అవును..మీరు విన్నది కరెక్టే…తెలుగు రెండు రాష్ట్రాల థియోటర్స్ ప్రేక్షకులకు ఫ్రీ షోలు వేయటానికి సిద్దపడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే అసలే కరోనా దెబ్బతో దెబ్బతిన్న థియేటర్స్ ఈ ఫ్రీ షో ల పోగ్రామ్ పెట్టుకుని పాముకునేదేముంది అనేగా మీ ప్రశ్న. అయితే ఇక్కడ వాళ్ల ఆలోచన ఏమిటంటే…దాదాపు ఏడెనిమిది నెలలుగా థియోటర్స్ కు రాకుండా జనం ఓటీటిలతో కాలక్షేపం చేస్తున్నారు.
ఇప్పుడు మళ్లీ థియోటర్స్ తెరిస్తే వెంటనే వస్తారా అనే సందేహాలు అందరికీ ఉన్నాయి. ఎందుకంటే కరోనా ఇంకా కంట్రోలులోకి రాలేదు. ఓ ప్రక్కన ప్రధాన మంత్రి కూడా కరోనాను లైట్ గా తీసుకోకండి..వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తలు తప్పవు అంటూ హెచ్చరిస్తున్నారు. మరి మోడీగారి మాటలు విని జనం ఇళ్లల్లోనే ఉండిపోతే..థియోటర్స్ తెరిచి ఉపయోగం ఏమిటి అనేది ఎగ్జిబిటర్స్ ప్రశ్న.
అందుకే థియోటర్స్ యాజమాన్యం..మళ్లీ జనాలను థియేటర్లకు తిరిగి రప్పించడానికి మొదట్లో ఫ్రీ షోలను నిర్వహించే పద్ధతుల గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని సినిమా థియేటర్ యజమానులు ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు ఆకర్షించడానికి, వారు తిరిగి తెరిచినప్పుడు ప్రారంభంలో ఫ్రీ షోల స్కీమ్ పెట్టబోతున్నారు. అందుకోసం థియేటర్ ఓనర్స్ పాత కంటెంట్ ని ఆశ్రయిస్తారు. అంటే ఇప్పటికే రిలీజైన హిట్ సినిమాలను డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఉచితంగా లేదా చాలా తక్కువ రేటుకి తీసుకుని ఈ ట్రైల్ వేయబోతున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంలో ఇంకా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు.
ఆసియా సినిమాస్‌కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్డిబిటర్, నిర్మాత అయిన సునీల్ నారంగ్ మాట్లాడుతూ…ఈ ఫ్రీ షోల గురించి తాము ఆలోచిస్తున్నామని, అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. త్వరలో అప్డేట్ ఇస్తామని ఆయన చెప్పారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ అభిప్రాయం ప్రకారం.. ప్రారంభంలో ఫ్ఱీ షోలు వేయటం మంచి ఆలోచన అయినప్పటికీ, లాక్డౌన్ కారణంగా ఉన్న నష్టాలను మాత్రమే ఇది పెంచుతుంది అంటున్నారు. “ఈ విషయంపై మాకు ఇంకా స్పష్టత లేదు, కానీ థియేటర్లలోకి ఆకర్షించటానికి ప్రేక్షకుల ఏ మేరకు ధైర్యంగా సినిమాలకు వస్తారు అనేది టెస్ట్ చేసుకోవటానికి ఇది మంచి మార్గం,ఇది మాకు నష్టమే అయినా తప్పదు ” అని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమాని సుధర్శన్ థియేటర్ యజమాని అన్నారు.