న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణతో పాటు మరికొంతమంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు చివరకు ఏ పరిస్థితికి దారితీస్తాయనే అంశం బాగా చర్చనీయాంశమయింది.
ఈ ఆరోపణల నేపథ్యలో జస్టిస్ రమణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమోషన్ దక్కకపోవచ్చని, ఈ బహిరంగ దాడి ఉద్దేశమదే నని ఒక వర్గం భావిస్తున్నది.
మరొక వర్గం తొందర్లో తన అక్రమ ఆస్తుల విషయంలో ఏదో కీలకమయిన తీర్పు రాబోతున్నదని కీడు శంకించి కోర్టుల మీద ఈ దాడికి పూనుకుంటున్నారని మరొక వర్గం అనుమానిస్తున్నది.
తన మీద, తన ప్రభుత్వం మీద కోర్టులు పగబట్టాయని,దీని వెనక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన వెనక జస్టిస్ రమణ ఉన్నారని,అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే కేసులన్నింటా తీర్పులు ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రతిబంధకంగా తయారయ్యాయని జగన్ అనుమానిస్తున్నారు. జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ సారాంశమంతా అదే.
ఇది కాదు, రేపు అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టులో శిక్షపడితే, తాము దీనిని వూహించామని, దీని వెనక కూడా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి హస్తముందని చెప్పి సానుభూతి సంపాదించేందుకు జగన్ తాపత్రయపడుతున్నారని ఆయన వ్యతిరేకులు వాదిస్తున్నారు.
జస్టిస్ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ప్రభావితమ చేస్తున్నాడని, ఆయన ప్రధాన న్యాయమూర్తి ఇది ఇంకా తీవ్రమవుతుందని జగన్ అనుమానం. అందకే వచ్చే ఏడాది జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తి కాకుండా ఉండేందుకు తాడోపేడో తేల్చుకునేందుకు ఏకంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి మీద చర్య తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి కి లేఖ రాశారు. దాని వెంటనే పత్రికలకువిడుదల చేశారు.
ఇపుడు ప్రధాన న్యాయమూర్తి లేఖ మీద స్పందించి తీరాలి. ఏలా స్పందిస్తారు. లేఖలో జస్టిస్ రమణ మీద చేసిన ఆరోపణలను పరిశీలించేందుకు సీనియర్ న్యామమూర్తులతో కమిటీ వేస్తారా.. లేదా మరొక చర్య ఏదయిన తీసుకుంటారా?
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చర్య ఆలస్యమయిన జస్టిస్ రమణను తొలిగించాలని పార్లమెంటులో ఇంపీచ్ చేసేందుకు క్యాంపెయిన మొదలుపెడతారా? ఏమయినా ముందుముందు జగన్ వెర్సెస్ జస్టిస్ రమణ వ్యవహారం ఇంకా ఘాటెక్కుతుంది.
ఈ సమయంలో, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద తీవ్రమయిన ఆరోపణలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడమేకాదు, దానిని గోప్యంగా ఉంచకుండా పత్రికలకు విడుదలచేయడాన్నిఖండిస్తూ సుప్రీంకోర్టులో ఒకపిటిషన్ దాఖలయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టులో న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణతో తోపాటు హైకోర్టు న్యాయమూర్తులపై పలు రకాల ఆరోపణలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డేకి చేసిన ఫిర్యాదు మీద ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ తాను చేసిన ఫిర్యాదు బహిరంగంగా విడుదల చేయటాన్ని పిటిషనర్ సవాల్ చేశారు.
ముఖ్యమంత్రి జగన్ తోపాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నిహద్దులను అతిక్రమించారని ఆయనపై చర్యలు తీసుకోవాలని సునీల్ న్యాయస్థానాన్ని కోరారు.
న్యాయమూర్తులకు వ్యతిరేకంగా విలేకర్ల సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడటానికి అడ్డు కట్టవేయాలని దీనిని ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది సునీల్‌కుమార్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రాజ్యాంగంలోని అధికరణాలు 121, 211 ప్రకారం కోర్టులలలో విధుల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు,హైకోర్టు న్యాయమూర్తుల మీద పార్లమెంటులోగాని, అసెంబ్లీలలో గాని చర్చజరపడం నిషేధమని చెబుతూ దీనికి భిన్నంగా వ్యవహరించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి షో కాజ్ నోటీసు జారీ చేయాలని కూడా పిటిషన్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిరాధార ఆరోపణలు చేసి దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ పరువు ప్రతిష్టలను దిగజార్చే ప్రయత్నం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) కింద ఉన్న భావప్రకటనా స్వేచ్ఛకూ కొన్ని పరిమితులు ఉన్నాయి.
పిటిషన్ లో పేర్కొన్న మరిన్ని అంశాలు:
న్యాయస్థానాల తీర్పులమీదప్రజాస్వామ్య సమాజంలో చర్చకు అవకాశం ఉన్నప్పటికీ వాటిని ఆధారంగా చేసుకుని న్యాయమూర్తులపై వ్యక్తిగత దాడులు చేయటానికి వీల్లేదు.
ఇలాంటి సంఘటనలతో ప్రజాస్వామ్య సమాజంలో ప్రజల్లో విశ్వాసం నింపాల్సిన న్యాయవ్యవస్థ విశ్వనీయతే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.
ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది.
ఇక్కడ ఆయన ఏ నిబంధననూ పాటించినట్లు కనిపించటంలేదు.
అధికార రహస్యాలను, రాజ్యాంగ విలువలను కాపాడతామని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిపై న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది.
రాజ్యాంగం ప్రసాదించిన అధికార విభజన సూత్రం ప్రకారం మూడు వ్యవస్థల మధ్య పరస్పర గౌరవం ఉండాలి. ఒకరి పాత్రను మరొకరు గౌరవించాలి.
ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిరపరిచే ప్రయత్నం తప్ప మరొకటిగా కనిపించలేదు.
సుదీర్ఘకాలం న్యాయవ్యవస్థలో ఉన్న గౌరవప్రదమైన న్యాయమూర్తికి వ్యతిరేకంగా ప్రతివాది జగన్ వ్యాఖ్యలు చేసిన సమయం చాలా అనుమానాస్పదంగా ఉంది.
ప్రస్తుతం దేశం వివిధ సామాజిక, ఆర్థిక సవాళ్లు, సరిహద్దుల్లో అలజడులు నెలకొన్న సమయంలో ఇలాంటి ఆరోపణలు చేయటం వెనుక దురుద్దేశాలు ఉన్నాయి.
ప్రతివాది తన బాధ్యతారాహిత్యమైన ప్రకటన, ప్రవర్తన ద్వారా వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయటానికి చేసిన ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు.