కృష్ణా నది యాజమాన్య బోర్డు (Krishna River Management Board-KRMB) ను ఆంధప్రదేశ్ లో ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించినందున ఈ బోర్డు కార్యాలయాన్ని కర్నూలు లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్నాను.
రాష్ట్ర విభజన చట్టాన్ని గౌరవిస్తూ, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి అంగీకారం తెలిపిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు.
అధికార వికేంద్రీకరణ లో భాగంగా రాయలసీమలో న్యాయ రాజదాని ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి నీటి పంపకాలపై వివాదాల పరిష్కారాల సంస్థ అయిన కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలి. ఈ నిర్ణయం తీసుకుంటారని రాయలసీమ ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
న్యాయ రాజధాని ఏర్పాటులో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి గారు, కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేసి తాను ప్రకటించిన రాయలసీమలో న్యాయ రాజధానికి కట్టుబడి ఉన్నామన్న భరోసాకై రాయలసీమ వాసులు ఎదురు చూస్తున్నారు.
కృష్ణా యాజమాన్య బోర్డును జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కర్నూలు లో ఏర్పాటు చేస్తుందన్నమాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అన్ని ప్రాజెక్టులను కూడా పాత ప్రాజెక్టులుగానే పరిగణమిస్తామన్న కేంద్ర మంత్రి ప్రకటన చేయడం హర్షదాయకం.
ఈ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందించే డి పి ఆర్ లకు అత్యంత త్వరితంగా టెక్నికల్ అనుమతులను ఇస్తామని కేంద్ర మంత్రి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం.
వెనుకబడిన రాయలసీమ కు సంబంధించిన సాగునీటి అంశాలపై అపెక్స్ కౌన్సిల్ లో సమావేశం అనేక కీలకమైన నిర్ణయాలు జరిగిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలు నిర్మాణాత్మక పాత్ర వహించి రాయలసీమకు బాసటగ నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
(బొజ్జా దశరథ రామి రెడ్డి,అధ్యక్షులు,రాయలసీమ సాగునీటి సాధన సమితి, నంద్యాల)