పాఠశాలను పుస్తకాల అంగడిగా మార్చిన కేశవరెడ్డి విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి డిమాండ్ చేసింది.
శనివారం నాడు స్థానిక కర్నూలు నగరంలోని సంకల్ బాగ్ నందు ఉన్న కేశవరెడ్డి విద్యా సంస్థల ముందు ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా పర్యటనలో ఉన్న ఎమ్మెల్సీ కత్తి నరసింహ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు, బిసీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం మోహన్, తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంవిఎన్ రాజు యాదవ్, రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుమళ్ళ శ్రీధర్, బిసీ యువజన విద్యార్థి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బండారి సురేష్ బాబు, ఆర్.యు.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షులు బి భాస్కర్ నాయుడు, రాయలసీమ యునైటెడ్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు పల్లపు శంకర్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు డి.దస్తగిరి, బి.సి.ఎస్.యు జిల్లా కార్యదర్శి హరికృష్ణ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సేకరించిన ఫిక్స్ డిపాజిట్స్ తక్షణమే తిరిగి ఇవ్వాలని, కేశవ రెడ్డి విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇలాగే, విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నందున బెయిల్ రద్దు చేయాలని, కేశవ రెడ్డి విద్యా సంస్థల ఆస్తులను తక్షణమే వేలం వేసి బాధితులకు ఉపాధ్యాయులకు సిబ్బందికి పంచి పెట్టాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి సంఘాల పోరాటంతో స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే పాఠశాలను సందర్శించమని డిప్యూటీ డీఈవో రాజకుమారికి ఆదేశించడం జరిగింది . కర్నూలు నగరంలోని సంకల్ బాగ్ నందు ఉన్న కేశవరెడ్డి పాఠశాలను విజిట్ చేసిన డిప్యూటీ డీఈవో పుస్తకాలు అమ్ముతున్న విషయాన్ని పరిశీలించి బుక్స్ స్టోర్ సీజ్ చేయడం జరిగింది. అనంతరం జిల్లా పర్యటనలో ఉన్న ఎమ్మెల్సీ కత్తి నరసింహ రెడ్డిని విద్యార్థి సంఘాల నాయకులు కలిసి కేశవ రెడ్డి యాజమాన్యం మోసాన్ని చట్ట సభలలో వినిపించాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.