(వివేకానందరెడ్డి లోమాటి)
ఏదైనా వాస్తవ జీవితానికి దగ్గరగా ఉన్న కథ చదివినప్పుడు సాదారణంగా మనకనిపించే మాట ఈ కథలో జీవముందబ్బా అని. మరి అలాంటి కథలు ఒకేసారి ముప్పై ఓ చదివితే అదే ఈ ‘ఎదారి బతుకులు’.
ప్రేమ, అభిమానం, అనుమానం, అమాయకత్వం, బాధ, వివక్ష, ఆవేదన, మానసిక సంఘర్షణ, హాస్యం, శృతిమించని సరసం మేలవించిన అన్ని కథలూ వేటికవే ప్రత్యేకం. అన్నీ మన చుట్టూరా జరిగినవో, జరుగుతున్నవో లాగా అనిపిస్తాయి తప్ప ఎక్కడే గాని వాస్తవిక పల్లె జీవితం దాటి పోలేదు. అందుకే అంత బాగా హృదయానికి హత్తుకున్నాయేమో.
‘ఇత్తలిబింది’లో నాటి పేదరికం గురించి చెబితే, ‘అవ్వ తలపులు’లో వయసులో ఉండే స్త్రీలు పై కులస్థులకు ఎలా చిక్కుబడ్డారో చెబుతుంది. ‘సావు బియ్యం’లో ఆకలి గురించి చెబితే ‘మాయన్న సదువు’లో కింద కులాల పట్ల వివక్షను హృద్యంగా మను ముందుకు తెస్తుంది.
గంగులవ్వ మజ్జిగలో ఉన్నెంతలో ముసలిదాని దాతృత్వం, పూల పెట్టకథలో బిడ్డల్ను తల్లి కోడి మింద యట్టా తొక్కిస్తావని అమాయకంగా ప్రశ్నించే వాళ్లవ్వ గురించి చెబుతుంది. ఇలా అన్నీ కథలు కూడా ప్రతి పేజిలోనూ మన మనసుల్ని తాకుతూ ముందుకు సాగుతాయి.
ఈరవ్వ ఏమి తినబెట్టిందో కథలో భార్యను పక్క మీదకు రమ్మంటాడు భర్త. అప్పటికే పనిచేసి అలిసిపోయిన భార్య నేను రాలేనుపో అంటుంది. దానికి అలిగిన భర్త ఇంటినుంచి వెళ్లిపోతాడు. వార్నీ వీనితో పెద్ద చిక్కొచ్చి పడిందే అని వెనకాలే పొయి ఒకచోట అడ్డగించి సరే రా పోదాం ఇంట్లో చేసుకుందువు అంటుంది. అప్పుటికే కాక మీదున్నెడేమో నాకు ఇప్పుడే కావాలి, ఈడనే కావాలి అని మొండికేచ్చాడు. తప్పలేదు ఆమెకు. ఇదే విషయం చిన్న పిల్లోల్లకు చెప్పాలి. ఎలా చెప్పాలి. ఉన్నెదున్నెట్టు చెబితే అర్థం చేసుకునే వయసు కాదు కదా అందుకే ‘ఆడ్నే తినబెట్టుకుని ఇంటికి పిలుచుకొస్తిని’ అంటుంది. అడివిలో తినేదానికి అని పిల్లోల్లకు అనుమానం. దాన్ని ఒక్కమాటలో పిల్లలకు చెప్పిన తీరులో రచయిత సునిశిత దృష్టి బయటపడుతుంది. ప్రతి కథలోనూ ఆమెదైన ముద్ర మనకు కనపడుతూనే ఉంటుంది.
అవన్నీ చదివిన తర్వాత ఎవరబ్బా ఇంత బాగా రాసింది అనిపిస్తుంది. ముందుమాటలో రచయిత గురించి ఉన్న నాలుగు మాటలు చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. ఎందుకంటే ఆమె చదివు అయిదో తరగతి వరకు మాత్రమే. పన్నెండేళ్లకే పెండ్లి. తర్వాత స్వయం కృషితో వవసాయం చేసుకుంటూనే నవోదయం పత్రిక సంపాదకవర్గంలో పనిచేస్తుంది. పల్లె జీవితంలో మమేకమయి పోయి వాటినే తన కథా నేపథ్యాలుగా మన ముందుకు తెచ్చింది.
కథలన్నీ చిత్తూరు యాసలో సాగుతూ మన ముందు కొత్త జీవితాలను పరిచయం చేస్తాయి. ఏ కథకు తగ్గట్టు ఆయా పాత్రల చిత్రాలు పుస్తకంలో మరో ప్రత్యేక ఆకర్షణ.
ఎదారి బతుకులు (పల్లె కథలు), రచయిత్రి: ఎండపల్లి భారతి
పేజీలు: 132, వెల : రూ.100, ప్రతులకు : 96528 02460
(లోమాటి వివేకానందరెడ్డి రచయిత, పుస్తక సమీక్షకుడు. వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. సొంతవూరు నందిప్లలె, కడప జిల్లా)