(చందమూరి నరసింహా రెడ్డి)
‘ఆంధ్ర ప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టం ‘ పై నేడు జాతీయ చర్చ నడుస్తోంది.ఇక్కడ అనుసరిస్తున్న’ఎడ్యుకేషన్ సిస్టం’ దేశమంతా ప్రవేశ పెట్టడం సాధ్యం అవుతుందా అన్న చర్చ మొదలైంది.
జాతీయ మీడియా ఈ మధ్య ‘ఆంధ్ర ప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టం ‘ గురించి వార్తలు ఇస్తోంది. అమ్మ ఒడి ,గోరు ముద్ద,జగనన్న విద్యాకానుక , నాడు -నేడు కార్యక్రమాల గురించి చక్కగా వివరిస్తోంది . ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు రావాల్సి ఉంది.
అత్యంత సుందరంగా కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నేలా ప్రభుత్వ విద్యా సంస్థలను నాడు నేడు పథకంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దు తున్నారు. రంగురంగుల సొగసులద్దు కొన్న విద్యాలయాల్లో వర్ణమాలను విద్యార్థులకు వివరించి నీతిని బోధించే పాఠ్యాంశాలను వారి మనసులో చొప్పించాలి. నీతి కథలను బోధించి విద్యను విజ్ఞానాన్ని అందించి బాధ్యత కల బాలబాలికలుగా ఉత్తములుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై నేడు పెరిగింది.
గత 30 సంవత్సరాల నుండి విద్యావ్యవస్థ రోజురోజుకు క్షీణించి సరైన వసతులు లేకుండా పాడుబడిపోయాయి. నాడు నేడు కార్యక్రమం తో పాఠశాలల్లో మౌలిక వసతులు నేడు రూపు దిద్దుకుంటున్నాయి. ఇది విద్యావ్యవస్థలో వినూత్న మార్పు.
ఇప్పటిదాకా సరైన వసతులు లేవు అని చెబుతున్న ఉపాధ్యాయులకు ఇప్పుడు అలా చెప్పే అవకాశం లేదు .ఇప్పటి నుండి విద్యార్థులకు సరైన విద్యాబోధన చేసి భావితరాల లో మంచి ఉన్నతులుగా తీర్చిదిద్దవచ్చు. మంచి ఫలితాలు సాధించవచ్చు. ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే.
ప్రైవేటు విద్యా సంస్థలలో అర్హత మేరకు ఉపాధ్యాయులు లేనప్పటికీ,అరకొర జీతాలు ఇస్తున్నప్పటికి ఫలితాల సాధనలో ఇప్పటివరకు ప్రైవేటు యాజమాన్య పాఠశాలలే ముందున్నాయి. అన్నిరకాల అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నా ఎందుకు ఫలితాలు రావడం లేదన్నది సమీక్ష చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇవాళ జగనన్న “విద్యాకానుక” ద్వార విద్యార్థులకు ఇచ్చిన స్టూడెంట్ కిట్లో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్ టెస్ట్ బుక్స్, నోటు బుక్స్, వర్క్ బుక్స్, ఒక స్కూల్ బ్యాగ్ ఉన్నాయి.
‘నాడు- నేడు’ కార్యక్రమం ద్వారా 45వేల పాఠశాలల స్థితి గతులను మార్చి నూతన శోభ ను చేకూర్చడం కోసం 11500 కోట్ల రూపాయల ప్రణాళికలు రూపొందించారు. మొదటి విడతలో 15715 పాఠశాలలకు 3500కోట్లరూపాయలతో ఊపిరి పోసింది. కొత్త ఉషస్సును ఆవిష్కరించింది .
పెచ్చులు ఊడి ఎప్పుడు పడిపోతాయోతెలియని భవనాలు,చెదలు పట్టి ఊగుతున్న కిటికీలు, తలుపులు నెరెలుబారిన గోడలు ఇది ఒకనాడు మన ఊరి బడి దృశ్యం . నేడు దాని స్వరూపం మారిపోయింది .కార్పొరేట్ కార్యాలయాల తలదన్నేలా తయారయ్యాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంగ్లీష్ మీడియం’ ఒక స్వప్న సాకారం. ‘అమ్మ ఒడి’ ద్వారా ప్రతి సంవత్సరం పాఠశాలలకు పిల్లలను పంపే తల్లి అకౌంట్ లో 15 వేలు జమ చేయడం జరుగుతోంది.
‘గోరుముద్ద’ ప్రోగ్రాం లో భాగంగా పిల్లలకు వారానికి మూడు రోజులు ‘చిక్కీలు’ ఇవ్వడం, శనివారం నాడు ‘స్వీట్ ‘ పెట్టడం. 43లక్షల మంది పిల్లలకు దుస్తులకు కుట్టు కూలీ తల్లి అకౌంట్ లోకి జమ చేయడం నూతన పాఠ్య పుస్తకాల్లో పిల్లల సృజనాత్మకత కు అవకాశం కల్గించడంలాంటి విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
పిల్లల ఆత్మీయ ‘ మేనమామ’ ఒక నమ్మకం, భరోసా, పిల్లల నేస్తం ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి కలలను సాకారం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే.
విజయవంతంగా విద్యా వ్యవస్థను ముందుకు నడిపించాలి. ఈ రోజు చదువు పైన పెట్టిన ఖర్చుకు భవిష్యత్తులో మంచి ఫలితాలు రావాలని అందరూ ఆశించడం లో తప్పు లేదు.
విద్య పైవేట్ వ్యక్తుల కబంద హస్తాల డబ్బు కౌగిలిలో బందీగా మారిపోయి దుడ్డున్న బడాబాబులనే ముద్దాడుతోంది. ఈ పైవేట్ కబంధ హస్తాలసంకెళ్ళను తెంచి చదువులతల్లి ప్రతిఒకరిని అక్కున చేర్చుకొనేలా చూడాల్సిన భాద్యత గురువులదే.
పాఠశాలలో ఉన్నతవరకు బయట సమస్యలు, కష్టసుఖాలు, ఇతరత్రా వ్యాపకాలు మరచిపోయి, క్రమశిక్షణతో విద్యా దానం చేయాలని పాఠశాల సమయం తర్వాత మీ సమయం మీరు ఎలా వినియోగించుకొంటారన్నది మీ విచక్షణ.
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి నప్పుడు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలి. ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించేలా చేయా ల్సిన అవసరం ఉంది .అందుకోసం ప్రభుత్వం అందజేసే అమ్మ వడి కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలల కే వర్తింపచేయాలి. ఈ పథకం ప్రైవేటు పాఠశాలలకు రద్దు చేయాల్సిన అవసరం ఉంది.
(చందమూరి నరసింహారెడ్డి,సీనియర్ జర్నలిస్టు, ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత)