ఈ రోజు కంప్యూటర్లు మనిషి మాటని, హావభావాలనుఅర్థం చేసుకుంటన్నాయంటే,దాని వెనక రాజ్ రెడ్డి కృషి కూడా ఉంది.
(చందమూరి నరసింహారెడ్డి)
చిన్న పల్లెటూరు నుంచి బాల్య జీవితం ఆరంబించి అగ్రరాజ్యంలో ఓ వెలుగు వెలుగు తున్న శాస్త్రవేత్త వేత్త ఆయన.
రాయలసీమ వాసులకు కూడ పూర్తి తెలియని ఓ గ్రామాన్ని అంతర్జాతీయ స్థాయి వార్తని చేశారు.
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంతగాలేని రోజుల్లో ఆయన కృత్రిమ మేధ (artificial intelligence AI) వైపు దృష్టి మరల్చడం ఆయన ముందు చూపు.
స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ లో మొదటి డాక్టరేట్ అందుకొన్న భారతీయుడు. యువతకు మార్గనిర్దేశకుడు దుబ్బల రాజ్ రెడ్డి అలియాస్ రాజగోపాల్ రెడ్డి.
కాటూరు అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన బుచ్చినాయుడు ఖండ్రిగ మండలంలోని లోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 900 ఇళ్లతో మొత్తం 3309 జనాభాతో 1307 హెక్టార్లలో విస్తరించి ఉంది.
రాజ్ రెడ్డి చిత్తూరు జిల్లా, బుచ్చినాయుడు ఖండ్రిగ మండలం, కాటూరు గ్రామంలో 1937 జూన్ 13 జన్మించాడు. తండ్రి శ్రీనివాసులు రెడ్డి వ్యవసాయ దారుడు. తల్లి పిచ్చమ్మ గృహిణి. ఆయన తాత ఒక భూస్వామి. దాన ధర్మాల వల్ల వారి ఆస్తి కరిగిపోయింది. రాజ్ రెడ్డి తల్లి దండ్రులకు ఏడుగురు సంతానం. నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు. వారిలో రాజ్ రెడ్డి నాలుగోవాడు.
ఐదో తరగతి దాకా కాటూరు లో చదివాడు. ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా తెలుగు మాధ్యమంలోనే శ్రీకాళహస్తిలో చదివాడు. ఇంటర్ మీడియెట్ మద్రాసు లయోలా కళాశాలలో చదివారు. ఇంటర్మీడియట్ లో మెల్లగా ఆంగ్లం మీద పట్టు తెచ్చుకుని ఇంటర్మీడియట్ మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.
ప్రతిభ, మౌఖిక పరీక్ష ఆధారంగా గిండీ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు దొరికింది. 1958 లో చెన్నైలో మద్రాసు విశ్వవిద్యాలయానికి చెందిన గిండీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి సివిల్ ఇంజినీరింగ్ లో పట్టా పుచ్చుకున్నాడు.
మద్రాసులో ఇంజనీరింగ్ పూర్తి కాగానే మద్రాసు పోర్టు ట్రస్టులో ఇంజనీరుగా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తున్నపుడే 1960 లో ఆస్ట్రేలియా వెళ్ళి న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ సంపాదించాడు.
రాజ్ రెడ్డి ఆస్ట్రేలియాలో ఐబీయం లో ఉద్యోగంలో చేరి అక్కడే మూడేళ్ళపాటు పనిచేసారు .కంప్యూటర్ విద్య పై ఆసక్తి తో కంప్యూటరు గురించి మరింత పరిశోధన చేయాలన్న తపనతో స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి కి దరఖాస్తు చేశాడు.
1966 లో స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ లో డాక్టరేటు సంపాదించాడు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మొట్టమొదటి డాక్టరేట్ అందుకున్న ఘనత ఆయనదే.
అదే సంవత్సరం స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తన అధ్యాపక వృత్తిని ప్రారంభించాడు.
రాజ్ రెడ్డి స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నపుడు ఆయనకు తంబలపల్లి జమీందారు కుటుంబానికి చెందిన అనురాధ ను పెళ్ళి చేసుకొన్నారు. పెళ్ళైన తరువాత ఆయన తరఫున భార్య వారి సొంత గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంది.
పెళ్లి తర్వాత 1969 లో పిట్స్ బర్గ్ లోని కార్నెగీ మిలాన్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా చేరాడు. అక్కడే ఆయన కెరీర్ కు బలమైన పునాది పడింది.
కార్నెగీ మిలన్ యూనివర్సిటీ లో 1979 లో ఆయన “రోబోటిక్స్ ఇనిస్టిట్యూట్ “కు వ్యవస్థాపక డైరక్టర్ గా ఉన్నాడు.1979 నుంచి 1991 దాకా ఈ పదవిలో 12ఏళ్ళు కొనసాగారు.భవిష్యత్తులో మనుషులు చేయాల్సిన చాలా పనుల్ని రోబోలు చేస్తాయని ఆయన బృందం ముందుగానే ఊహించింది.
ఆయన పనిచేస్తున్న విశ్వవిద్యాలయానికి ఆ రంగంపైన ఆసక్తి కలిగి దానికోసం ప్రత్యేకంగా ఓ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలా కోట్ల రూపాయల ఖర్చుతో మొట్టమొదటి రోబోటిక్స్ ఇన్‌స్టిట్యూట్‌ని నెలకొల్పారు. ఇప్పటికీ ప్రపంచంలో అదే అతిపెద్ద రోబోల పరిశోధనా కేంద్రం.
రోబోలకు మాటలూ, భాషలూ నేర్పించడం, పదాల్ని గుర్తుపెట్టుకునే శక్తినివ్వడం, మాటల ద్వారా ఇచ్చిన ఆదేశాలకు స్పందించడం (computer-Human interaction and artificial intelligence) లాంటి అనేక అంశాలను మొదట అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల బృందంలో ఆయన ముఖ్యుడు. కృత్రిమ మేధస్సులో ఆయన పరిశోధనలకు గుర్తింపుగా ఆసియాలోనే తొలిసారి ప్రతిష్ఠాత్మక ఎలాన్ ట్యూరింగ్ అవార్డు దక్కింది.
కంప్యూటర్ సైన్సులో నోబెల్ బహుమతి లేదు కాని ట్యూరింగ్ పేరు మీద దానికి దీటైన బహుమతి వుంది. దాదాపు గత యాభై ఏళ్ళుగా ప్రతి సంవత్సరం దీనిని కంప్యూటర్ సైన్సులో చెప్పుకోదగ్గ పరిశోధనలని చేసిన వారికి ఇస్తున్నారు. మన దేశస్థులలో కంప్యూటర్ ఇంజనీర్లు అనేక లక్షల మంది ఉన్నా ఇంతవరకు ఇది మనకి ఒకే ఒక్కసారి దక్కిందంటే కొంత విచారం కలగచ్చు. కాని అది మన తెలుగువాడికని కాస్త గర్వపడొచ్చు.
కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయంలో రొబోటిక్స్ ప్రొఫెసరు దబ్బల రాజగోపాల్ రెడ్డి కృత్రిమమేధారంగంలో (Artificial Intelligence) చేసిన పరిశోధనలకి 1986 అవార్డుని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎడ్వర్డ్ ఫైగెన్‌బామ్ (Edward Feigenbaum)తో కలిసి పంచుకున్నారు.
1991 నుండి 1999 మధ్య కాలంలో కార్నెగీ మిలన్ యూనివర్సిటీ కంప్యూటర్ విభాగానికి డీన్ గా వ్యవహరించాడు.
డీన్ గా లాంగ్వేజ్ టెక్నాలజీస్ ఇనిస్టిట్యూట్, హుమన్ -కంప్యూటర్ రిలేషన్, సెంటర్ ఫర్ ఆటోమేటెడ్ లెర్నింగ్ అండ్ డిస్కవరీ, ఇనిస్టిట్యూట్ ఫర్ సాఫ్ట్వేర్ రీసర్చ్ లను ఏర్పాటు చేశాడు. అమెరికన్ ఆసొసియేషన్ ఫర్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థను స్థాపించి దానికి అధ్యక్షుడిగా పనిచేశాడు.
బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన ఐటీ సలహా సంఘానికి కో-ఛైర్మన్‌గా పనిచేశాడు.
ఫ్రాన్స్ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానం నిరుపేదలకూ సామాన్యులకూ ఉపయోగపడే సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ ప్రాజెక్టుకు ఆయన చీఫ్ సైంటిస్టుగా పనిచేశాడు. తక్కువ ఖర్చులోనే కంప్యూటర్లను తయారు చేసి 80వ దశకం తొలిరోజుల్లోనే ఆఫ్రికా దేశాల్లోని పాఠశాలలకు వాటిని అందేలా చూశాడు.
వైద్యం, రోడ్డు ప్రమాదాల నివారణ, మందుపాతర్లూ, ప్రకృతి విపత్తుల గుర్తింపు లాంటి అనేక రంగాల్లో ఉపయోగపడేలా రోబోల తయారీకి పునాది వేశాడు. ఆయన సేవలకు గుర్తింపుగా అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు మిట్టరాండ్ స్వయంగా అమెరికా వచ్చి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారమైన లెజియన్ ఆఫ్ ఆనర్ ను అందించాడు.
రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీల ఏర్పాటుకు మార్గదర్శిగా, పాలక మండలి అధ్యక్షుడిగా విద్యార్థులకు ఐటీలో పరిశోధనలకు సంబంధించిన శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో హైదరాబాద్‌లో తొలి ట్రిపుల్‌ఐటీని ఏర్పాటు చేశాడు.
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఛైర్మన్, ఛాన్సిలర్ గా వ్యవహరించాడు. “ప్రెసిడెంట్స్ ఇన్పర్మేషన్ టెక్నాలజీ అడ్వైజరీ కమిటీ” సహ ఛైర్మన్ గా రాజ్ రెడ్డి 1999 నుండి 2006 వరకు ఉన్నారు.
2001 లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం తో సత్కరించింది. 2004 లో ఒక్వా బహుమతి 2005 లో జపాన్ లో హోండా అవార్డు అందుకొన్నారు.
యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అకాడమీ, అమెరికా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, చైనీస్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ తదితర వాటిలో సభ్యులు.
యస్వీ యూనివర్సిటీ , హెన్రీ పొయన్ కేర్ , యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్ , జె.యన్.టి.యు. , యూనివర్సిటీ ఆఫ్ మ్యాసాసుట్ ,యూనివర్సిటీ ఆఫ్ వర్ విక్ , అన్నా యూనివర్సిటీ ,ఐఐటీ ఖరగ్ పూర్ , హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లనుంచి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకొన్నారు.
2006 లో అమెరికాలో నేషనల్ సైన్స్ లో అత్యున్నత పురస్కారమైన వాన్నెవర్ బుష్ అవార్డు అందుకొన్నారు.
వీరు అమెరికా లో స్థిరపడారు.
(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత, అనంతపురం జిల్లా)