తెలుగు సహా హిందీలోనూ వీక్షకాదరణ, ప్రశంసలు అందుకుంటున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘ఎక్స్పైరీ డేట్’. జీ 5లో ఎక్స్ క్లూజివ్ గా విడుదలైన సిరీస్‌కి దర్శకత్వం వహించినది తెలుగు దర్శకుడు శంకర్ కె. మార్తాండ్ కావడం విశేషం. స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన దీనిని నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. నిర్మించింది. శరత్ మరార్ నిర్మాత. అక్టోబర్ 2న హిందీ వెర్షన్, అక్టోబర్ 9న తెలుగు వెర్షన్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ సందర్భంగా శంకర్ కె. మార్తాండ్ మీడియాతో ముచ్చటించారు.
– కంగ్రాట్స్ శంకర్ కె. మార్తాండ్‌గారు… ‘ఎక్స్పైరీ డేట్’కి వీక్షకుల స్పందన బావుంది!
థాంక్యూ. తెలుగులో చక్కటి వీక్షకాదరణ లభిస్తోంది. రివ్యూల్లో బావుందని రాశారు. హిందీలోనూ స్పందన బావుంది. హిందుస్తాన్ టైమ్స్ వంటి పత్రికలు వెబ్ సిరీస్ గురించి గొప్పగా రాశాయి. ఈ విజయం నాకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది.
– మీరు వెబ్ సిరీస్ ప్రారంభించే సమయానికి తెలుగులో వెబ్ సిరీస్‌లు తీస్తున్నవాళ్ల సంఖ్య తక్కువ. అసలు, ఈ ప్రాజెక్ట్ ఎలా ప్రారంభమైంది?
తెలుగులో తక్కువే. కానీ, ఇంగ్లిష్‌లో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వంటి భారీ సిరీస్‌లు వచ్చాయి. హిందీలోనూ కొన్ని వచ్చాయి. మనం కొన్ని కొన్ని చూసి అటువంటిది చేస్తే బావుంటుందని అనుకుంటాం. ఆ సమయంలో ఓ నిర్మాత వెబ్ సిరీస్ తీయాలనుకుంటున్నారని తెలిసినవాళ్లు చెప్పారు. నా దగ్గర ఉన్న కథల్లో ఓ కథ చెప్పాను. నాకు థ్రిల్లర్స్, ఫాంటసీ చిత్రాలు అంటే ఇష్టం. ప్రేక్షకులు బయట ప్రపంచం మర్చిపోయేలా వాళ్ళకు థ్రిల్ ఇవ్వడం ఇష్టం. థ్రిల్లర్ కథ చెప్పగానే ఆ నిర్మాతలు నచ్చిందన్నారు. అయితే, చేయడం కుదరలేదు. తర్వాత నిర్మాత శరత్ మరార్గారి దగ్గరకు వెళ్లాను. ఈ ‘ఎక్స్పైరీ డేట్’ కథ చెప్పగానే చేద్దామన్నారు. ‘జీ 5’ సౌతిండియన్ క్రియేటివ్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయలగారు ఎంతో ప్రోత్సహించారు.
– తెలుగు, హిందీ భాషల్లో బైలింగ్వల్ సిరీస్‌గా చేయాలనే ఐడియా ఎవరిది?
మొదట మేము తెలుగులో చేద్దామనుకున్నాం. ‘జీ 5’ హెడ్ అపర్ణాగారు కథ విని హిందీలోనూ చేస్తే బావుంటుందన్నారు. అప్పుడు బైలింగ్వల్ సిరీస్‌గా చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సందర్భంగా ఆమెకు థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. అలాగే, గత ఏడాదిగా నన్ను ఎంతో ప్రోత్సహించి, ఈ సిరీస్ చేయడానికి కారణమైన శరత్ మరార్‌గారికి, ప్రసాద్‌గారితో పాటు నాతో సిరీస్‌కి పని చేసిన సినిమాటోగ్రాఫర్ సురేశ్, కో డైరెక్టర్ శ్రవణ్, ఇంకా టీమ్‌కి థ్యాంక్స్.
– ‘ఎక్స్పైరీ డేట్’లో ట్విస్ట్‌లు ఎక్కువ ఉన్నాయి. స్ర్కీన్‌ప్లేకి మంచి అప్లాజ్ వస్తుంది.
థాంక్యూ. ట్విస్ట్‌లు రాసుకోవడం ఈజీ. కానీ, క్లైమాక్స్‌లో ఎండింగ్ రాసుకోవడం కష్టం. ‘జీ 5’ ప్రసాద్ నిమ్మకాయలగారు కథ విని ‘మంచి ఎండింగ్ ఇచ్చావ్. స్ర్కీన్ ప్లే బావుంది’ అన్నారు. వీక్షకులు నుంచీ అటువంటి ప్రశంసలు రావడం సంతోషంగా ఉంది.
– బైలింగ్వల్ సిరీస్ కాబట్టి బాలీవుడ్ యాక్టర్లు టోనీ లూక్, స్నేహా ఉల్లాల్, హిందీలో చిత్రాలు చేసిన మధు షాలినీని తీసుకున్నారా?
ఓటీటీ వేదికలు మనం పని చేసేటప్పుడు నటీనటులు ఎవరెవరిని తీసుకుంటున్నామనేది ముందుగా చెప్పాలి. ‘ఎక్స్పైరీ డేట్’లో టోనీ లూక్ చేసిన పాత్రకు ఎవరైతే బావుంటారని డిస్కషన్లు జరుగుతున్నాయి. సరిగ్గా అదే రోజున ఓటీటీలో ‘బద్లా’ విడుదలైంది. నేనది చూశా. టోనీ లూక్ బావుంటాడని అనిపించింది. రెండు రోజు శరత్ మరార్గారి చెప్పా. ఆయన కూడా ‘బద్లా’ చూశాననీ, టోనీ లూక్ బావుంటాడని అనిపించిందనీ చెప్పారు. అతడిని ఫైనలైజ్ చేశాం. స్నేహా ఉల్లాల్ వెబ్ సిరీస్‌లు చేయడానికి ఆసక్తిగా ఉన్నారని మాకు తెలిసింది. ఆమెకు కథ చెప్పగా ఓకే అన్నారు. కథ అనుకున్నప్పుడు మధు షాలినీని ఎంపిక చేశాం. ‘జీ 5’ వాళ్లు కూడా మేం ఎంపిక చేసిన నటీనటులను ఓకే చేశారు.
(నవ్వుతూ) నా బ్యాడ్ టైమ్ కి ఎక్స్పైరీ అయిందని అనుకోవచ్చు. ఈ విజయం నాకు చాలా ప్రత్యేకం.
– దర్శకుడిగా సినిమాకి, వెబ్ సిరీస్‌కి మీరు గమనించిన వ్యత్యాసం?
సినిమాను రెండు, రెండున్నర గంటల్లో చెప్పాలి. వెబ్ సిరీస్ అయితే టైమ్ లిమిట్ ఉండదు. ఓ సన్నివేశాన్ని రెండు నిమిషాలు లేదా ఇంత టైమ్ ఫ్రైమ్‌లో తీయాలనే నిబంధన ఉండదు. క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది. అయితే, వెబ్ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ ఎండింగ్‌లోనూ ట్విస్ట్ ఇవ్వాలి. అది ఛాలెంజింగ్ పార్ట్.
– మీ నెక్ట్స్ ప్రాజెక్ట్ వెబ్ సిరీస్ అనుకోవచ్చా? సినిమా తీస్తున్నారా?
ప్రస్తుతానికి చెప్పలేను. ‘ఎక్స్పైరీ డేట్’కి ప్రశంసలు వస్తుండటంతో వెబ్ సిరీస్ అవకాశాలు వస్తున్నాయి. శరత్ మరార్గారితో, ‘జీ 5’తో డిస్కషన్లు జరుగుతున్నాయి. ఇతర ఓటీటీ వేదికల నుంచీ అడుగుతున్నారు. అలాగే, సినిమా సినిమాయే. నాకు సినిమా కూడా తీయాలని ఉంది. ఏది ముందు పట్టాలు ఎక్కుతుందో చూడాలి. ప్రస్తుతం ఓ వారం నుంచి కుటుంబంతో సరదాగా సమయం గడుపుతున్నా. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నా.