మంత్రి జయరాం ఆస్తుల మీద చంద్రబాబు ‘నిజ నిర్ధారణ’ కమిటి

కర్నూలు జిల్లాకు చెందిన  వైసిపి మంత్రి గుమ్మనూరు జయరాం భూముల అక్రమ కొనుగోలుపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు ఒక క్షేత్రస్థాయి పరిశీలన కమిటీ ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ శుక్రవారం ఉదయం 11.00 గంటలకు కర్నూలు జిల్లాలో విస్తృతంగా పర్యటించి వాస్తవాలు తెలుసుకుని నివేదిక రూపొందించి ఇవ్వడం జరుగుతుంది.
ఈ మేరకు టిడిపి ఎంపి అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఒక మంత్రి అక్రమాల మీద, ఆరోపణల మీద,  ప్రతిపక్ష పార్టీ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుచేయడం దేశంలో ఇదే ప్రథమం కావచ్చు. అధికారంలో ఉన్న మంత్రి అక్రమ ట్రాన్సాక్షన్ల మీద జరిగే టిడిపి జరిపే  విచారణ ఎంత వరకు విజయవంతమవుతుందో చూడాలి. ఎందుకంటే, సాక్ష్యం చెప్పేందుకు సాక్షులు జంకవచ్చు. మొత్తానికి ఈ చర్యతో టిడిపి ఒక కొత్త ట్రెండ్ మొదలుపెట్టింది.  ముందు ముందు మరిన్ని కమిటీలను నియమించి,  నివేదికలు తెప్పించి ప్రజలముందు ఉంచునున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు :
1. బి.టెక్. రవి, ఎమ్మెల్యీ
2. బి.టి. నాయుడు, ఎమ్మెల్సీ
3. ప్రభాకర్ చౌదరి, మాజీ ఎమ్మెల్యే
4. కె. ఈరన్న, మాజీ ఎమ్మెల్యే
 కళా వెంకట్రావ్  ప్రకటనలోని ముఖ్యాంశాలు:
భూములను కబ్జా చేయడంలో వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీపడి రాష్ట్రాన్ని ‘కబ్జాంధ్రప్రదేశ్’ గా మార్చారు.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు భూములకు రక్షణ లేకుండా పోయింది. వైకాపా నేతల అరాచకాలకు భయపడి పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి భయపడుతున్నారు.
భూములు కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. కర్నూరు జిల్లా ఆస్పరి మండలం ఆస్పరి గ్రామంలో 204 ఎకరాల భూమి కోసం కంపెనీ యాజమాన్యాన్ని, అధికారులను బెదిరించి మంత్రి గుమ్మనూరు జయరాం అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు.

 

దొంగ సర్టిఫికెట్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లు, షెల్ కంపెనీలతో జగన్మోహన్ రెడ్డి కోట్లు కొల్లగొట్టిన విధంగా వైసీపీ నాయకులు దొంగ పత్రాలు, తీర్మానాలు సృష్టించి భూములు కొల్లగొడుతున్నారు.
పట్టాదారు పాస్ పుస్తకాలను ట్యాంపర్ చేశారు. ఇటికా కంపెనీ పేరుతో ఉండాల్సిన భూముల పట్టాలు ఒక వ్యక్తి పేరుతో ఉండడమే మంత్రి అక్రమాలకు ప్రత్యక్ష సాక్ష్యం.
నిబంధనల ప్రకారం ఏదైనా కంపెనీకి సంబంధించిన భూములు అమ్మాలంటే తప్పనిసరిగా డైరెక్టర్ల తీర్మానం ఉండాలి. కానీ ఎటువంటి పత్రాలు లేకుండా భూ లావాదేవీలు జరగడం మంత్రి తన అధికారాలను ఎంతగా దుర్వినియోగం చేశారో అర్ధమవుతోంది.
‘నాకు ఎటువంటి వ్యాపారాలు లేవు. ఎమ్మెల్యేకు వచ్చే జీతమే ప్రధాన ఆదాయ వనరు’ అని చెప్పి 2019 ఎన్నికల అఫిడవిట్ లో తన ఆదాయం రూ.8 లక్షలు చూపించిన మంత్రి గుమ్మనూరు జయరాం,  అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పది నెలల్లోనే 204 ఎకరాలు కొనుగోలు చేయడానికి సరిపడా డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి?
రూ.2 లక్షలకు మించి జరిగే ఏ లావాదేవీ అయినా.. తప్పనిసరిగా బ్యాంకు ద్వారానే జరగాలి. కానీ రూ.1.60 కోట్లు చెల్లించి స్థిరాస్థులు కొనుగోలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఆ లావాదేవీ మొత్తం నగదుతోనే నిర్వహించారు. అదంతా బ్లాక్ మనీ కాదా? 2019 లో మంత్రి కుటుంబ సభ్యులకు 8 ఎకరాలు ఉంటే 14 నెలల్లో 204 ఎకరాలు కొనడానికి డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో సమాధానం చెప్పాలి.
అవినీతికి అసలు పేరు, భూ కబ్జాలు తన ఇంటిపేరుగా వ్యవహరిస్తున్న మంత్రి జయరాం వ్యవహారాన్ని నిగ్గుతేల్చడమే ధ్యేయంగా ఈ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.