కష్టాలు మనిషిని కృంగదీస్తాయి. మానసికంగా బలహీన పరుస్తాయి. నిరాశకు గురిచేస్తాయి. జీవితయాత్రను ముందుకు సాగకుండా అడ్డుకుంటాయి. పిరికి వాళ్లు చతికిల పడతారు.పాతేసిన రాయిలాగా అక్కడ ఉండిపోతారు. సాహసికులు జీవనమరంలో ముందుకు దూసుకుపోతారు. వీరగాథలు సృష్టిస్తారు.
కష్టాల్లో ఉన్నవాళ్లలో ఉత్సాహం నింపేందుకు, లేచి వొల్లు విరుచుకుని,బలాన్ని కూడదీసుకుని, ఏటికి ఎదురీదేందుకు సంసిద్ధమవుతారనే నమ్మకంతో ఆయన తన సివిల్స్ సక్సెస్ స్టోరీని అందరితో పంచుకుంటున్నాడు. జీవితంలో తనుపడిన కష్టాలను వింటే కాంపిటీటివ్ పరీక్షలు రాస్తున్న వాళ్ల పట్టుదల పెరుగుతుందని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన పేరు విష్ణు ఔటి. ఐఆర్ ఎస్. ఈయన కథ చదవగా.
గమనిక : ఈ కథ చదివేందుకు కూడా ధైర్యం కావాలి. మనోబలం లేని వాళ్లీ కథ చదవొద్దని మనవి
అనగనగా ఒక పల్లెటూరు. అది మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా, పార్నేర్ తాలుకాలో ఉండే ఒక అధ్వాన్నమయిన ఊరు. పేరు ఖుంబర్ వాడి. బాగా వెనకబడిన ప్రాంతం. ఎపుడూ కరువు కాటకాలొస్తుంటాయి. కరువొస్తే వూర్లో కూలి ఉండదు, ఊళ్లోని వాళ్లకు కూడు వుండదు.అంతెందుకు తాగేందుకు నీళ్లు కూడా దొరకనంత ఎడారి లాగా మారిపోతుందావూరు. వూరికి ఎవరొచ్చినా రాకపోయినా, రెగ్యులర్ గా వచ్చేది, బీభత్సం సృష్టించేది కరువే.
ఆవూర్లో హరిభావ్ ఔటి ది ఒక పేద కుటుంబం. భర్త, భార్య ఇద్దరు పిల్లలు. కరువు జీవితంలో కలలేముంటాయి, ఆకలి తప్ప,రేపటి బతుకు చింత తప్పు. మరుసటి సూర్యోదయం చూడటమే మహద్భాగ్యం ఆవూరి ప్రజలకు. ఒక గుడిసెలో జీవిస్తూ ఉంది కూలీనాలీ చేసుకునే ఈ కుటుంబం. ఊరి బయట విశాలమయిన ప్రపంచం ఉందని, అక్కడ ఎన్నో వింతలు,విశేషాలుంటాయన్న విషయం కూడా తెలియని కుటుంబం.
Like this story? Share it with a frind!
ఎప్పటిలాగే 1972లో ఆ ప్రాంతానికి పెద్ద కరువొచ్చింది. భయంకరమయిన కరువది. ఊరంతా ఎండిపోయింది. పొలాల్లో విత్తనాలు పల్లేదు. బావులు, చెరువులు ఇంకిపోయాయి. పశువులకు మేత లేదు. మనుషులకు చేసేందుకు పని లేదు. తిండి లేదు. తాగే నీళ్ల కోసం కూడా ప్రజలంతా కటకటలాడారు.
హరిభావ్ కుటుంబ మీద కరువు చావు దెబ్బవేసింది. ఈ కరువు హరిభావ్ ను అనాధ చేసింది. మొత్తం కుటుంబాన్ని కాటేసింది. హరిభావ్ తండ్రి కరువు ఆకలితో చనిపోయాడు. అతని భార్యా చనిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా కరువులోనే చనిపోయారు. ఒంటరిగా, ఏడిస్తే కన్నీళ్లు కూడా రాలని కరువు నేల మీద హరిభా ఒంటిరిగా మిగిలాడు.దానికి తోడు ఆయన చూపు తక్కువ. ఆ దశలో జీవితమెలా ఉంటుందో వూహించండి.
ఈ కష్టాలనుంచి విముక్తి లేదనుకున్నాడు హరిభావ్. ఇలా బతకాల్సిందే అనుకున్నాడు. అలాగే ఒంటరిగా మోడువారిన జీవితం గడుపుతున్నాడు. కూలీ ఉన్న రోజు కూడు ఉంటుంది. లేని రోజు పస్తులే.
ఇలాంటి హరిభావ్ పక్కవూరిలో మరొక పేదవాడి కంటపడ్డాడు. ఆయనకు ఒక కూతురు ఉంది. ఆమె మూగ చెవిటి పిల్ల. ఆమెను ఏదో విధంగా ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసి బరువు దించుకోవాలనుకున్నాడు తండ్రి. మూగ చెవిటి పిల్లనెవరు చేసుకుంటారు? ఆయనకు అప్తుడిలాగా హరిభావ్ కనిపించాడు.అంతే, కూతురు కైలాస బాయి నిచ్చి పెళ్లి చేశాడు. వాళ్లకి ముగ్గురు పిల్లలు. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. ఇందులో మధ్యలో పుట్టిన వాడి పేరు విష్ణు ఔటి (Vishnu Auti).
పర్నేర్ ప్రాంతం మీద 1987లో మరొక సారి కరువు దాడి చేసింది. అప్పటికి విష్ణుకి ఏడేళ్లు. కరువొచ్చినా సరే విష్ణు స్కూలు మానిపించకూడదనుకున్నాడు తండ్రి. అంతేకాదు, చదువుకోవలసిన అవసరమేమిటో నొక్కి చెప్పే వాడు. చదువు తో ప్రయోజనమేమిటో ఆయనకు తోచిన పద్ధతిలో చూపించేవాడు. వివరించేవాడు,
ఆ ప్రాంతంలో కరువు బారిన పడిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం కొన్ని ఉపాధి చర్యలు చేపట్టింది. ఒక రోజు హరిభావ్ తాను కరువు పనులు చేస్తున్న చోటికి విష్ణును తీసుకెళ్లాడు. ఎందుకంటే చదువుకుంటే కరువు,దారిద్య్రం నుంచి బయటి పడితే జీవితం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాడు.
కరువు పనులు సాగుతున్న చోట ఒక చెట్టు నీడన కరువు పనుల మేస్త్రీ కూర్చుని ఉన్నాడు.
‘నువ్వు బాగా చదువుకుంటే, ఆ మేస్త్రీ లాగా చెట్టు నీడన అలా దర్జాగా కూర్చోవచ్చు.లేదంటే నాలాగా ఇలా ఎండలో కూలిపని చేసుకుంటూ బతకాలి, ’అని హరిభావ్ విష్ణుకు చెప్పాడు.
ఆ మాటల గూఢార్థాన్ని తెలుసుకునేంత వయసు కాదు విష్ణుది. అయినా సరే హరిభావ్ తనకు తెలిసిన పద్ధతిలో తనవంటి జీవితం నుంచి కొడుకు బయటపడాలనే కోరికను వెలిబుచ్చుతూనే వచ్చాడు.
హారిబావ్, కైలాసబాయి కూలి కెళ్తున్నారు. కరువులొస్తున్నాయ్, పోతున్నాయ్, విష్ణు అక్కడి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాడు. వూర్లోని స్కూలులో నాలుగో తరగతి దాకా చదివాడు. అయిదో తరగతి కోసం పక్కనే ఉన్న కారండి గ్రామంలోని మరొక స్కూళ్లో చేరాడు.స్కూలు కోసం రోజూ నాలుగు కిలోమీటర్లు పోయి రావాలి .
వయసు పెరిగే కొద్ది, విష్ణుకు మెల్లి మెల్లి గా, బధిరురాలయిన తల్లి, కనుచూపు సరిగ్గాలేని తండ్రి దుర్భర దారిద్య్రంలో బతుకుతున్నారనే వాస్తవం గుచ్చుకోవడం మొదలయింది.
ఒక్కొక్క తరగతి పెరిగే కొద్ది, పుస్తకాలు, బ్యాగు, యూనిఫాం, షూ … ల ఖర్చు తల్లితండ్రులమీద భారం పెంచుతున్నదని గ్రహించాడు.
అయితే, తాను ఆ దశలో చేయగలిందేమీ లేదు. సినిమాల్లోనో, కథల్లోనే జరిగినట్లు, అపుడు విష్ణు పెద్ద కలలేమీ కనడం లేదు.జీవితంలో పెద్ద ట్విస్టు వస్తుందని కూడా అనుకోవడం లేదు.
కరువు ఆ ప్రాంతాన్నివదలడం లేదు. అందువల్ల ఆయన కోరుకున్నదంతా కరువును దాటటమే.ఇంట్లో పేదరికం పోయి, కూడుగుడ్డ సమస్యతీరితే చాలన్నదే ఆయన,ఆ కుటుంబం కలగన్నదంతా.
ఈ తీరని కోరికల మధ్య విష్ణు చదువు సాగుతూ ఉంది. కష్టాలు పెరుగుతున్నాయి. దీనికి తోడు తల్లితండ్రులిద్దరికి వైకల్యం ఉంది. చూట్టూర కరువు. ఇంట్లో వైకల్యం, పేదరికం, ఆకలి, చదవు… జీవితం ఎలా ఉంటుందో వూహించవచ్చు.
ప్రతిరోజు విష్ణు కారండి హైస్కూలుకువెళ్లే వాడు. స్కూలుదారిలో ఒక చోట పిండి మిషన్ ఉంది. రోజు ఇంటి కొచ్చేటపుడు విష్ణు ఆ పిండిమిషన్ కు వెళ్లి, అక్కడ చుట్టూర రాలిపడిన పిండిని వూడ్చుకొని తెచ్చే వాడు. ఎంతోకొంత పిండి దొరికేది. తలమీద ఈ పిండి మూట పెట్టుకుని భుజానికి పుస్తకాల సంచి తగిలించుకుని ఇంటి కొచ్చేవాడు. అమ్మ వాటితో రొట్టెలు చేసేది. ఒక్కొక్క సారి పిండి తక్కువై రొట్టెలు అందరికి చాలేవి కాదు. అపుడు పిల్లలకు మాత్రమే పెట్టి, హరిభావ్, కైలాస బాయి పస్తు పడుకునే వాళ్లు.
ఈ పరిస్థితి నుంచి బయటపడాలన్న ఆలోచన క్రమంగా విష్ణులో రావడం మొదలయింది. ఆ ఆలోచన వచ్చే నాటికి విష్ణు పదో తరగతి 79 శాతం మార్కులతో పాసయ్యాడు. తర్వాత హెచ్ ఎస్ సి లో 69 శాతం మార్కులు సాధించాడు. ఇక చదువు చాలు, ఉద్యోగం గురించి ఆలోచించాలనుకున్నాడు.
దీనికి D.Ed కోర్సు బెస్టు అనుకున్నాడు. టీచర్ ట్రైనింగ్ పాసయితే, ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువ. టీచర్ గా తాను ఉద్యోగం చేస్తే తల్లితండ్రి కష్టాలు తీరినట్లే అని ఆశపడ్డాడు. మొత్తానికి వాళ్ల వూరికి 20 కి.మీ దూరానే ఉన్న టీచర్ ట్రైనింగ్ కాలేజీలో సీటు సంపాయించాడు.
అయితే, కోర్సు పూర్తి కాకముందు మరొక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవలసి వచ్చింది. 1999లో డి.ఇడి పూర్తి చేశాడు. వూరికి 150 కి.మీ దూరాన ఉన్న మరొక కరువు వూర్లో ఉద్యోగంలో చేరాడు.
అపైన ఇద్దరు పిల్లలు కలిగారు. విష్ణు టీచర్ కావడంతో ఇంట్లో ఆనందం వెల్లివెరిసింది. కేవలం కూలీ పైసల మీదే ఆధార పడకుండా వాళ్లకి కొంత ఆసరా దొరికింది.
ఇలా జీవితం ఒక విధంగా సాఫీగానే సాగుతూ ఉంది. అయితే, ఉన్నత చదువులు చదవాలన్న ఆకాంక్ష అతనిలో పెరిగింది. నాసిక్ ఒపెన్ యూనివర్శిటీ నుంచి బిఎ పూర్తి చేశాడు. తర్వాత ఆయన దృష్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మిత్రుల మీద పడింది. వాళ్లు విష్ణును ఎంకరేజ్ చేసి ఒక ప్రయత్నం చేయమన్నారు.
విష్ణు ఒక ప్రయత్నం చేస్తే నష్టం లేదనుకున్నాడు. తానూ ప్రిపేర్ కావడం మొదలుపెట్టాడు. విపరీతంగా చదవడం మొదలుపెట్టాడు. కోచింగ్ లేదు. అనుకోకుండా మనసులోకి చొరబడిన పోటీపరీక్షల ఆలోచన అతన్ని నిలకడగా ఉంచలేదు. చదివే కొద్ది అతనిలో ఉత్సాహం నింపింది. పరీక్షలకు ప్రిపేర్ కావడమే జీవితమయింది. మధ్య ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశాడు. ప్రిలిమినరీ పాస్ అయ్యాడు. మెయిన్స్ దాటాడు. ఇంటర్వ్యూలో నెగ్గాడు. ఫలితాలొచ్చాయి. సేల్స్ టాక్స్ అసిస్టెంట్ కమీషనర్ గా సెలెక్టయ్యాడు.
ఫలితం చూసుకున్నాక ఇది నిజమా, కలా అని కొద్ది సేపు గందరగోళ పడ్డాడు. కూలీ హరిభావ్ కొడుకు ఆఫీసరయ్యాడు. నోట మాట పలకలేని కైలాస్ బాయి కొడుకు ఆఫీసరయ్యాడు. తినడానికి ఏపూట పూర్తిగా తిండి కూడా లేని ఒక పల్లెటూరి నిరుపేద విష్ణు ఆఫీసరయ్యాడు.
రోజు స్కూలు నుంచి ఇంటికి తిరిగొస్తూ పిండిగిర్నిలో రాలిపడిన పిండి వూడ్చుకుని తీసుకొచ్చి కడపునింపుకున్న విష్ణు ఆఫీసరయ్యాడు.
ఆయన కళ్ల ముందు తనవూరు, కరువు, పేదరికం గిరగిర తిరిగాయి. మరుసటి రోజు నుంచి విష్ణుగాడు, ‘విష్ణుగారు’ అయ్యాడు. ఎపుడూ పట్టించుకోని చుట్టాలంతా పోలోమని ఇంటిమీద వాలి కైలాసబాయి కొడుకుని ప్రశంసించారు. ఇళ్లకు భోజనానికి పిలిచారు. అనేక సంస్థలు సన్మానాలు చేశాయి. సభలకు పిలిపించి ఉపన్యాసలివ్వమన్నాయి. హరిభావ్, కైలాస బాయి కొడుకు ‘కరువు సీమ’ హీరో అయ్యాడు.
ఇదే టైం లో విష్ణు స్నేహితులిద్దరు సివిల్స్ పాసయ్యారు. వాళ్లు విష్ణుని ప్రశాంతంగా ‘బతక’నీయలేదు. సివిల్స్ రాసితీరాల్సిందే అన్నారు. ఒప్పించారు. ప్రిపరేషన్ కు అవసరమయిన గైడెన్స్ ఇచ్చారు.
జీవితం తనని ఎటో తీసుకెళ్తున్నదని విష్ణు భావించాడు.
2013లో మొదటి సారి సివిల్స్ రాశాడు. ప్రిలిమినరీ పాసయ్యాడు. ఎలాంటి కోచింగ్ లేకపోయినా మెయిన్స్ కూడా పాసయ్యాడు. ఇంటర్వ్యూ కోసం ధోల్పూర్ హౌస్ (UPSC కార్యాలయం) కు వెళ్లాడు.
ఎక్కడి కుంబర్వాడి? ఎక్కడి దోల్పూర్ హౌస్? తాను ఇంటర్వ్యూ పాస్ కాకపోయినా పర్వాలేదు. యుపిఎస్ సి ఆఫీసులో కాలుమోపడమే తనలాంటి వాడికొక ఘన విజయం అనుకున్నాడు విష్ణు. ఆ యేడాది సెలెక్టు కాలేదు.
రెండోసారి ప్రయత్నించాడు. ప్రిలిమ్స్, మెయిన్స్ పాసయ్యాడు. మళ్లీ అదే ఇంటర్వ్యూ. ఊఁహూఁ. ఈ సారీ సక్సెస్ కాలేదు.
మూడోసారి ప్రయత్నించాడు. ఇంటర్వ్యూ దాకా వచ్చాడు. దోల్ పూర్ హౌస్ లో మళ్లీ కాలుమోాపాడు. గత రెండు ఇంటర్వ్యూలను గుర్తుకు తెచ్చుకున్నాడు. గత పొరపాట్లు ఈసారి జరగకూడదనుకున్నాడు.
మానసిక స్థైర్యాన్ని కూడదీసుకున్నాడు. ధీమాగా ఇంటర్వ్యూను ఎదుర్కొన్నాడు. ధైర్యంగా ఇంటికొచ్చి ఫలితం కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాడు. ఫలితాలొచ్చాయి. ర్యాంకు 1064 వచ్చింది.
అవధుల్లేని ఆనందమేమిటో ఆ రోజు విష్ణుకు అనుభవానికి వచ్చింది. మొదట స్నేహితులు ఫోన్ చేసి సివిల్స్ పాసయ్యావు అని చెప్పినపుడు విష్ణు స్థాణువైపోయాడు. నోట మాట రాలేదు.
ఈ వార్త ఇంటికి చేరిందో లేదో, హరిబావ్ ‘ బావ్ కలెక్టరయ్యాడు,’ అని అరిచాడు. సివిల్స్ పాసవడమంటే ఏంటో తెలియని అమాయకుడు తండ్రి. కొడుకుని ఎలా అభినందించాలో తెలియక తికమక పడ్డాడు. బావ్ కలెక్టరయ్యాడని వూరంతా చాటింపేశాడు. మరుసటి రోజు పత్రికల్లో కొడుకు ఫోటో చూసిన మూగ చెవిటి తల్లి కైలాసబాయి…ఎమనుకుంటుందోఎప్పటికీ ఎవ్వరూ చెప్పలేరు. ఆమె విష్ణు బొమ్మ అలా చూస్తూ ఉండిపోయిందట.
విష్ణు ఐఆర్ ఎస్ కు ఎంపికయ్యాడు.తన జీవితం ఎవరికైనా ప్రేరణ అవుతుందేమోనని ఆయన తన జీవనసమరాన్ని Humans of LBSNAA లో షేర్ చేశాడు….
విష్ను కథ మిమ్మల్ని కదిలించిందా… అయితే, ఈ పోస్టుని మీ మిత్రులందరికి షేర్ చేయండి.