సినిమాల్లో ఆయన ప్రతినాయకుడు నిజ జీవితంలో ఆయన ఓ హీరో. త్యాగశీలి ,సహృదయుడు, సున్నిత మనస్కుడు. సినీ కార్మికుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన మహోన్నతుడు ఆయన. సినీ కార్మికుల గృహ నిర్మాణాల కోసం తాను దానం చేసిన పది ఎకరాల స్థలం నేడు ఐదు వందల కోట్ల రూపాయల పై మాటే. ఆయనెవరో కాదు డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి (1935-1997).
మందాడి ప్రభాకరరెడ్డి సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి లో 1935 అక్టోబర్ 8 న జన్మించాడు. తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి కౌసల్య . తుంగతుర్తిలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత హైదరాబాదులోని సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. 1955 నుండి1960 వరకు ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్యవిద్యను అభ్యసించాడు. హైదరాబాద్ లో డాక్టర్ గా సేవలందించేవారు.
మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్నపుడు ఆయన ఇంటర్-కాలేజ్ నాటక పోటీలలో దర్శకుడు గుత్తా రామినీడు ఆయన నటన చూసి మెచ్చుకున్నారు. 1960లో ఆయనే దర్శకత్వం వహించిన చివరకు మిగిలేది సినిమాలో అవకాశం కల్పించారు.అలా ప్రభాకర్ రెడ్డి డాక్టర్ కోర్సు చదువుతూనే చిత్రరంగ ప్రవేశం చేశాడు.
ఆ సినిమాలో ఒక మానసిక వైద్యుని పాత్ర పోషించాడు. కాంగ్రెస్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి మిత్రులతో కలిసి నిర్మించాడు. ఇది నటుడు ప్రభాకర రెడ్డి తొలి చిత్రం. ఈ చిత్రం అషుతోష్ ముఖర్జీ బెంగాలీ కథ “నర్స్ మిత్ర” ఆధారంగా తీశారు
ప్రభాకర్ రెడ్డి సినిమాలలో ప్రతినాయకుని పాత్రలు ఎక్కువగా పోషించేవారు .వీరు సుమారు 472 పైచిలుకు చిత్రాలలో నటించారు. ఈయన నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేశారు. ఆయన వామపక్ష భాావాలున్న వాడు.చనిపోవడానికి ఒక ఏడాది ముంద ఆయన ‘కామ్రేడ్ ’ చిత్రానికి స్క్రిప్టు కూడా తయారు చేశారు.
మంచి విజయాలను సాధించిన పండంటి కాపురం, పచ్చని సంసారం, ధర్మాత్ముడు, గృహప్రవేశం, గాంధీ పుట్టిన దేశం, కార్తీకదీపం, నాకు స్వతంత్రం వచ్చింది వంటి సినిమాలతో పాటు మొత్తం 21 తెలుగు సినిమాలకు కథలను అందించాడు.
గూడులేని కార్మికులను చూసి చలించిపోయారు. ఓ సాత్విక ఉద్యమానికి నడుం గట్టాడు. తన 10 ఎకరాల స్థలం దానంచేశారు. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి హయాంలో కార్మిక శాఖా మంత్రి కన్నా లక్ష్మీ నారాయణను ఒప్పించి అప్పటి ప్రభుత్వం నుంచి 67 ఎకరాల పైచిలుకు స్థలాన్ని కేటాయించేలా చేశారు.
ఇలా 77 ఎకరాలు సేకరించారు. గుమ్మడి వెంకటేశ్వర రావులాంటి ఆదర్శనీయ నటులను సభ్యులుగా చేసుకుని కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సమాఖ్యలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ కృషి ఫలితమే ప్రస్తుత చిత్రపురి కాలనీ. మందాడి దానం చేసిన ఆస్తి ప్రస్తుత విలువ 500 కోట్లురూపాయలు పైమాటే.
ఆయన సినిమాల్లో విలన్. కానీ, నిజ జీవితంలో హీరో. ప్రభాకర్ రెడ్డి తన భూమిని సినీ కార్మికులకు ఇళ్ల స్థలాల కోసం దానం చేశారు.
ఇప్పుడు ఈ స్థలంలోనే చిత్రపురం కాలనీ ఏర్పడింది. సినిమాలనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న సినీ కార్మికులకు గూడు ఇవ్వాలనే ఆలోచనతో ఆయన చలవ వల్లే ఇప్పుడు సినీ కార్మికులంతా స్వంతింట్లో ఉంటున్నారు.
చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి హీరోలతో పాటు సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిన చాలా మంది హైదరాబాద్‌లో స్థలాలు కొనుగోలు చేశారు. ప్రభాకర్ రెడ్డి కూడా వారితో పాటు గచ్చిబౌలి సమీపంలో పదెకరాల స్థలం కొన్నారు. ఆ స్థలమే దానంచేశారు.
మద్రాస్‌లో ఉన్నప్పుడు కూడా ఆయన సినీ కార్మికులను బాగా చూసుకునే వారు. ఎందరికో తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చేవారు. పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చాక ఆయన సినీ కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సమాఖ్యను ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా పని చేశారు. సినీ కార్మికులకు ఒక స్వంతిల్లు ఉంటే బాగుంటుందని అనుకున్నారు. ఇందుకు గానూ తానే ఒకడుగు ముందుకేసి తన 10 ఎకరాల భూమిని సినీ కార్మికుల ఇళ్ల స్థలాలకు కేటాయించారు. ప్రభుత్వాన్ని ఒప్పించి మరికొంత భూమి ఇప్పించారు. ఇలా సినీ కార్మికుల కోసమే చిత్రపురి కాలనీ ఏర్పాటైంది. ప్రభాకర్ రెడ్డి చొరవ వల్ల చిత్రపురి కాలనీలో ఇళ్ల స్థలాలు పొందిన సినీ కార్మికులంతా చిన్న చిన్న ఇళ్లను నిర్మించుకొన్నారు. సినీ కార్మికులు ప్రభాకర్ రెడ్డిని ఎప్పటికీ మరిచిపోరు. అందుకే, ఆయనకు గుర్తుగా కాలనీకి డాక్టర్ ఎం.ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీగా పేరు పెట్టుకున్నారు.
జయప్రదకు ఆ పేరు పెట్టింది ఎవరో తెలుసా? సినిమాలలో తొలి అవకాశం కల్పించింది కూడా ఆయనే.
ఏపీలోని రాజమండ్రిలో 1962, ఏప్రిల్ 3న జన్మించిన జయప్రద అసలు పేరు లలితా రాణి. సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి ఈమెకు జయప్రద అని నామకరణము చేసి 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు నిడివిగల ఒక పాట ద్వారా ఈమెను చిత్రసీమకు పరిచయం చేశాడు. ‘భూమి కోసం’ సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో మూడు నిమిషాలపాటు ఉండే నృత్యం చేశారు. ఇందుకు ప్రతిఫలంగా జయప్రద 10 రూపాయలు తీసుకున్నారు.
అలా మొదలైన ఈమె సినీ ప్రస్థానం 2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ,బెంగాలి) 300కు పైగా సినిమాలలో నటించింది.
1976లో ‘అంతులేని కథ’ చిత్రంతో ఆమెకు స్టార్ ఇమేజ్ పెరిగింది. ఆ తర్వాత వచ్చిన ‘సిరిసిరిమువ్వ’, ‘సీతాకల్యాణం’ తదితర చిత్రాలతో ప్రేక్షకులను అమితంగా అలరించారు. 1979లో జయప్రద బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటారు.
ప్రభాకర్ రెడ్డి నటుడిగా అనేక సార్లు నంది బహుమతి అందుకున్నారు. 1980 లో యువతరం కదిలింది చిత్రం లోని నటనకు ఉత్తమ నటుడుగా నందిఅవార్డు అందుకొన్నారు.
1981 లో పల్లె పిలిచింది చిత్రం లోని నటనకు ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకున్నారు.
1990లో చిన్నకోడలు సినిమాలో ఉత్తమసహాయ నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. ఉత్తమ కథారచయితగా గృహప్రవేశం, గాంధీ పుట్టిన దేశం సినిమాలకు నంది పురస్కారాలను అందుకున్నాడు.
ప్రభాకరరెడ్డి 1997, నవంబరు 26 తేదీన హైదరాబాదులో మరణించాడు
(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత)