‘ఇది మీ మేనమామ ప్రభుత్వం,’ అని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పిల్లలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు.
పిల్లల పోషణ, వారి చదువుల మీద ధ్యాస గతంలో ఎవరూ పెట్టలేదని విచారం వ్యక్తం చేస్తూ ‘ఇది మీ మేనమామ ప్రభుత్వం అని ధైర్యంగా ఉండండి, అని ముఖ్యమంత్రి పిల్లలకు ధైర్యం చెప్పారు.
బిడ్డ కడుపులో పడింది మొదలు, వారికి ఆరేళ్లు వచ్చే వరకు కావాల్సిన పౌష్టికాహారం ఇస్తున్నామని, గతంలో దాని కోసం ఏటా రూ.400 కూడా ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం రూ.1800 కోట్లతో వైయస్సార్ పోషణ, పోషణ ప్లస్ పథకాలు అమలు చేస్తోందని వెల్లడించారు.
ఈ రోజు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం, పునాదిపాడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకు కిట్లు అందజేసే ‘జగనన్న విద్యా కానుక పథకం’ పథకాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ పథకం కింద పేద పిల్లలకు కూడా మంచి యూనిఫామ్, బెల్టు, సాక్సులు, బ్యాగ్, ఇంగ్లిష్ మీడియమ్‌లో టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, 1 నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క విద్యార్థికి విద్యా కానుక గా అందించేందుకు ఈ పథకం చేపట్టారు.
ఆంధ్రలో నవంబరు 2న బడులు తెరుస్తున్నారు. అంతవరకు ఆగకుండా బడులింకా తెరవక ముందే పిల్లలకు కిట్స్ అందించేందుు ముఖ్యమంత్రి ఈ పథకం ప్రారంభించారు. మొత్తం 42.34 లక్షల పిల్లలకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో విద్యా కానుక అమలు చేస్తున్నారు. యూనిఫారాల కుట్టుకూలీ డబ్బులతో పాటు, పిల్లలకు అవసరమైనవన్నీ కిట్‌గా ఇస్తున్నారు.
కోవిడ్ సమయంలో అందరూ ఒకేసారి రాకుండా ఉండడం కోసం, మూడు రోజుల పాటు, మూడు దఫాలుగా పిల్లలు, వారి తల్లిదండ్రులను పిల్చి కిట్లు ఇచ్చేలా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
విజయవాడ నుంచి నేరుగా పునాదిపాడు చేరుకున్న సీఎం శ్రీ వైయస్ జగన్, స్థానిక జడ్పీ హైస్కూల్లో నాడు–నేడు కింద చేపట్టిన పనులను పరిశీలించారు. ఆధునీకరించిన తరగతి గదులు, వాటర్ ప్లాంట్, వంట గది, ఇంగ్లిష్ ల్యాబ్‌తో పాటు, తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన బెంచ్‌లు, ఇతర ఫర్నీచర్‌ను పరిశీలించి ఆయన, కాసేపు తరగతి గదిలో పిల్లల పక్కనే బెంచ్‌పై కూర్చున్నారు. పిల్లలను ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు. గ్రీన్ బోర్డుపై విద్యాకానుక అని చాక్‌పీస్‌తో రాశారు. ఆ తర్వాత టీచర్లతో కూడా సీఎం సంభాషించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు.
‘ఇది మీ మేన మామ ప్రభుత్వం, ఇది మనసున్న ప్రభుత్వం ప్రతి పిల్లవాడు ఇంగ్లిష్ చదువులు చదవాలి. ప్రపంచంతో పోటీ పడాలి అప్పుడే పేదరికం నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది అందుకే విద్యా రంగంలో 8 ప్రధాన పథకాలు అమలు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
‘జగన్ మామ వచ్చాడు. మేమే బాగా చదువుకుంటామని రేపు మీరు చెప్పుకోవాలి .ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలి. మన దగ్గర గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీలు ముందుకు రావాలి. ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ చదువులు చదవాలి. ప్రపంచంతో పోటీ పడాలి. అప్పుడే పేదరికం నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది’ అని ముఖ్తమంత్రి చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బిడ్డలు కూడా బాగా ఎదగాలని పదేళ్ల తర్వాత ప్రపంచంతో పోటీ పడి అన్నీ సాధించాలని గొప్ప మార్పులకు సారధులుగా నిల్చి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. మినరల్స్, పౌష్టికాహారం ఇస్తూ, గోరుముద్ద అమలు, రోజుకో మెనూ గతంలో ఏ సీఎం చేయని విధంగా, ఈ మేనమామ మీకోసం చేస్తున్నానని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే…
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 1 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ మూడు జతల యూనిఫారాలు, ఒక జత షూస్, రెండు జతల సాక్సులు, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, బెల్టుతో పాటు, స్కూల్ బ్యాగ్‌ను కిట్‌లో అందజేస్తూ ప్రభుత్వం ‘జగనన్న విద్యా కానుక’ అమలు చేస్తోంది.
42 లక్షలకు పైగా విద్యార్థులకు దాదాపు రూ.650 కోట్ల వ్యయంతో జగనన్న విద్యా కానుక కిట్లు ఇస్తున్నారు. యూనిఫారాల కుట్టు కూలీని కూడా విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు.
కోవిడ్ నేపథ్యంలో విద్యార్జులకు మూడు మాస్కుల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కిట్లు పంపిణీ చేయనున్నారు.
‘ప్రపంచాన్ని మార్చే శక్తి ఎక్కడైనా ఉంది అంటే అది చదువుల్లోనే ఉంది’ అన్న నెల్సన్ మండేలా అన్నారు. ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పిల్లలకు రావాలి, వారు ప్రపంచాన్ని జయించే పరిస్థితికి చేరుకోవాలి. అది జరగాలంటే సమూల మార్పులు తీసుకురావాలి.
చదువుకునే శక్తి లేని వారి గురించి మనం ఎంత నిజాయితీగా ఆలోచించామన్నది గతంలో పాలన చేసిన వారు తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. చదువే తరగని ఆస్తి. చదువు దొంగలు ఎత్తుకుపోలేనిది. చదువే బ్రతుకులు మార్చే శక్తి ఉందన్న అవగాహన ఉంది కాబట్టే ఈ దిశలో అడుగులు వేస్తున్నాం.
‘మనబడి’, ’ నాడు-నేడు’ లో స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. నీటి సదుపాయం ఉన్న టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు ఉన్న తరగతి గదులు, మంచి తాగు నీటి సదుపాయం, గ్రీన్ బోర్డులు, బ్లాక్ బోర్డులు, పిల్లలు, టీచర్లు కూర్చునేందుకు మంచి బల్లలు.. స్కూళ్లకు రిపేర్లు, పెయింటింగ్. స్కూళ్లలో ఆహ్లాదకరమైన వాతావరణం. పిల్లల భద్రత కోసం ప్రహరీల నిర్మాణంతో పాటు, ఆ స్కూళ్లలో తినడానికి గోరుముద్ద పథకం. అందు కోసం మంచి కిచెన్ ఏర్పాటు చేస్తున్నాం.
వీటన్నింటితో పాటు, ఇంగ్లిష్ మీడియమ్ ప్రారంభిస్తూ, పెద్ద కుటుంబాల వారితో పేద విద్యార్థులు పోటీ పడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.