(CS Saleem Basha)
భారత దేశంలో క్రికెట్ అనేది ఆట ఒకటే కాదు. అది ఒక మతం. క్రికెట్ ను ఆరాధించేవారు, పూజించేవారు కోకొల్లలు. క్రికెట్ ఆట జరుగుతున్నంతసేపు ప్రేక్షకులు కూడా ఆటగాళ్ల లాగే టెన్షన్ పడుతుంటారు. గెలిస్తే ఆనందిస్తారు ఓడిపోతే ఏడుస్తారు. ఒక రకంగా చెప్పాలంటే క్రికెట్ మన జీవితంలో భాగం. మరీ ముఖ్యంగా ఐపీఎల్ లాంటి మ్యాచ్ అయితే ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవు.
అయితే క్రికెట్ నుండి మనం వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలు లేదా నైపుణ్యాలు (skills) ఎన్నో నేర్చుకోవచ్చు అన్నది మీకు తెలుసా? ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
నిజానికి ఆటల ద్వారా, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు (Communication skills) . టీం వర్క్, లక్ష్య సాధన(Goal Management), ఉద్వేగ ప్రజ్ఞ (Emotional intelligence), నాయకత్వ లక్షణాలు, వంటి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. క్రికెట్ ఇప్పుడు చాలా ప్రసిద్ధి చెందిన ఆట కనుక క్రికెట్ ద్వారా కూడా యువత పనికి వచ్చే అనేక నైపుణ్యాలను ఎలా పెంపొందించుకోవచ్చు చూద్దాం
వ్యక్తిత్వ వికాసం అనేది ప్రతి మనిషికి ఎంతో అవసరం. సరళ భాషలో చెప్పాలంటే వ్యక్తిత్వ వికాసం అంటే వ్యక్తి యొక్క ప్రవర్తన, నడవడిక, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం.
ఇలాంటి అంశాలు వ్యక్తి జీవితానికి ఎంతో అవసరం. ప్రతి వ్యక్తి ఎక్కడో ఒక దగ్గర ఈ అంశాలు నేర్చుకుంటాడు. కళాశాలల్లో “సాఫ్ట్ స్కిల్స్” పేరుతో వీటిని ప్రత్యేకంగా నేర్పిస్తున్నారు. ఒకప్పుడు ఇవి లేవు. అవి చదువులో భాగమై ఉండేవి. అది వ్యక్తుల నుంచి కావచ్చు,ఆటల నుంచి కావచ్చు.
మనం సాధారణంగా వినేది నేను ఈ విషయము ఫలానా వ్యక్తి నుంచి నేను నేర్చుకున్నాను లేకపోతే ఈ వ్యక్తిని చూసి నేను స్ఫూర్తి చెందాను అని చెబుతుంటారు. అయితే మనం ఆడే చాలా ఆటల నుంచి కూడా నేర్చుకోవచ్చు.
కమ్యూనికేషన్ స్కిల్స్. ఇవి మనిషికి ఎంతో అవసరం. క్రికెట్ లో కమ్యూనికేషన్ ఒకటే కాదు ప్రభావవంతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మదర్ తెరిసా చెప్పినట్టు” లైఫ్ అనేది ఒక ఆట, ఆడండి”. ఆ విధంగా చూస్తే లైఫ్ లో ఏ విధమైన స్కిల్స్ ఉండాలో, ఆటలో కూడా అవే ఉండాలి.
ఆటలు మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ రెండు మనిషి జీవితంలో విడదీయరాని అంశాలు. క్రికెట్ కమ్యూనికేషన్ లో చాలా అంశాలు మనకు కనిపిస్తాయి. ఇద్దరు బ్యాట్స్ మెన్ మధ్య కమ్యూనికేషన్ చాలా అవసరం. పరుగులు తీసేటప్పుడు కానీ, తర్వాత ఏం చేయాలి అని మాట్లాడుకోవాల్సిన సమయంలో గానీ కమ్యూనికేషన్ ఎంతో అవసరం.
అలాగే ఫీల్డర్లు మధ్య కూడా కమ్యూనికేషన్ చాలా అవసరం. క్యాచ్ పట్టే విషయంలో ఇవి చాలా అవసరం. ధోని ని కమ్యూనికేషన్ గురువు అని పిలుస్తూ ఉంటారు. భావవ్యక్తీకరణ వల్లనే అతను ఒక మంచి కెప్టెన్ గా మరియు ఒక గా గుర్తింపు పొందాడు.
క్రికెట్ లో కమ్యూనికేషన్ అనేది నిరంతరం కొనసాగుతుంది. అది బ్యాట్స్ మెన్ ల మధ్య కావచ్చు, లేదా ఫీల్దర్స్ మధ్య కావచ్చు. క్రికెట్ ఆట లో కమ్యూనికేషన్ చాలా సూటిగా సుత్తి లేకుండా ఉండాలి. క్రికెట్ లో ఆన్ ది ఫీల్డ్ కమ్యూనికేషన్ చాలా అవసరం.ముఖ్యంగా బౌలర్ కు, కెప్టెన్ కు మధ్య సంభాషణ Two way కమ్యూనికేషన్ లాగ ఉండాలి. అంటే పరస్పరం ఇద్దరు మాట్లాడుకోవాలి. ఫీల్డ్ సెట్ చేయడం, ఏ ప్లేయర్ కు ఎక్కడ బంతి వేయాలి లాంటివి చర్చించుకోవడం అవసరం.
మరో ముఖ్యమైన విషయం ప్లేయర్స్ కెప్టెన్ తో ఐ కాంటాక్ట్ మెయింటెయిన్ చేయాలి. కెప్టెన్ కు సహకారం అందించేది వికెట్ కీపరే. ఫీల్డ్ లో మార్పులు చేయడం, అలాగే బౌలింగ్లో జరగాల్సిన మార్పులు సూచించేది కూడా వికెట్- కీపరే.
తర్వాత ముఖ్యమైనది బ్యాటింగ్ కమ్యూనికేషన్. ఇది రెండు రకాలుగా ఉండాలి. ఇద్దరు బ్యాట్స్ మెన్ ల మధ్య కమ్యూనికేషన్ అదేవిధంగా సైడ్ లైన్స్ లో ఉండే కోచ్ తో మాట్లాడడం. అలాగే కమ్యూనికేషన్ ఎప్పుడు క్లారిటీతో ఉండాలి. మిస్ కమ్యూనికేషన్ లేకుండా, రనౌట్ కాకుండా ఉండడానికి కూడా కమ్యూనికేషన్ ఎంతో అవసరం. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉండే ప్లేయర్ అలెర్ట్ గా ఉండాలి. అతను ఎప్పుడూ ఎదుటి ఆటగాడిని గమనిస్తూ ఉండాలి.
తరువాత బౌలింగ్ కమ్యూనికేషన్. ఇది బౌలర్, కెప్టెన్, ఫీల్డర్ ల మధ్య జరిగే కమ్యూనికేషన్. కెప్టెన్ కు బౌలర్ కు మధ్య సంభాషణ చాలా అవసరం. కెప్టెన్ బౌలర్ కు సూచనలు ఇవ్వడం, ఉత్సాహ పరచడం లాంటివి చేయాలి. బౌలర్ కు ఫీల్దర్స్ కు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ జరుగుతుంది. బౌలింగ్ వేసేముందు బౌలర్ ఫీల్డర్ ను అలర్ట్ చేస్తూ ఉంటాడు. సంజ్ఞలతో ,చూపులతో కమ్యూనికేట్ చేస్తాడు.
ధోని ఒక మంచి కమ్యూనికేట్ ర్ గా గుర్తింపు పొందడానికి కారణం అతను ఫీల్డ్ లో చాలా యాక్టివ్ గా అందరినీ ఉత్సాహపరుస్తూ ఉండటమే. ప్లేయర్స్ అందరికీ సూచనలు ఇవ్వడం, వారికి స్ట్రాటజీ నేర్పిస్తాడు. బౌలర్లకు అయితే బౌలింగ్ ఎలా చేయాలి, ఫీల్డర్ కు ఎలా యాక్టివ్గా ఫీలింగ్ చేయాలి అన్న సూచనలు ఇస్తాడు.
సౌతాఫ్రికా టూర్ లో టి20 2019 సిరీస్ జరిగిన ఒక మిస్ కమ్యూనికేషన్ సంఘటన గురించి ఇక్కడ చెప్పుకోవాలి. విరాట్ కోహ్లీ దీన్ని స్వయంగా చెప్పాడు. పంత్, అయ్యర్ ఇద్దరిలో బ్యాటింగ్ ఎవరు ముందుకు రావాలి అన్న దాంట్లో (కమ్యూనికేషన్ లో) క్లారిటీ లేకపోవడంతో చిన్నపాటి మిస్ కమ్యూనికేషన్ జరిగినట్లు కోహ్లీ వెల్లడించాడు. బ్యాటింగ్ కోచ్ ఇద్దరికీ చెప్పడం వల్ల నాలుగవ స్థానంలో ఎవరు వెళ్లాలి అన్న దాంట్లో అనిశ్ఛితి ఏర్పడింది. అప్పుడు కోహ్లీ చెప్పాడు “అది కొంత హాస్యాస్పదంగా అనిపించింది. ఇద్దరు బ్యాట్స్ మెన్ నాలుగో స్థానంలో వెళ్లాలి అనుకున్నారు. ఒకవేళ వెళ్లి ఉంటే అప్పుడు ఫీల్డ్ లో ముగ్గురు బ్యాట్స్ మెన్ ఉండేవారు” అని చమత్కరించాడు. ఇలా చాలా సంఘటనలు మిస్ కమ్యూనికేషన్ కు తార్కాణంగా నిలిచిపోయాయి.
మిస్ కమ్యూనికేషన్ వల్ల జరిగిన సంఘటనలు క్రికెట్ లో మనం చాలా చూసి ఉంటాం. బ్యాట్స్ మెన్ ల మధ్య సరిగా అవగాహన లేకపోవడం వల్ల రన్ ఔట్లు కావడం, అలాగే ఫీల్దర్స్ మధ్య క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్లు క్యాచ్ లు మిస్ కావడం లాంటివి మనం చూస్తూ ఉంటాం. దానికి కారణం కేవలం కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే. సరిగ్గా చెప్పాలంటే క్లారిటీ లేకపోవడం. అలాగే అంపైర్లు కూడా అంపైరింగ్ సరిగ్గా చేయలేక పోవడం అలాగే ఎంపైర్ ల మధ్య కూడా మధ్య అవగాహన లేకపోవడం మనం చూసే ఉంటాం. మొత్తానికి చూసుకుంటే క్రికెట్ కు కమ్యూనికేషన్ స్కిల్స్ వెన్నెముక లాంటివి.
కెప్టెన్ మ్యాచ్ ముందు యాంకర్ తో మాట్లాడేటప్పుడు, మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రెస్ వాళ్లతో మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరం. ముఖ్యంగా కెప్టెన్ ఈ నైపుణ్యాలు ఉండాలి. జట్టు నాయకుడిగా ఉండి తీరవలసిన లక్షణాల్లో Leadership skills మాత్రమే కాకుండా, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు కూడా ఎంతో అవసరం.
క్రికెట్ లో విజయాన్ని, ఓటమిని పాజిటివ్ గా స్వీకరించి జట్టును ముందుకు నడిపించాలంటే, నాయకుడి తో పాటు, సభ్యులందరికీ ఉండవలసిన ముఖ్యమైన వ్యక్తిత్వ వికాస అంశం “Emotional Intelligence” (EQ) అంటే ఉద్వేగం ప్రజ్ఞ. దాని గురించి మరో సారి చూద్దాం
(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ప్రవృత్తి – 9393737937)