(భూమన్ )
దీనికి చాలా పేర్లున్నాయి. ఇక్కడి వారు దీన్ని మునీశ్వర జలపాతం అని, మహేశ్వర జలపాతం అని,మూలకోనం జలపాతం అని రకరకాలపేర్లతో పిలుస్తున్నారు. మాక్కూడ నిన్నమొన్నటి దాకా ఇంత అద్భుతమయిన జలపాతం ఇంత దగ్గర్లో ఉందన్న విషయం తెలియదు. తిరుపతినుంచి మోహన్ బాబు ఇంజనీరంగ్ కాలేజీ, రంగంపేట, నారాయణ పల్లె, కందులవారి పల్లె, భీమవరం, మూలపల్లె దాటుకుని రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే రోడ్డుకు ఎడమ వైపు జాలువారే ఈ జలపాతాన్ని కనులారా వీక్షించవచ్చు.
నారాయణ పల్లె నుండి కొండల నడుమ మన ప్రయాణం చాలా ధ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆరోడ్డెంబటా పోతే ఒకవైపు చిత్తూరుకు, మరొక వైపు పులిచెర్ల మీదుగా పీలేరు చేరుకోవచ్చు.
జలపాతపు సానువులే చూపరులను కట్టిపడేస్తాయి. రెండు గొండల నడుమపారుతున్న ఈ నీటి సోయగానికి చేరుకోవడానికి ఆపక్క ఈ పక్క పైకెక్కడానికి దారే లేదు. నీటి పారకం వెంట పెద్ద పెద్ద గుండ్లు ఎక్కుతూ దిగుతూ మోకాటి నీళ్ల లోతున నడుచుకుంటూ పైక ఎగబాకినాము… ఇక్కడ నాలుగు అంచెలుగా గుండాలున్నాయి. నాలుగు జలపాతాలకు తలలొంచి పైకెక్కడం గగనమే. ఇది చాలా సాహసోపేతమయిన ట్రెక్కింగ్…అందునా నాబోటి వాళ్లకి. ఆ ఎగుడు దిగుళ్ల నీటి శబ్ద తరంగాల లయల మధ్యన పారే గలగలల మధ్య, ఆ ప్రకృతి సోయగం, అందచందలా మధ్య ఏ మాత్రం ఇబ్బంది పడకుండా మొత్తానికి వెళ్లగలిగాను. చివరికంటా పోతేనే గొప్ప అనుభూతి.నీటిలో ఈదులాడుతూ పైకి చూస్తే చెట్టనడుమనుంచి కనిపించే ఆకాశపు అందాలు, అటు ఇటూ పక్షుల లయబద్ధపు గొంతుకలు గొప్ప హాయినిస్తాయి.
ఈ జతపాతానికి కూత వేటు దూరంలో మరొక జలపాతం ఉంది.దాన్ని గురించి మరొక సారి.
Like this story? Share it with a friend!