“జగన్మోహన్ రెడ్డి ‘క్విడ్ ప్రో క్వో -2.0’ కొనసాగుతోంది.కాకినాడ సెజ్, విశాఖ బేపార్క్ లావాదేవీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం.జగన్మోహన్ రెడ్డి బినామీ ట్రాన్సాక్షన్స్ పై అత్యున్నత స్థాయి దర్యాప్తు జరపాలి”
(యనమల రామకృష్ణుడు)
విశాఖ పట్నం బేపార్క్ కూడా జగన్మోహన్ రెడ్డి బినామీల ఖాతాల్లో జమ అయింది. కాకినాడ సెజ్ ఇప్పటికే అరిబిందో పేరుతో జగన్ బినామీల పరం. జగన్ బినామీ కొనుగోళ్లలో మరో లావాదేవీ విశాఖ బేపార్క్ చేరింది. విశాఖ బేపార్క్ కూడా హెటిరో పేరుతో కైవసానికి సిద్దమయింది.
టిడిపి హయాంలో విశాఖ రుషికొండ వద్ద అంతర్జాతీయ స్థాయిలో ఎకో టూరిజం ప్రాజెక్టు అభివృద్దికి శ్రీకారం చుట్టాం. కొండ మీద, కొండ కింద 36 ఎకరాల్లో అంతర్జాతీయ పర్యాటక ప్రాజెక్టు అభివృద్దికి నాంది పలికాం. రూ120కోట్లు ఖర్చుచేసి కొండపై మెడికల్ టూరిజం తరహాలో బే పార్క్ అభివృద్ది చేశాం.
బినామీల ముసుగులో రూ300కోట్ల విలువైన ఈ భూమిని, ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి హస్తగతం చేసుకోవడం ప్రజాద్రోహం.
రూ120కోట్లతో అభివృద్ది చేసిన బేపార్క్ చేతులు మారడం వెనుక హస్తం ఎవరిది..? బేపార్క్ లో మేజర్ వాటాలు ఎవరి ఒత్తిళ్ల మేరకు హెటిరో పరం అయ్యాయి..?
కొండ మీద వాటాల కొనుగోళ్లకు ప్రతిఫలంగా కొండ కింద రూ225కోట్ల విలువైన 9ఎకరాల భూమి హెటిరో పరం..? వాస్తవానికి ఇది కూడా బినామీ లావాదేవీనే. వీటన్నింటిపై కేంద్రం తక్షణమే స్పందించి అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించాలి.
టిడిపి టూరిజం ప్రాజెక్టులు అభివృద్ది చేస్తే, బినామీ ఆస్తుల అభివృద్దిలో జగన్ రెడ్డి. జగన్ పై సిబిఐ 12ఛార్జిషీట్లలో తొలి ఛార్జి షీట్ లో హెటిరో కూడా సహ నిందితుల జాబితాలో ఉంది. ఎ1 జగన్మోహన్ రెడ్డి, ఎ2 విజయసాయి రెడ్డి అయితే, ఎ4 గా హెటిరో, ఎ3 గా అరబిందో ఉన్నాయి.
జడ్చర్ల సెజ్ లో 75ఎకరాల భూములు హెటిరోకు కేటాయించినందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీలో రూ 19.50కోట్లు పెట్టుబడి పెట్టారని సిబిఐ తొలి ఛార్జ్ షీట్ లో పేర్కొనడం తెలిసిందే. హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, హెటిరో హెల్త్ కేర్ లిమిటెడ్ పై, హెటిరో డైరెక్టర్ ఎం శ్రీనివాస రెడ్డిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడి) కేసుల గురించి విదితమే.
అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఏ కంపెనీలకు మేళ్లు చేసి ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పొందారో, ఇప్పుడు అవే కంపెనీలకు మేళ్లు చేయడం గమనార్హం..
2004-09మధ్య జరిగింది ‘‘క్విడ్ ప్రొ క్వో -1’’, అయితే ఇప్పుడు జరుగుతోంది ‘‘క్విడ్ ప్రొ క్వో- 2’’.. అప్పటి కేసులలో తన సహనిందితులకే ఇప్పటి జగన్ పాలనలో మేళ్లు.
అప్పటి సహనిందితులకే రాజకీయ పదవులు. అప్పటి సహనిందితులతోనే ఇప్పుడు బినామీ లావాదేవీలు..
తొలి ఛార్జిషీట్ లో ‘‘ఎ 3 గా ఉన్న అరబిందో కంపెనీకే కాకినాడ సెజ్’’ దఖలు. ‘‘ఎ 4 గా ఉన్న హెటిరో’’కు విశాఖ బేపార్క్ కట్టబెట్టడం..క్విడ్ ప్రొ కో-2లో భాగమే..
అప్పుడు తండ్రి అధికారం అండతో, ఇప్పుడు ఏకంగా కొడుకు అధికారంలో…వేలకోట్ల ప్రజాధనం బినామీల పరం చేయడం జగన్ అవినీతి పోకడలకు పరాకాష్ట.
కేంద్రం తక్షణమే స్పందించి జగన్మోహన్ రెడ్డి బినామీ ట్రాన్సాక్షన్స్ పై అత్యున్నత స్థాయి దర్యాప్తు జరపాలి. కాకినాడ సెజ్, విశాఖ బేపార్క్ భూముల కొనుగోళ్ల లావాదేవీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రో క్వో-2 గుట్టు రట్టు చేస్తాం.
(యనమల రామకృష్ణుడు, తెలుగుదేశం పార్టీ, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత)