంత మంది నిజ జీవితం లోని సంఘటనలు, ఊహా జనిత కథలకంటే ఆసక్తి కరంగా వుంటాయి. నిమ్మి సినీ రంగ ప్రవేశం కూడా ఓ సినిమా కథలాగే జరిగింది.
నిమ్మి అసలు పేరు నవాబ్ బానూ. ఆమె 1933 ఫిబ్రవరి 18 న అగ్రా లో జన్మించింది. తల్లి పేరు వహిదన్. ఆమె ఒక గాయని, నటి కూడా. తండ్రి అబ్దుల్ హకీం. ఆయనొక మిలిటరీ కాంట్రాక్టర్. నవాబ్ బానూ 11 వ యేట ఆమె తల్లి చనిపోయింది. కుటుంబ కారణాల వల్ల నవాబ్ బానూ వాళ్ల అవ్వ దగ్గర పెరిగింది. తన తల్లి బ్రతికి వున్న రోజుల్లో సినిమా ప్రపంచపు ప్రముఖుల తో ఏర్పరచుకున్న సన్నిహిత సంబంధాలను పురస్కరించుకుని, ఒక రోజు ఆమె మెహబూబ్ ఖాన్ నిర్మిస్తున్న “అందాజ్” చిత్రపు షూటింగ్ చూడటానికి సెంట్రల్ స్టూడియో కి వెళ్ళింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు. ఒకరు దిలీప్ కుమార్. మరొకరు రాజ్ కపూర్. ఆ షూటింగు సమయం లో రాజ్ కపూర్ అక్కడ అమాయకంగా కూర్చొని వున్న నవాబ్ బానూ ను చూడటం జరిగింది.
అప్పుడు రాజ్ కపూర్ తన రెండో చిత్రం “బర్సాత్” చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఆ సినిమాకి ఇద్దరు హీరోయిన్లు కావాలి. ఒక హీరోయిన్ గా నర్గిస్ నిర్ణయమై పోయింది. ఇక రెండొ అమ్మాయి గురించి వెదుకుతున్న రాజ్ కపూర్ కి నవాబ్ బానూ కనిపించింది. ఓ వారం తరువాత నవాబ్ బానూ ఇంటికి కారు పంపించి స్టూడియోకి పిలిపించుకుని, స్క్రీన్ టెస్టు జరిపించిన రాజ్ కపూర్ ఆమెను రెండొ హీరోయిన్ గా ప్రకటించాడు. ఆ తరువాత రాజ్ కపూర్ ఆమె పేరును “నిమ్మి” గా మార్చాడు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వూలో చెబుతూ, దీనికి కారణమేమయినా తెలుసా అని ఆమెని అడిగితే రాజ్ సాహబ్ ఇంతకుముందు తీసిన (మొదటి) సినిమా “ఆగ్” లో హీరోయిన్ పాత్ర పేరు నిమ్మి. ఆ పేరే నాకు పెట్టాడు అనుకుంటున్నాను అంది ఆమె. అప్పటి నుండీ నవాబ్ బానూ నిమ్మి అయింది.
రాజ్ కపూర్ ఎన్నో భారీ అంచనాల్తో తీసిన తన మొదటి చిత్రం “ఆగ్” (అగ్ని) ఘోర పరాజయాన్ని పొందింది. ఆ సినిమాలో హీరోయిన్ పేరు (నిర్మల/నిమ్మి). అయితే “బర్సాత్” చిత్రం తో నవాబ్ బానూ, రాజ్ కపూర్ ఇద్దరి దశలూ తిరిగాయి. ఆ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. గమనించ దగ్గ విషయమేమిటంటే మొదటి చిత్రం పేరు ఆగ్ (నిప్పు) అయితే రెండొ చిత్రం పేరు బర్సాత్ (వర్షం). ఒకటి నిప్పు మరొకటి నీళ్లు. రెండూ వ్యతిరేకాలు.
Like this story? Share it with a friend!
ఆ రకంగా నవాబ్ బానూ కి పేరూ (నిమ్మి), విజయ వంత మైన బర్సాత్ చిత్రం ద్వారా ప్రఖ్యాతులూ సమకూర్చిన ఘనత రాజ్ కపూర్ కే దక్కుతుంది. బర్సాత్ చిత్రం లో ఈ హీరోయిన్ పర్వత ప్రాంతాల్లో నివసించే లోకం తెలియని ఒక అమాయక యువతి. ఈ పాత్రకు నవాబ్ బానూ సరిగ్గా సరిపోతుందనిపించింది రాజ్ కపూర్ కి. అతడు ఊహించినట్లే ఆ పాత్రకు నవాబ్ బానూ నూటికి నూరుపాళ్లూ, న్యాయం చేకూర్చి,అసంఖ్యాత అభిమానుల్ని సంపాదించుకుని తారా పథానికి ఎగిసింది. బర్సాత్ చిత్రం లోని జియా బేఖరారు హై (jiya beqarar hai Chhayee bahar) ” పాట ఆమెకు ఎనలేని ప్రశస్తి తీసుకొచ్చింది.
బర్సాత్ చిత్రం షూటింగు జరుగుతున్నప్పుడే రాజ్ కపూర్ నిమ్మీ చేత రాఖీ కట్టించుకున్నాడట. ఆ తరువాత, నిమ్మి రాజ్ కపూర్ బ్రతికి వున్నంత కాలం ప్రతి యేటా అతడికి రాఖీ కట్టిందిట. ఈ విషయాలన్నీ స్వయంగా ఆమే ఇంటర్వూలలో చెప్పింది.
నిమ్మీ అప్పటి ప్రముఖ నటీ నటులందరితోనూ నటించింది. ఆమె దేవానంద్ తో సజా (1951), ఆంధియా (1952), దిలీప్ కుమార్ తో దీదార్ (1951), దాగ్ (1952) మొదలైన చిత్రాలలో నటించింది. అప్పట్లొ దిలీప్ కుమార్, నిమ్మి ఒక విజయ వంతమైన జంట. అలాగే ప్రముఖ హీరోయిన్ల తో కూడా ఆమె వెండితెరను పంచు కుంది. మధుబాలా తో అమర్ (1954), సురయా తో షమా (1961), గీతా బాలి తో ఉషా కిరణ్, మీనా కుమారి తో చార్ దిల్ చార్ రాహే (1959) చిత్రాలలో నటించింది. 1956 లో విడుదలయిన బసంత్ బహార్, భాయి భాయి చిత్రాలు నిమ్మి కి ఎంతో పెరు తెచ్చాయి.
నిమ్మి అభినయించిన “బసంత్ బహార్” సినిమాలో “మై పియా తేరి తూ మానే యాన మానే”
ఆ రొజుల్లో చాలా ప్రశస్తి పొందింది ఒక గొప్ప నటి గా ఆమె స్థానం సుస్థిరమైంది. ఈమె నటించిన పాటల్లో “కాహెకొ దేర్ లగాయి రే అయెన అబ్ తక్ బాలుమా”, (దాగ్ చిత్రం),”తూ కౌన్ హై మేరా” (దీదార్ చిత్రం) చెప్పుకో తగ్గవి.
అయితే 1959 లో వచ్చిన “చార్ దిల్ చార్ రాహే” చిత్రం లో ఒక వేశ్య పాత్రలో నటించిన నిమ్మి పలు విమర్శలకు గురి అయింది. దానితో ఆమె తన పాత్రల్ని సరిగ్గా చూసి ఎన్నుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. అలా సీదా సాదా పాత్రలు చేయాలని నిర్ణయించుకున్న నిమ్మి బి. ఆర్. చోప్రా సినిమాలు “సాధనా” (1958), “వో కౌన్ థీ” (1963) చిత్రాలను వదులుకుంది. ఆమె దురదృష్ట వశాత్తు, ఈ రెండు చిత్రాలూ అఖండ విజయాలను సాధించి వాటిలో నటించిన హీరోయిన్లకు, ( సాధన చిత్రం లో వైజయంతి మాలా కు), (వో కౌన్ థీ చిత్రం లో సాధన కు) అమితమైన పేరు తెచ్చాయి. దీని తో తాను తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు గమనించిన నిమ్మి, సినీ రంగానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది.
అయితే మొఘలే ఆజం దర్శకుడు కె ఆసిఫ్ అప్పట్లో లైలా మజ్ఞూ ప్రేమ కథ అధారంగా “లవ్ & గాడ్” అనే సినిమా నిర్మాణానికి సన్నాహాలు చేస్తూ దానిలో హీరోయిన్ గా నిమ్మి ని నిర్ణయించాడు. ఈ సినిమా తొ తాను గొప్ప నటిగా నిలబడి పోవచ్చని ఊహించిన నిమ్మి ఆ చిత్రం పూర్తి అయ్యేంత వరకూ సినీమా రంగం లో కొనసాగాలని నిర్ణయించుకుంది. నిమ్మీ కి జంటగా నటుల్ని నిర్ణయించే క్రమం లో ఆసిఫ్ బాగా అవస్థ పడ్డాడు. చివరికి గురుదత్ తో సినిమా షూటింగ్ మొదలయింది. ఈ సినిమా పూర్తి కాక ముందే గురుదత్ అకాల మరణానికి గురయ్యాడు. అతడి స్థానం లో చివరికి సంజీవ్ కుమార్ ను ఎంపిక చేసుకున్నాడు ఆసిఫ్. అయితే దురదృష్ట వశాత్తు ఆ తరువాత కొద్ది కాలానికే ఆసిఫ్ కూడా మరణించడం తో ఆ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ చిత్రం మీద నిమ్మి పెట్టుకున్న ఆశలు అడుగంటి పోయాయి. (ఆ తరువాత అనేక విధాలుగా రాజీ పడి ఈ అసంపూర్తి చిత్రాన్ని 1986 లో ఆసిఫ్ వితంతువు అక్తర్ ఆసిఫ్ విడుదల చేసింది.)
నిమ్మి మెహబూబ్ స్టుడియోస్ ఆస్థాన స్క్రిప్టు రచయిత “అలి రజా” ను వివాహం చేసుకుని 1965 లో సినిమా రంగం నుండి నిష్క్రమించింది. ఆ జంటకు పిల్లలు లేని కారణంగా ఆమె తన సోదరి కొడుకుని దత్తత తీసుకుంది. ఆ తరువాత పెద్దగా వొడిదుడుకులు లేని ప్రశాంత జీవనాన్ని కొనసాగించింది.
రాజ్య సభ టీవి కి ఇచ్చిన ఒక అరుదైన ఇంటర్వూలో నిమ్మి అగ్రా నుంచి మొదలుపెట్టి తన జీవన యానం లోని ముఖ్యమైన సంఘటనలన్నీ తెలియజేసింది.
‘ఆన్’ చిత్రం లో నూతన నటి (ఆప్పటికి) నాదిరా హీరోయిన్. “ఆన్’ సినిమాను చూసిన డిస్ట్రిబ్యూటర్లు నిమ్మి జనాదరణ దృష్ట్యా సినిమాలో ఆమె నటనా సమయం చాలా తక్కువగా వుందనీ దాన్ని పెంచితే బావుంటుందనీ సలహా ఇవ్వడం తో ఆ సినిమాలో అదనంగా ఒక డ్రీం సెక్వెన్సు కలిపారు నిర్మాతలు.
చిత్రమేమిటంటే ఈ డ్రీం సీక్వెన్సులో హీరొయిన్ గా నిమ్మీ కనిపిస్తుంది.
దేవుడు మనిషికి వున్నట్లుండి సిరిసంపదల్నీ, పేరు ప్రఖ్యాతుల్నీ ఇచ్చేస్తే, ఆ మనిషి భూమి మీద నిలబడడు. జీవితం లో ని విలువలకు కొత్త నిర్వచనాలు ఇస్తాడు. సీదా సాదా జీవితం మాయమవుతుంది. సాధారణ మనుషుల విషయం లో నే ఇలా వుంటే ఇక సినిమా తారల సంగతేమిటీ?
అయితే ఇలా ఒక్క సారే భోగ భాగ్యాల్నీ, పేరు ప్రతిష్టల్నీ, సంఘం లో గౌరవాన్నీ పొంది, రాత్రికి రాత్రే సినీ వినీలాకాశం లో తారగా ఉదయించిన నిమ్మి మాత్రం, సనాతన సాంప్రదాయాల్ని, మనుషుల మనస్తత్వాల్నీ, మానవత్వపు విలువల్నీ మరిచిపోలేదు. ఒక గౌరవ ప్రదమైన జీవితాన్ని గడిపి ఉనికి ఆకాశం లో వు న్నా ఊపిరి నేల మీదె తీసుకుంది. అలనాటి హీరోయిన్లు మధుబాలా, వైజయంతి మాలా, నర్గిస్ ల లా పేరు తెచ్చుకోలేక పోయినా తన దంటు ఒక జనాదరణను నిలుపుకుంది. ఆమె భర్త అలి రజా 2007 లో చని ఫోయాడు. మార్చి 25, 2020 నాడు తన 88 వ యేట, నిమ్మి గా పిలువబడిన నవాబ్ బానూ ముంబైలో చివరి శ్వాస విడిచింది.
(Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM
Consultant, PMP Certification, Project Management & Quality
Mob: +91 9849310610)
Mob: +91 9849310610)