75వ ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురష్కరించుకొని ఈనెల 16 దేశవ్యాప్తంగా 75 రకాల వంగడాలను ప్రధాని ఆవిష్కరించగా, వీటిలో విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన ఇంద్రావతి రాగి వంగడం కూడా చోటు దక్కించుకుంది.
విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్టు టిఎస్ఎస్కె పాత్రో తన పరిశోదనా బృందంతో వచ్చి శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్‌ను ఈ పంట గురించి వివరించారు.
ఈ రకం పంట ఆహారం, పశుగ్రాసం, పోషక భద్రతను చేకూరుస్తుందని చెప్పారు. పంట కాలపరిమితి 115 నుంచి 120 రోజులని, ఖరీఫ్, రబీ కాలంలో కూడా అనుకూలమైనది.
ఈ రకాన్ని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, పుదుచ్చేరి, ఒడిషా రాష్ట్రాల్లో విడుదలకు అనుమతించారు. ఈ ఇంద్రావతి రకానికి పలు తెగుళ్లను, క్రిమి కీటకాలను కూడా తట్టుకొనే సామర్ధ్యం ఉంది. గాలికి, వర్షాలకు పడిపోకుండా నిలబడే రకం.
ఇది వెరైటీ అధిక దిగుబడులను ఇవ్వడమే కాకుండా, మైదాన, కొండ ప్రాంతాల్లో కూడా పంటకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఈ రకాన్ని అభివృద్ది చేయడంలో ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఏ.విష్ణువర్ధనరెడ్డి సహకారంతోపాటు, శాస్త్రవేత్తలు డాక్టర్ ఎన్.అనురాధ, వై.సంధ్యారాణి, యు.త్రివేణి, ఎం.భరతలక్ష్మి కృషి ఉందని పాత్రో చెప్పారు.
కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ ఈ బృందాన్ని అభినందించారు.