బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులైన తర్వాత రాష్ట్రంలో వరుసగా దేవాలయాలపై జరుగుతున్న దాడులపై గొంతెత్తడం ద్వారా అధికారమలో ఉన్న వైసీపీకి వ్యతిరేకంగా ప్రజా మద్దతు కూడదీసుకోవడానికి `హిందూత్వ కార్డు’ ప్రయోగించే సంకేతం ఇచ్చారు. వారికి మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహితం ఈ విషయంలో గొంతు కలిపారు.
మొత్తం మీద వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏపీలో హిందూ దేవాలయాలకు రక్షణ లేక పోతున్నట్లు జాతీయ స్థాయిలో గగ్గోలు చేయడంలో కొంతవరకు విజయం సాధించారు.
అంతలో తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్తులు ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వనవసరం లేదని అంటూ టిటిడి బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేసిన ప్రకటన బిజెపికి మరో ఆయుధంగా దొరికింది.
.
ఆ మరుసటి వారమే తిరుమల దర్శనంకు వచ్చిన ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇచ్చి మాత్రమే రావాలంటూ కొందరు బీజేపీ నేతలు ప్రకటనలు చేశారు.
అయితే ప్రధాన ప్రతిపక్షం ఈ విషయంలో తన స్వరాన్ని పెంచడంతో ఎందుకోగానీ బిజెపి నేతలు ఒకింత వెనుకడుగు వేశారు.
మొత్తానికి రాష్ట్రంలో జగన్ హాయంలో హిందూమనోభావాలు గాయపడ్తున్నాయనే అంశాన్ని బాగా చర్చనీయాంశాన్ని చేయగలిగారు
వై ఎస్ రాజశేఖరరెడ్డి హయం నుండి తిరుమలలో అన్యమతస్థులు మత ప్రచారం, టిటిడి ఉద్యోగులలో అన్యమతస్థులు వంటి అంశాలపై ఆర్ ఎస్ ఎస్, బిజెపి పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ వచ్చాయి.
ఏకంగా తిరుమల పరిరక్షణ సమితి అంటూ ఏర్పాటు చేశాయి. టిడిపి హయాంలో సహితం క్రైస్తవ కార్యక్రమాలకు హాజరైన పుట్ట సుధాకర్ యాదవ్ ను టిటిడి చైర్మన్ గా నియమించడం పట్ల ఆర్ ఎస్ ఎస్ మద్దతుగల సంస్థలు నిరసనలు తెలిపాయి.
ఇటువంటి సమయంలో సిటింగ్ వైసిపి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్ సభకు ఉపఎన్నికలు అవసరమయ్యాయి. హిందూసెంటిమెంట్ ను ప్రచారంలోకి తీసుకువవచ్చిన దీని ప్రభావమేమిటో ఈ ఉప ఎన్నికల్లో పరీక్షించుకునేందుకు ఒక అవకాశం దొరికింది. అందువల్ల తిరుపతి ఎన్నిక బిజెపికి ప్రతిష్టాకరంగా మారింది.
గతంలో టిడిపితో పొత్తు పెట్టుకొన్న ప్రతి సందర్భంగా ఈ సీట్ ను టిడిపి బిజెపికి వదిలివేస్తూ వచ్చింది. 1999లో ఆ పార్టీ అభ్యర్థి డా. ఎన్ వెంకటస్వామి అక్కడి నుండి గెలుపొందారు కూడా.
ఇప్పుడు కూడా జనసేన మద్దతుతో పోటీ చేయడానికి బిజెపి రాష్ట్ర నేతలు ఉత్సాహం చూపుతున్నారు. అయితే ఈ సీట్ కోసం ప్రస్తుతం వినిపిస్తున్న అభ్యర్థుల పేర్లు బిజెపి వర్గాలలో గందరగోళానికి దారితీస్తున్నాయి.
క్రైస్తవులుగా పేరుపొందినవారు పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నం చేస్తుండడం బిజెపికి మద్దతు ఇస్తున్న హిందూ సంస్థలు తయాయించుకోలేక పోతున్నాయి.
ముఖ్యంగా టిడిపి నుండి ఎన్నికల ముందు బీజేపీలో చేరిన మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. మరోవంక గత ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి అనంతరం ఇంటికే పరిమితమైన ప్రముఖ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి సహితం సీట్ ఇస్తానంటే బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో మాజీ లోక్ సభ స్పీకర్ బాలయోగి వద్ద ఒఎస్ డి గా పనిచేసిన రావెల కిషోర్ బాబు మాజీ ఐ ఆర్ టి ఎస్ అధికారి ఇందులో ఒకరు. టిడిపి హయాంలో మంత్రిగా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.
అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేసిన టిడిపి నేతలు, వారి సన్నిహితుల పేర్లలో వైసిపి ప్రభుత్వం ఈయనపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నది. పైగా పాస్టర్ గా జీవితం ప్రారంభించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
రాష్ట్రంలో దళితు లతో పనిచేస్తున్న అనేకమంది నేతలు ఉన్నప్పటికీ కేవలం ధనబలంతో బిజెపి నాయకత్వం ఆయనకు ప్రాధాన్యత ఇస్త్తున్నట్లు పార్టీ వర్గాలే ఆరోపణలు చేస్తున్నాయి.
మరోవంక పనబాక లక్ష్మి సైతం మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి దగ్గరకు తీసి, ఎంపీగా చేస్తే, ఆమె క్రైస్తవం అండతో సోనియా గాంధీకి సన్నిహితమై కేంద్ర మంత్రి కాగలిగారు.
కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతున్న సమయంలో టిడిపిలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి సహితం భవిష్యత్ లేదని బిజెపి వైపు చూస్తున్నారు.
`హిందుత్వ కార్డు’కు కీలక కేంద్రం కానున్న తిరుపతిలో ఇటువంటి వారు పార్టీ అభ్యర్థులైతే మద్దతుదారులను కోల్పోతామని బీజేపీలో కొన్ని వర్గాలు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
గతంలో రిటైర్డ్ ఐ ఎ టీఎస్ అధికారి డా. వెంకటస్వామిని గెలిపించినట్లుగానే వివాదాలకు అతీతుడై, స్థానికంగా పరిచయాలు గల ఉన్నత విద్యావంతులను ఎంపిక చేయాలని స్థానిక నేతలు కోరుతున్నారు.
మరోవంక రాష్ట్రంలో హిందూ దేవాలయాల పరిరక్షణకోసం, ముఖ్యంగా తిరుమల పవిత్రత కాపాడటం కోసం జరిపిన పోరాటాలలో పాల్గొన్నవారిని ఎంపిక చేయాలనే డిమాండ్ బిజెపికి మద్దతు ఇస్తున్న హిందూ సంస్థల నుండి వస్తున్నది. ఈ నేపథ్యంలో అభ్యర్థిని ఎంపిక చేయడం ఒక విధంగా బిజెపి నాయకత్వానికి సవాల్ గా మారే అవకాశం కనిపిస్తున్నది.