నదీజలాల పంపిణీ గురించి ఏర్పాటయిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వాదనల్లో కొన్ని భాగాలు చదివితే ఆంధ్రప్రదేశ్ సాగు నీటి శాఖ అవగాహనారాహిత్యం ఏ స్థాయిలో ఉన్నదో బోధపడుతున్నది.
ఈ వాదనలు జుగుప్సాకరంగాను, ఆంధ్రప్రదేశ్ కు తీరని నష్టం చేకూర్చేలా ఉన్నాయి. వారికై వారికి తెలియదు, ఇంకొకరి నుంచి తెలుసుకోరు. వారికి జలవనరులపై అధ్యయనం చేసే ఆసక్తి ఉన్నట్లు లేదు. అవగాహనారాహిత్యంతో అంతా తెలిసినట్లు, తప్పుడు సమాచారంతో, అడ్డగోలు వాదనలు చేస్తే పర్యవసానాలు నిరాశాజనకంగానే ఉంటాయి. వారి వాదనల్లోని కొన్ని భాాగాలు చూడండి.
I. “చెన్నైకి తాగునీటి అవసరాలకు 15 టియంసీలు, ఎస్సార్బీసీకి 19, కేసీ కెనాల్ సప్లిమెంటేషన్ కు 10 టీయంసీలు కేడబ్లూడీటీ -1 కేటాయించింది”.
నా వ్యాఖ్య:
1. మహారాష్ట్ర, కర్నాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య 1983 సం.లో కుదిరిన ఒప్పందం మేరకు చెన్నై నగరానికి 15 టీయంసీలను త్రాగు నీటి కోసం సరఫరా చేయాలి. ఈ నీటి కేటాయింపు కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్(కేడబ్లూడీటీ -1) చేయలేదు.
2. కేడబ్లూడీటీ -1 పునరుత్పత్తి పద్దు క్రింద కేటాయించిన 11 టీయంసీలకు తోడు కేసీ కెనాల్ ఆధునీకీకరణ ద్వారా ఆదా అయిన 8 టీయంసీలను కలిపి 19 టీయంసీల నికర జలాలను శ్రీశైలం జలాశయం నుండి సరఫరా చేసే విధంగా కేంద్ర జల సంఘం అనుమతితో, ప్రపంచ బ్యాంకు రుణంతో ఎస్సార్బీసీని నిర్మించుకోవడం జరిగింది.
3. బచావత్ ట్రిబ్యునల్ 39.9 టీయంసీలను కే.సీ.కెనాల్ కుహి బ్య్ కేటాయించింది. అందులో 10 టీయంసీలను తుంగభద్ర జలాశయం నుండి విడుదల చేయాలి. ఆ 10 టీయంసీల నీటిని అత్యంత కరవు పీడిత జిల్లా అయిన అనంతపురం జిల్లాలో నిర్మించబడిన పీఏబీఆర్ కు సర్దుబాటు చేసి, ఆ మేరకు కేసీ కెనాల్ కు శ్రీశైలం జలాశయం నుండి సర్దుబాటు చేస్తూ అఖిలపక్ష సమావేశం చేసిన ఏకగ్రీవ తీర్మానం మేరకు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
II. “సీబీఆర్ కు 10, పైడిపాళెంకు 6, మైలవరానికి 7, సర్వారాయసాగర్ కు 3, గోరకల్లుకు 12.4, అవుకుకు 4.14, సోమశిలకు 78, కండలేరుకు 68 టీయంసీలు అవసరం. ఈ ప్రాజెక్టులన్నీ శ్రీశైలంపైనే ఆధారపడ్డాయి. సీబీఆర్, మైలవరం, సోమశిల, కండలేరు ప్రాజెక్టులు దశాబ్ధాలుగా శ్రీశైలంపైనే ఆధారపడ్డాయి.”
నా వ్యాఖ్య:
(1) సీబీఆర్ చిత్రావతి నదిపై ఆధారపడి నిర్మించబడింది. చిత్రావతిలో నీటి లభ్యత లేకపోవడంతో గండికోట – చిత్రావతి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. అది గాలేరు – నగరిలో అంతర్భాగం కాదు.
(2) గాలేరు – నగరిలో అంతర్భాగం కానీ పైడిపాళెం ఎత్తిపోతల పథకం గండికోట రిజర్వాయరు మీద ఆధారపడి నిర్మించబడింది.
(3) మైలవరం జలాశయం పెన్నా నదిపై ఆధారపడి నిర్మించబడింది.
(5) గోరకల్లు, అవుకు శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(ఎస్సాబీసీ)లో అంతర్భాగం.
(6) నెల్లూరు జిల్లాలో నిర్మించబడిన సోమశిల, కండలేరు పెన్నా నదీ జలాలపై ఆధారపడి నిర్మించబడ్డాయి.
ఈ మాత్రం పరిజ్ఞానం లేకుండానే వాదనలు వినిపించారా! లేదా, ఉద్ధేశ్య పూర్వకంగానే వినిపించారా! తెలియదు. ఈ తరహా వక్రీకరణలతో కూడిన అవాస్తవాలపై ఆధారపడి ఎపెక్స్ కౌన్సిల్ ముందు వ్రాత పూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాదనలు వినిపిస్తే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి హక్కులను పరిరక్షిస్తారన్న తీవ్ర ఆందోళన కలుగుతున్నది.
(టి.లక్ష్మీనారాయణ కమ్యూనిస్టు, సామాజిక ఉద్యమకారుడు)