ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి తెలుగు రాష్ట్రం సాధించుకోవడంలో కీలకమైన “శ్రీభాగ్ ఒడంబడిక” ను స్మరించుకుంటూ, శ్రీభాగ్ ఒడంబడికను అన్ని రాజకీయ పార్టీలు గౌరవించి రాయలసీమ అభివృద్ధికి తోడ్పడాలని డిమాండ్ చేస్తూ 2018వ సంవత్సరం విజయవాడలో, 2019వ సంవత్సరం అనంతపురంలో “రాయలసీమ సత్యాగ్రహం” విజయవంతంగా నిర్వహించడమైనది. గత రెండు సంవత్సరాలుగా రాయలసీమ సత్యాగ్రహాలు విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వామ్యులైన సమన్వయ వేదిక సభ్య సంస్థలకు అభినందనలు, రాయలసీమ అభిమానులకు, ప్రజాస్వామిక వాదులకు ధన్యవాదాలు.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ప్రత్యేక తెలుగు రాష్ట్ర సాధనకు రాయలసీమ సహకారం అత్యంత అవసరమైన సందర్భంగా, రాయలసీమ విశ్వాసాన్ని పొందడానికి చేసుకున్న ఒప్పందం “శ్రీబాగ్ ఒడంబడిక”. రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు, రాయలసీమకు తాగు, సాగు నీటి వసతి కల్పనలో ప్రధమ ప్రాధాన్యత అనే ప్రధాన అంశాలతో “శ్రీబాగ్ ఒడంబడిక” ను నవంబర్ 16, 1937 న కోస్తా ఆంధ్ర నాయకులు రాయలసీమ నాయకులతో చేసుకొన్న విషయం మనందరికీ తెలిసినదే.
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని లేదా హైకోర్ట్ లలో రాయలసీమ ఏది కోరుకుంటే అది ఏర్పాటు చెయ్యాల్సి ఉన్నా, గత ప్రభుత్వం ఏక పక్షంగా అన్నింటిని అమరావతి కేంద్రంగా చేపట్టింది. ప్రస్తత ప్రభుత్వం న్యాయ రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, అమరావతి ప్రాంత వాసులు అడ్డంకులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
ఇదే సందర్భంలో తెలంగాణా రాష్ట్రం విడిపోయిన అనంతరం రాయలసీమ సాగునీటికి సంబంధించిన కింద పొందుపర్చిన మూడు కీలకమైన విషయాలలో ప్రభుత్వాల ప్రకటనలకు, ఆచరణకు పొంతనే లేదు.
1.తుంగభద్ర నదిపై చట్టబద్దమైన నీటి హక్కులన్న ప్రాజక్టులకు సక్రమంగా నీరు అందించడడానికి చేపట్టాల్సిన నిర్మాణాలు.
2.ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో నిర్మాణంలో ఉన్న రాయలసీమ ప్రాజక్టులకు నీటి కేటాయింపులతో నిర్మాణాలు పూర్తి చేయడం.
3.రాయలసీమ పర్యావరణ పరిరక్షణకు మరియు అభివృద్ధికి కీలకమైన చెరువుల, కుంటల నిర్మాణం, పునర్నిర్మాణం వీటిని వాగులు, వంకలు, కాలువలతో అనుసంధానం చేయడానికి ప్రత్యేగా ఇర్రిగేషన్ కమీషన్ ఏర్పాటు.
రాయలసీమ భవిష్యత్తుకు కీలకమైన అపెక్స్ సమావేశం అనంతరం రాజకీయ పార్టీలు నిర్మాణాత్మకంగా వ్యవహిరించి రాయలసీమ అభివృద్దికి బాసటగా నిలివాల్సిన సందర్భంలో కూడా, రాయలసీమ అంశాలు తమకు పట్టిపట్టనట్లు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం, అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమ బాసటగా నిలబడండి, శ్రిబాగ్ ఒడంబడిక స్పూర్తితో రాయలసీమ అభివృద్దికి తోడ్పడండి అనే డిమాండ్ తో ‘రాయలసీమ సత్యగ్రహం – 2020’ నిర్వహించే విషయంపైన మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు, కార్యాచరణ ప్రణాళికలను పంపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
(బొజ్జా దశరథ రామి రెడ్డి, కన్వీనర్, రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక, నంద్యాల)