కర్నూలు నగరంలో రాయలసీమ విద్యార్థి సమాఖ్య, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి, రాయలసీమ యువ విద్యార్థి సంఘం ఆద్వర్యం లో విద్వాన్ విశ్వం 104వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి నాయకులు రవికుమార్, సీమక్రిష్ణ, రంగముని నాయుడు మాట్లాడుతూ, విద్వాన్ విశ్వం సాహిత్య, సామాజిక సేవలను భావితరాలకు అందించే విధంగా మన పరిధిలో చిన్న కార్యక్రమాలనైన చేయడం మన బాధ్యత అని అన్నారు.
“అనంతపురం జిల్లాలోని , తరిమెల గ్రామంలో 1915 అక్టోబర్ 21న జన్మించిన విద్వాన్ విశ్వం పేరు వినగానే రాయలసీమ కన్నీటిగాథ “పెన్నేటి పాట” (1956) గుర్తుకొస్తుంది. పెన్నేటి నదిని ఆ ప్రాంత జీవితానికి ప్రతీక చేసి….ఆ నది ఎండి పోతున్నట్టే… అక్కడి రైతుల జీవితం ఎండిపోవటాన్నిచాలా హృదయవిదారకంగా చిత్రించాడు.ఆనాటికంటే ఈనాడు రాయలసీమలో రైతు జీవితం మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది. విద్వాన్ విశ్వం స్ఫూర్తి తో ఈ తరం సీమ రచయితలు మరింత విస్తృతంగా సృజనసాహిత్యం వెలువరింపచేయాల్సి ఉంది.
“విశ్వం గారు..పాపం, నాహృదయం, ఒకనాడు లాంటి లఘుకావ్యాలతో పాటు…”రాతలు- గీతలు” అనే పద్యకావ్యం రాశారు. అవీ-ఇవి, తెలుపు-నలుపు, మాణిక్యవీణ తదితర శీర్షికలు కొనసాగించారు. ఇంకా వెలుగులోకి రాని వచన కవితలున్నాయి.సంస్కృతంలోని..అనేక కావ్యాలకు తెలుగులో వచన రచనలుగా వెలువరించాడు.
“తొలిరోజుల్లో వామపక్ష భావాల కార్యకర్తగా, స్వాతంత్య్రసమరయోధుడుగా, పాత్రికేయుడుగా, సంపాదకుడుగా, ప్రచురణకర్తగా, కవిగా, కథకుడుగా, నవలా రచయితగా, ఉపన్యాసకునిగా, అనువాదకునిగా, ఇలా విభిన్న సాహిత్యరంగాలో బహుముఖ పాత్ర నిర్వహించారు,” అని వారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అశోక్, రాయలసీమ యువ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు రామక్రిష్ణ, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి నాయకులు తెర్నెకల్ రవి, క్రిష్ణతేజ, రమేష్ గౌడ్, నాయుడు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.