(చందమూరి నరసింహారెడ్డి)
స్త్రీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సమగ్రంగా ఎన్నో రచనలు అందించింది .ఆమె ఓ ఫెమినిస్టు్. తన రచనలతో పాఠకులను విశేషంగా ఆకర్షించింది .కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకుంది .ఆమె ఎవరో కాదు అబ్బూరి ఛాయాదేవి.
అబ్బూరి ఛాయాదేవి రాజమహేంద్రవరంలో1933 అక్టోబరు 13 న జన్మించారు.తండ్రి మద్దాలి వెంకటాచలం, తల్లి వెంకట రమణమ్మ.
1951-53 లో నిజాం కళాశాల నుండి ఎం.ఏ. చదివారు. 1953లో కాలేజీ మాగజైన్ లో ప్రచురించిన “అనుభూతి “వీరి మొదటి కథ. న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్ గా పనిచేసారు.
మధ్యతరగతి కుటుంబాలలోని మహిళలను కథా వస్తువుగా చేసుకుని పలు కథలు రాశారు. ఆమె రాసిన కథల్లో కొన్ని హిందీ, మరాఠీ, కన్నడ, తమిళ భాషల్లోకి అనువందించబడ్డాయి. ఛాయాదేవి రాసిన వాటిలో బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు అబ్బూరి ఛాయాదేవి ప్రసిద్ధ రచనలు.
సాహిత్య అకాడమీకి రచయిత్రుల రచనలు సంకలనం చేసిపెట్టారు. జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీని తెలుగు పాఠకులకు తనదైన రీతిలో పరిచయం చేశారు. జిడ్డు కృష్ణమూర్తి తాత్త్విక దృక్పథమే ఆమె జీవితాన్ని నడిపించింది. ప్రతి క్షణాన్నీ విలువైనదిగా భావించి జీవించడం, జీవితం పట్ల ప్రేమ పూర్వక నిర్లిప్తత, మనుషుల పట్ల అవ్యాజమైన ప్రేమాసక్తులు, ఇవన్నీ ఆమెకొక ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి.
1952లోనే ప్రతిష్ఠాత్మకంగా వెలువడిన ‘కవిత’ అనే పత్రికకు సంపాదకురాలుగా ఉన్నారు. ఆ దశాబ్దంలోనే వెలువడిన మోడర్న్ తెలుగు పొయిట్రీ సంకలనానికీ సంపాదకులుగా ఉన్నారు. పిల్లల కోసం ప్రపంచ దేశాల కథలు అనువాదం చేసి ప్రచురించారు.
.
ప్రముఖ రచయిత, విమర్వకుడు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వరరావు తో ఛాయాదేవి వివాహం జరిగింది.
ఆమె రాసిన ‘తన మార్గం’ కథా సంపుటికి 2005 లో
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అలాగే 2003లో వాసిరెడ్డి రంగనాయకమ్మ ప్రతిభా పురస్కారాన్ని ఆమె అందుకున్నారు.
ఆడపిల్లల పెంపకంలోను, మగపిల్లల పెంపకంలోను వివక్ష చూపిస్తూ ఆడవాళ్ళ బ్రతుకుల్ని బోన్ సాయ్ చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ బోన్ సాయ్ బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది.
ఆమె బోన్సాయ్ బతుకులు కర్ణాటకలో కూడా పాఠ్యాంశంగా పిల్లలు చదువుకున్నారు.సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథాభారతి అనే సంకలనంలో 1972లో ప్రచురించబడింది.
1993లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, 1996లో మృత్యుంజయ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నారు. 2000 సంవత్సరంలో కళాసాగర్ పందిరి సాహితీ పురస్కారాలు అందుకున్నారు.
ఆమె సి ఆర్ ఫౌండేషన్ లో 2012లోచేరింది.
పనికిరానివని పడేసిన వస్తువులను మంచి మంచి బొమ్మలుగా మలచగల కళాకారిణి. సి ఆర్ ఫౌండేషన్ లో మహిళా కేంద్రానికి వచ్చేవారికి బొమ్మలు చేయటం నేర్పారు. ఇదంతా ఈ చివరి ఆరేడేళ్ళలో చేశారు. 2019జూన్28 న మరణించారు.
అబ్బూరి ఛాయాదేవి తో నాగలక్ష్మి దామరాజు
ప్రముఖ తెలుగు కథా రచయిత్రి, స్త్రీవాద రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి గారితో నాగలక్ష్మి దామరాజు కొన్ని మధుర జ్ఞాపకాలు ఇవి:
సి ఆర్ ఫౌండేషన్ కి వెళ్ళి ఛాయాదేవి గారితో కలిసి భోజనం చేసి, సాయంత్రం వరకు గడపడం గొప్ప అనుభూతిని ఇచ్చింది.
ఆవిడ రచయిత్రి మాత్రమే కాదు గొప్ప చిత్రకారిణి – ఎందుకూ పనికిరాని వస్తువులు ఆవిడ చేతిలో అందమైన రూపుదిద్దుకున్నాయి. వీటిలో “చాట భారతం” మనని అబ్బురపరుస్తుంది. స్వీట్ బాక్స్ లు, చాటలు, రాళ్ళు, చీరలతో వచ్చిన అట్టపెట్టెలు – ఇలా ఎన్నెన్నో. ఇప్పటికీ ఆ కళాఖండాలలో ఆవిడ నవ్వు ముఖం కనిపిస్తుంది.
ఆప్యాయత, ఎవరితోనైనా ప్రేమగా పలకరించడం ఆవిడలో ఉన్న గొప్పతనం.
చాలాసార్లు ఫోన్ లో మాట్లాడడమే కానీ ఆవిడని చూడడం తటస్థించలేదు. పుస్తక ప్రియులు కీ.శే. చంద్రమౌళిగారు ఛాయాదేవిగారి మృత్యుంజయ పుస్తకం తిరిగి ముద్రించ దలచి, “నన్ను నువ్వు కలవలేదన్నావుగా నడు” అని సి.ఆర్. ఫౌండేషన్ కి తీసుకెళ్ళారు. ఆవిడకి ప్రూఫ్ ఇచ్చి కాసేపు అక్కడ గడిపి తిరిగి వస్తుండగా –
ఆవిడ నన్ను వెనక్కి పిలిచి “మళ్ళీ ఇంకొక రోజు నువ్వు, మీ వారు రండి. కలిసి భోజనం చేద్దాం. సాయంత్రం వరకు గడుపుదాం” అన్నారు. ఆవిడ అలా ఆప్యాయంగా పిలవడం నాకు ఆనందంగా అనిపించింది.
నరిసెట్టి ఇన్నయ్యగారి శ్రీమతి వెనిగళ్ళ కోమలగారి ఆటోబయోగ్రఫీ పుస్తకం ఇవ్వడానికి మరోసారి వెళ్ళాం. ఛాయాదేవిగారితో కలిసి భోజనం చేశాం.
ఆవిడ తన రూముకి తీసుకెళ్ళి అక్కడ ఆవిడ చిత్రించిన చిత్రాలు, చేసి కళాఖండాలు చూపించి మమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేశారు.
ఛాయాదేవిగారి సోదరి పాటలు బాగా పాడతారని చెప్పారు. ఆవిడ మాకు చక్కటి పాటలు వినిపించారు. మా చేత కూడా పాడించారు. సిఆర్ ఫౌండేషన్ అంతా తిప్పి చూపించారు. అక్కడ కొంతమంది పెద్దలు, గొప్పవారిని పరిచయం చేశారు.
వచ్చేటప్పుడు మాకు –
“1943-2011 దాకా ఛాయా చిత్ర కథనం – రాజమండ్రి నుంచి రాజమండ్రి దాకా” పుస్తకాన్ని ఇచ్చారు. అందులో ఆవిడ జీవితంలో ప్రతి విషయం కూలంకషంగా వుంది.ఇదొక మరపురాని మధురస్మృతిగా నాగలక్ష్మి దామరాజు పేర్కొన్నారు.
(చందమూరి నరసింహారెడ్డి సీనియర్ జర్నలిస్టు, ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత)