అమెరికాలోని 36 రాష్ట్రాలలో మొన్న మంగళవారం నాడు 52,406 కొరోనా కొత్తకేసులు రికార్డు అయ్యాయి. కోవిడ్ తగ్గిందని అంతా చప్పట్లు కొడుతున్నపుడు ఇదెలా జరిగింది?
దీనికి కారణం… కొరోనా తగ్గిపోయింది అని చిన్న చిన్న సమూహాలుగా జాగ్తత్తలేమీ పాటించంకుండా బాగా పార్టీ లు చేసుకోవడమే అని CDC(Centres of disease control and prevention) డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ (Dr. Robert Redfield) చెప్పారు.
కావున మన వారు కూడ ఆంధ్రప్రదేశ్ లో బాగా తగ్గింది కదా అని దసరా, దీపావళి సమయాలలో విచ్చల విడిగా మాస్కులు లేకుండా తిరిగి, కిట్టీ పార్టీ లు, బర్తుడే, ’భర్త‘డే పార్టీలు, సీమంతాలు, వ్రతాలు అని ఎక్కువగా గుమికూడి చేసుకుంటే మరలా మొదటికి వచ్చి లాక్డౌన్ పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉంటే అందరికీ మంచిది.
ఇప్పుడేగా కాస్త బీదవారు అందరూ పనులకు వెళ్ళి నాలుగు రూకలు సంపాయించకుని ఒక ముద్ద తినడం మొదలయింది. దానికి తోడు వర్షాలు, వరదలు, వైరస్ వ్యాప్తికి అనుకూల వాతావరణం. మా రాయలసీమలో అయితే ఈ పార్టీ లు తక్కువే కాని మందు పార్టీలు ఎక్కువే? కావున అందరూ మాస్కు లు, భాతికదూరం, శానిటైజర్ లేక సోపుతో చేతులు కడగడం మరిచిపోకండి, తగ్గిపోయింది కదా అని అజాగ్రత్తగా ఉంటే విరుచుకు పడుతుంది మహమ్మారి.
ఇంకా మరికొందరయితే నిజంగా జాగ్రత్తలు పాటించే వారిని చూసి అవహేళన చేస్తూన్నారు. OCD (Obsessive-compulsive disorder) జబ్బు వాళ్ళుగా ఎగతాళి చేస్తున్నారు. రెచ్చకొట్టి పార్టీలకు పిలుస్తున్నారు. పిసినారులు అని అంటున్నారు, ఇవి మానుకోండి, ఇలాంటి కవ్విపులకు లొంగిపోవద్దు. ఒక సామెత ఉందిగా, తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని, దీన్ని ఎపుడూ గుర్తు పెట్టుకోండి. మీరు కట్టుబాట్లు క్రమశిక్షణ విస్మరించి సమాజంలోని అందరి జీవితాలతో ఆడుకోకండి. మీ ప్రాణం మీ ఇష్టం అనుకోకండి. అలా ఎపుడూ ఉండదు. మీరు తిరిగేది సమాజం, జనం మధ్య, మీరు పార్టీలతో విచ్చల విడిగిాతే, అది సమాజంలో వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తుంది.
నే చెప్పేది చెప్పాను ఆ తరువాత మీ ఇష్టం….
(Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS),గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు, కర్నూలు. ఆంధ్రప్రదేశ్, మాజీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ ప్రత్యేక అధికారి)