( పరకాల సూర్యమోహన్)
జర్నలిజం కత్తిమీద సాము లాంటిది. ముఖ్యంగా తెలుగు పత్రికలలో పనిచేసే పాత్రికేయులకు ఇంగ్లీషులో అందే జాతీయ, అంతర్జాతీయ వార్తల్ని అనువాదం చేస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ వుంటాయి. అనుభవం వున్న పాత్రికేయులు అనువాదాలను అవలీలగా చేస్తూ వున్నప్పటికీ, ఒక్కోసారి పని తొందరలోనో, ఎడిషన్ టైమ్ అయిపోతోందన్న టెన్షన్లోనో పొరపాటుగా అనువాదాలు చేస్తూ వుంటారు. సదరు పాత్రికేయులు ఎంతో అనుభవజ్ఞులై ఉన్నప్పటికీ, కారణాలు ఏమైతేనేమి, పొరపాట్లు దొర్లుతూ వుంటాయి. జర్నలిజం ఎన్నో సవాళ్లతో కూడుకున్న వృత్తి. టైమ్కి మేటర్ ఇవ్వాలి. టైమ్ కి ఎడిషన్ ప్రింట్ అవ్వాలి. టైమ్ కి మేటర్ ఇవ్వకపోతే ఎడిషన్ లేట్ అవుతుంది. కాపీలు లేటుగా మార్కెట్ కు వెళ్లడం పత్రిక ప్రతిష్టకు దెబ్బ. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి వున్న వృత్తి జర్నలిజం.
ఒక్కోసారి అనువాదం చేస్తున్నప్పుడు తెలియని మాటలు ఎదురైనప్పుడు, డిక్షనరీ చూడకుండా ఆ సమయానికి మనకు తోచిన అర్థం రాసినా తప్పులు దొర్లే ప్రమాదం వుంది.
పత్రికా ఆఫీసులో ఓ మూల కూచుని ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువాదం చేసే న్యూస్ ఐటెమ్ ని మర్నాడు కొన్ని వందల వేల మంది పాఠకులు చదువుతారు అన్న విషయాన్ని ఈ వృత్తిలో వున్న మనం అనుక్షణం గుర్తుంచుకుంటూ వుండాలి. తప్పులు చేయడం సహజమే. కానీ, పాత్రికేయులు తప్పుగా అనువాదాలు చేస్తే పాఠకులు నవ్వుకుంటారు. విమర్శిస్తూ ఉత్తరాలు రాస్తారు. ఫోన్లు వస్తాయి. ఆతర్వాత, అలా తప్పుగా అనువాదం చేసిన పాత్రికేయుణ్ణి ఎడిటర్ గారు పిలిచి చివాట్లు పెట్టి, పత్రికలో సవరణ వేయడం తరచుగా జరుగుతూ వుండే విషయమే.
ఇంగ్లీషు పత్రికల్లో స్పెల్లింగ్ తప్పులు, గ్రామర్ తప్పులు కనిపిస్తూ వుంటాయి. అలాగే తెలుగు పత్రికల్లో అనువాదం తప్పులు కనిపిస్తాయి. మనం రోజూ పత్రికలను తిరగేస్తున్నప్పుడు మనకు ఎక్కడో అక్కడ తప్పులు, కొన్ని విచిత్రమైన తప్పులు కనిపిస్తూ వుంటాయి. వాటిని చదివి పాఠకులు నవ్వుకుంటూ వుంటారు.
నా దృష్టికి వచ్చిన, నేను చదివిన కొన్ని విచిత్రమైన తప్పుల్ని ఇక్కడ ఉదహరిస్తాను. వాటిని అనువాదంచేసిన పాత్రికేయుల్నిగాని, అటువంటి వార్తల్ని ప్రచురించిన పత్రికలను గానీ కించపరచడం నా ఉద్దేశం కాదు. క్లిష్టమైన వార్తల్ని అనువాదంచేసే యువ పాత్రికేయులేకాక, ఈ వృత్తిలో నిష్ణాతులైన వారు, జర్నలిజాన్ని కాచి, వడపోసి, ఔపోసన పట్టిన మహామహులు, ఉద్దండులు సైతం ఇంగ్లీషు వార్తల్ని తెలుగులో తర్జుమా చేస్తున్నప్పుడు పప్పులో కాలేసిన సందర్భాలు అనేకం వున్నాయి.
నేను ఆంధ్రజ్యోతిలో ట్రైనీ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నప్పుడు నార్లగారు ఎడిటర్, నండూరి రామమోహనరావుగారు అసిస్టెంట్ ఎడిటర్ గా వుండేవారు. నేను జర్నలిజంలో ఓనమాలు నేర్చుకున్నది వారి వద్దనేనని సగర్వంగా చెప్పుకోగలను. పత్రికా రచనలో అధునాతన పద్ధతుల్ని ప్రవేశపెట్టి, తెలుగు జర్నలిజానికి పితామహునిగా పేరుపొందిన నార్లవారి వద్ద, ఆయన అడుగు జాడల్లో నడచి, ఉన్నత శిఖరాలను అధిరోహించిన నండూరివారి వద్ద పనిచేసే మహాద్భాగ్యం లభించిన పాత్రికేయులలో నేనొకణ్ణి. అనువాదం చేసిన న్యూస్ ఐటెమ్ ల్ని నండూరివారు చూసేవారు. తప్పుగా అనువాదం చేస్తే పిలిచి అర్థం విడమరిచి చెప్పేవారు. అప్పుడు మేము వాటిని తిరిగి రాసేవాళ్లం. పదేపదే తప్పులు చేస్తే మెత్తగా చివాట్లు పెట్టేవారు. అలా నేను ఎన్నోసార్లు చివాట్లు తిన్నాను.
ఆ రోజుల్లో నార్లవారు ఒక సాంప్రదాయం నెలకొల్పారు.
ఆనాటి ఎడిషన్లో దొర్లిన తప్పుల్ని, వాటికి సరైన మాటల్ని నోటీసు బోర్డులో రాసి పెట్టేవారు. మాటలకు అర్థాలే కాదు, మనుషుల పేర్లు కూడా. అందరూ ఒకే విధంగా ఎలా రాయాలో చెప్పేవారు. అప్పట్లో రష్యా ప్రధాని కృష్చేవ్ పేరు తెలుగులో ఎలా సరిగ్గా రాయాలో తెలియక అందరూ తలో విధంగా రాసేవారు. ఇది గమనించిన నార్లవారు, మన పత్రికలో ఇక నుంచి ఆయన పేరుని అందరూ ఇలా ఒకే విధంగా రాయాలి అని నోటీసు బోర్డులో రాసారు.
ఒకసారి పత్రికలో చాలా విచిత్రమైన తప్పు దొర్లింది. 10 women were taken into custody under suppression of immoral traffic అనే వాక్యాన్ని ఒక యువ పాత్రికేయుడు ‘ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన పదిమంది యువతుల అరెస్టు’ అని అనువాదం చేసాడు.
‘వ్యభిచార నేరం క్రింద అరెస్టు’ అని రాయడానికి బదులు దురదృష్టవశాత్తూ, ఎవరికంటా పడకుండా అది పత్రికలో అచ్చు అయిపోయింది. ఫోన్లు వచ్చాయి. ఉత్తరాలు వచ్చాయి. సదరు పాత్రికేయుణ్ణి నార్లవారు పిలిచి చివాట్లు పెట్టారు అనుకోండి అది వేరే విషయం. చూసారా ఎంత విచిత్రమైన తప్పు దొర్లిందో!
ఒకసారి ఒక ప్రముఖ దినపత్రికలో ‘స్వర్గీయ నెహ్రూ మృతికి దేశ నివాళి’ అని డబుల్ కాలమ్ హెడ్డింగ్ తో వార్త వచ్చింది. స్వర్గీయ, మృతి – ఈ రెంటికీ అర్థం ఒకటే కదా!
Prime minister dedicates the heavy plates and vessels plant to nation అనే వార్తకు ఒక పత్రికలో భారీ పళ్లేలు, పాత్రల కర్మాగారాన్ని ప్రధాని దేశానికి అంకితం ఇచ్చారు అని అచ్చు అయింది. (నౌకలు, నౌకల విడిభాగాల తయారీ కర్మాగారం అని అర్థం). On seing the thief she raised an alarm అనే మాటకు దొంగని చూడగానే ఆమె అలారం మోగించిందనీ అచ్చయ్యింది. దొంగని చూడగానే ఆమె భయంతో కేకలు పెట్టిందనో లేదా గట్టిగా అరిచిందనో రాయాలి.
He bought a pack of cigarettes at a near by kiosk అనే వాక్యాన్ని ‘కియోస్క్’ అనే చోట ఆయన సిగరెట్ పెట్టె కొనుక్కున్నాడనీ అనువాదం చేయడం జరిగింది. కియోస్క్ అంటే చిన్న బడ్డీ కొట్టు లాంటిది.
Six mountaineers were killed by an avalanche అనే వాక్యాన్ని ఏవలాంచ్ అనే ప్రదేశంలో పర్వతారోహకుల మృతి అని అనువాదం అయింది. కాని, మంచు చరియలు విరిగిపడి పర్వతారోహకుల మృతి అని రాయాలి.
Opposition members squatted near the well during the question hour అనే వాక్యా న్ని సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు బావివద్ద భైటాయించారు అని అనువాదం చేయడం జరిగింది. పార్లమెంట్, అసెంబ్లీలో సభ మధ్య ప్రాంతాన్ని well అంటారు.
Addressing a mammoth meeting, the PM said అనే వాక్యాన్ని మెమ్మొత్తుల మహాసభలో ప్రధాని ప్రసంగిస్తూ అని ఒక పత్రికలో వార్త వచ్చింది. mammoth అంటే పెద్ద బహిరంగ సభ
He hit the bul’s eye కి ఎద్దు కంటిని గురి చూసి కొట్టాడనీ, PM left by air అంటే ప్రధాని గాలిలో వెళ్లారని, from dawn to dusk అనే మాటకు డాన్ నది నుంచి డస్క్ నది వరకూ అనీ, (డాన్ టు డస్క్ అంటే ఉదయం నుంచి చీకటి పడే వరకూ అని అర్థం) Paddy crop కి వరి వృక్షాలు అనీ, two inch mortar (ఒక చిన్న సైజు ఫిరంగి లాంటిది) రెండు అంగుళాల సున్నం అనీ, they worked round the clock అనే మాటకు గడియారం చుట్టూ పని చేసారని కొన్ని పత్రికల్లో అచ్చు అయింది.
ఒక కొత్త సబ్బు గురించి ఒకసారి ఒక పత్రికలో అరపేజీ వ్యాపార ప్రకటన వచ్చింది. అందులో ఆ కొత్త సబ్బు ఫొటో, దాని పక్కన తాటికాయంత అక్షరాలతో ‘తొక్క ఒలిచిన ఉల్లాసం’ అని రాసి వుంది. అదే వ్యాపార ప్రకటన ఇంగ్లీషు పత్రికలో peel the wrapper, feel the sensation అని వుంది. దీనికి ఖర్మకొద్దీ తెలుగు అనువాదం అలా వచ్చింది. ఈ మధ్య కాలంలోనే ఒక తెలుగు పత్రికలో ‘నిషా’ అనే పేరుగల అమ్మాయి అన్నమయ్య భక్తి కీర్తనల గానం చేస్తే, ఆ ఐటమ్ కు హెడ్డింగ్ ఇలా వచ్చింది. ‘మత్తెక్కించిన నిషా గానం’
మరొక పత్రికలో ‘పంతం నెగ్గిన చెన్నా’ అని హెడ్డింగ్ తో వార్త వచ్చింది. ‘నెగ్గిన చెన్నా పంతం’ అని గాని లేదా ‘పంతం నెగ్గించుకున్న చెన్నా’ అని రాయాలి.
తెలుగు పాత్రికేయులు అనువాదం చేస్తున్నప్పుడు సాయపడేందుకు తెలుగులో పదకోశాలు అనేకం ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. తెలుగు అకాడమీ, ప్రెస్ అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం ఈ రంగంలో కొత్త కృషి చేశాయి. అదే విధంగా పాత్రికేయులు బూదరాజు రాధాకృష్ణ (ఈనాడు వ్యవహారకోశం), ఎ.బి.కె.ప్రసాద్ (పలుకుబడి), పరకాల సూర్యమోహన్ (జర్నలిస్టుల పదకోశం), బి. ఆర్.
బాపూజీ, కట్టా శేఖర్ రెడ్డి (జర్నలిస్టు కరదీపిక) పదకోశాలను రూపొందించారు.
Don’t assume or presume any thing in journalism అంటారు పెద్దలు. అనువాదం చేస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందికరమైన మాటలు, వాక్యాలు ఎదురవుతూ వుంటాయి. వాటికి సరైన అర్థం తెలుసుకుని, ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని మీ సొంత మాటల్లో పాఠకులకు అర్థం అయ్యే విధంగా అనువాదం చేయడం, అనువాదం సాఫీగా సాగేలా చూడటం తెలుగు పాత్రికేయులకు నిజంగా కత్తిమీద సామే.
వార్తాపత్రికలు సమాజంలో ఎంత కీలకపాత్ర వహిస్తున్నాయో మనందరికీ తెలుసు. ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతోందో పాఠకులకు మనసు హత్తుకునేలా, కళ్లకు కట్టినట్టు అందిస్తున్న ఘనత మన పాత్రికేయులదే. అంతటి ఉదాత్తమమైన వృత్తి పాత్రికేయ వృత్తి. అందుకనే కామోసు, Journalist never sees either sunset or sunrise అంటారు.