‘కవికాకి’ బిరుదున్న ఏకైక కవి కోగిర జై సీతారాం

పొట్టేలు కన్నతల్లి గొర్రే,గొర్రే
దున్నపోతు కన్నతల్లి బర్రే, బర్రే
ముందు పళ్ళు ఉడిపోతే తొర్రే, తొర్రే
తొర్రినోట్లో అంబలేస్తే జుర్రే, జుర్రే
ఇంగ్లీషు భాషా! ఎంతో తమాషా!
సాల్టంటే ఉప్పు – ఫాల్టంటే తప్పు
క్రో అంటే కాకి, కాక్ అంటే పుంజు
ఇంగ్లీషు భాష – ఎంతో తమాషా
తమాషైన భాషా నేర్వాలని ఆశ
“పిల్లీ పిల్లీ ఎక్కడికి ?
ఎలుకల వేటకు వెళుతున్నా !
బల్లీ బల్లీ ఎక్కడికి ?
పురుగుల వేటకు వెళుతున్నా!
నల్లీ నల్లీ ఎక్కడికి
మనుషుల వేటకు వెళుతున్నా !”
సృజనాత్మక చదువుతో, బాల సాహిత్యంతో సంబంధం ఉన్న వారికి జై సీతారాం పాటలు తెలియకుండా ఉండవు. చదువు చెప్పడమంటే, పిల్లల్ని కొట్టడమనే అర్థం ఉన్న రోజుల్లోనే ప్రాథమిక ఉపాధ్యాయుడుగా ఆట, పాటలతో కూడిన
చదువును ప్రవేశపెట్టిన సంస్కరణావాది.
ఆనాటి ప్రాథమిక విద్యలోని శతక వాజ్ఞ్మయ ప్రభావం వలన ఆయనకు ఆచిన్న వయసులోనే ఆటవెలది, తేటగీతల అల్లిక అలవాటై తోటి వారికి వినిపించేవారట.
పిల్లలకెపుడూ వేడుకా, వినోదం కావాలి. అందుకు అభినయంతో కూడిన పాటలు కావాలి. భాషే మానసిక వికాసానికి మూలమనినమ్మి, పాటలు రాయడమూ, పాడడమూ ఆయన ప్రవృత్తిగా స్వీకరించారు.
మట్టి వాసన తెలిసిన వాడు. పల్లె మనసుల మనసెరిగినవాడు. చిన్నతనంలోనే మేకలు మేపి కష్టాలను చవి చూచినవాడు. పల్లె ప్రజల జీవనశైలి తెలిసినవాడు. కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో నివశించిన కవి. కరువు ప్రాంతం లో సాహిత్య బతుకు బండిని లాగిన వాడు. మనసున్న మన కవి ,పల్లె ప్రజల జీవన విధానాన్ని తెలిపిన కవి. కోగిర జై సీతారామిరెడ్డి.
రాయలసీమ లో పేద ప్రజల మధ్యే ఉంటూ ఆ భాషను, వారి జీవితానుభవాలను పూర్తిగా జీర్ణించుకుని వారికోసం వారి భాష, పలుకుబడులతో కవిత్వం అల్లిన ప్రజాకవి .తబలా, హార్మోనియం వాద్యకారులు. చిత్రలేఖనం లోను ప్రావీణ్యులు.
1924 నవంబరు 14 న అనంతపురం జిల్లా రొద్దం మండలం కోగిర గ్రామం లో సీతారామి రెడ్డి జన్మించారు.
తల్లి గౌని చెన్నమ్మ, తండ్రి గౌని ఓబుల్ రెడ్డి .
నిరుపేద యాదవ కుటుంబములో పుట్టిన కోగిర జయసీతారామిరెడ్డి చిన్నతనమునుండి కష్టాల జీవితమును గడిపారు. చిన్నతనంలోనే మేకలు మేపారు.కటిక దార్రిద్రాన్ని అనుభవించారు.
అనంతపురం మున్సిపల్ పాఠశాలల్లో ప్రాథమికోన్నత విద్యాభ్యాసము జరిగినది. 8వ తరగతి వరకు చదువుకొన్నారు.
చాలా పేదవారు. దుర్బరమైన జీవితం గడిపారు.
ఆ రోజుల్లో “స్కౌట్” తప్పని సరిగా ఉండేదట! స్కౌటు క్లాసుకు వెళ్ళే ముందు తినడానికి ఏమీలేక – ఆకలికి తట్టుకోలేక కడుపుకు బిర్రుగా ఒక గుడ్డకట్టుకొని వెళ్ళి వ్యాయామం చేసేవారట. ఇది వారి దృఢమైన దీక్షకి దరిద్రానికి నిదర్శనం.
అనంతపురం నందు హయ్యర్ గ్రేడ్ టీచర్ గా శిక్షణ పొందినారు. ఆ తరువాత ఉపాధ్యాయుడైయ్యారు .
పల్లెల్లో పేద ప్రజల నడుమ నిత్యము కలిసిమెలసి తిరుగుతూ ప్రజా జీవితాన్ని చదివారు. భాషను, ఆచార వ్యవహారాలను, వారి జీవితానుభవాలను, మనోగతాలనురంగరించి కవితలల్లిన ప్రజాకవి కోగిర జయసీతారాం.
సీతారామ్ పేరుకు ముందు జై ఎలా వచ్చిందంటే మన కవి బడిలో పాఠం పూర్తిచేశాక పిల్లలందరి చేత జై కొట్టించే వారు. అందుకని ఆయన పేర్లో జై స్థిరపడిపోయింది. కోగిర స్వంతవూరు. గౌని సీతారాం అసలు పేరైతే గౌని మరుగనపడిపోయి ఆస్థానంలో ఊరి పేరు కోగిర చేరింది ఇలా కోగిర జై సీతారాం అయ్యారు.
వీరివి అనంతపురం జిల్లా ప్రజా భాషకు అద్దంపట్టే రచనలు .ఈలాంటి మాండలిక భాషా రచనలు చేయగలిగిన కవులు చాల అరుదు ఆ పద్ధతి ఒంటబట్టడం కూడా కష్టం.
అందుకే ఈ కవి సామాన్య ప్రజానీకానికి జరుగుతున్న అన్యాయాలను చూసి సహించలేక కవితలల్లితే, ప్రభుత్వము దాన్ని ధిక్కార నేరంగా లెక్కించింది, బెదిరించింది.
కోగిర జై సీతారామ్ రెడ్డి కుమారుడు జయ చంద్రారెడ్డి నేను పెనుగొండలో ఇంటర్మీడియట్ చదివే రోజులలో నాకు సహచరులు అప్పట్లో వారి తండ్రి గురించి నాతో పంచుకున్న కొన్ని అనుభవాలు.
కోగిర జై సీతారాం మంచి పుస్తక ప్రియులు. ఒక్కరోజు అన్నం తినకుండా పస్తున్నా ఫరవాలేదు. కాని పుస్తకం చదవకుండా మాత్రం వుండకూడడనేవారని,వీరు గతించేవరకు చదువుతూనే ఉండేవారు.
“మేము అర్ధరాత్రి ఎప్పుడైనా లేచి చూస్తే, చిన్న కిరోసిన్ బుడ్డీదీపం పెట్టుకొని, పరీక్ష వ్రాయబోయే విద్యార్థి ఏ విధంగా శ్రద్ధగా కష్టపడి ఇష్టపడి చదువుతాడో అట్లా నిత్యమూ చదివేవారుమా నాన్న .
“మేమడిగేవారము, “నాన్నా! మీకేమైనా పొద్దున్నే పరీక్ష ఉందా? అని అందుకు ఆయన “నేను నిత్య విద్యార్థి రా! ఈ లోకంలో ఏమీ తెలియని వాడు లేదు, అన్నీ తెలిసిన వాడూ లేదు. నేను అన్నీ తెలిసిన వాడిని కాను. కాబట్టి, ఇంకా బాగా చదవాలని – ఎంతో తెలుసుకోవాలని తపన.
ఈ దాహం తీరనిది. ఈ నా పుస్తక వ్యామోహం తరగనిది” అని గంభీరంగా చెప్పేవారని చెబుతుండేవారు.”
ఆయన వేషధారణ చాలా సాదాసీదాగా నిరాడంబరంగా
ఉండేది. ముతక నూలు పంచె షర్టు భుజం పై టవ్వాలు వేసుకొనేవారు.
చలికాలంలో స్వెట్టర్ కుల్లాయితో కనిపించేవారు. ఏనాడు ఖరీదైన దుస్తులు ధరించలేదు. పద్య – గేయ – నాటక – వచన రచనలు చేస్తూ…. తనదైన ప్రత్యేక శైలిలో అక్షర సైన్యాన్ని నడిపేవారు. వీరిని అలుపెరుగని కలం యోధులు అంటే అతిశయోక్తి కాదు.
వీరికి తాలూకా స్థాయి నుండి రాష్ట్రస్థాయి పరకు గొప్ప గొప్ప కవులు కళాకారులు సన్నిహిత సంబంధాలుండేవి. చర్చా గోష్ఠుల్లోను సమ్మేళనాలలోను, అష్టావధానాలలోను పాల్గొని ప్రత్యేక ప్రశంసలదుకొనేవారు ఎన్నో సన్మానాలు సత్కారాలు పొందినారు.
మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య తరిమెల నాగిరెడ్డి , పరిటాల శ్రీరాములు, మాజీ ఎం.ఎల్.ఏ చిదంబరరెడ్డి బి.టి.యల్.యఎన్. చౌదరి, పి.వి. చౌదరి వంటి రాజకీయ ప్రముఖుల మరియు మహాకవి శ్రీశ్రీ ,చెరబండరాజు – గొట్టిపాటి సుబ్బరాయుడు మొదలగు ఎందరో సాహితీమూర్తుల అభిమానం చూరగొన్నారు .
కవి భూషణ ,కవితిలక కల్లూరు అహోబల రావు తన రాయలసీమ రచయితల చరిత్ర 4వ భాగం లో కోగిర జై సీతారామ్ గురించి ఇలా వివరించారు.
” చలిమంట ” అనే కవితలో సామాన్య పల్లె కూలీలు దినదినగండపు జీవితాన్ని కళ్లు కు కట్టినట్టు రాశారు. ఆ కవిత సాధారణ మాటల్లో సాగిపోయినా అది ఛందోబద్ధంగా వుంది . జీవితంలో పండి పోయిన ఓ అవ్వ శరీరాన్ని కొరుక్కు తింటున్న చలికి ఓర్చుకో లేక వాళ్ళను వీళ్ళను పలకరించి,
చలి అనుకుంటూ తన వాళ్ళను పనులకు పురమాయిచ్తూ చుట్టుప్రక్కల వాళ్ళను విచారించడం ఇందులో రచనా వస్తువు. జనం, జీవం అవ్వ మాటలకు ప్రాణం. సంభాషణ విధానంలో రచన సాగుతుంది.
ఆడ బెయ్యెదెవ్‌రు? ఆదిగా – “యాలవా”
“అగ్గిపెట్టె వుంద అనుముగా; నితావ?”
“వూను వుందితాలు నేనంటిత్త”
“కప్కొనేకి యేడ్డి కప్పడమూ లేదు
దుప్టి గొందమంటె దుడ్లు లేవు
తొలుపుల్యాక వాకిలికి తడకడ్డం బెట్కోని
యేటి బతుకో యేమొ యల్ల కాల్ము”
“-యంగటమ్మా! లేత్వ, యింగా లేదా”
“ఏం, లేశ్ననత్తా! యెసురెంత బెట్టల్ల”
“రొండు జెమ్లు బెట్టు; పిండి వుందొ”
“యాడిదిప్‌డు రాగులిసురల్ల; యెసర్లోకి”
“సందకాడ వురికె సత్తారంద్రు….”
ఇలా అత్త కోడళ్ళ సంభాషణ జరుగుతుంది తుదకది కుటుంబ సంక్షేమానికి దారి తీస్తుంది. ఈ విధంగా ఈ కవికి పల్లీయుల జీవితంలోని నొక్కుల్ని, లోతుల్ని పసిగట్టే శక్తి వుంది.
అందుకే ఈ కవి “ ఆత్మగతం ” అనే శీర్షికలో వ్రాసిన కవితలో ఇలా రాసుకున్నారు.
పిన్న పదమునందు పెద్దభావము పొందు నేర్పు గలుగువాడు నిజము సుకవి కొద్ది పొలమునందు కొండంత పంట, కం డించు నట్టివాడె మంచి రైతు.
” నిట్టూర్పులు ” – పద్యకావ్యం : విజయప్రభ • బుర్రకథ: ఈ రెండు పుస్తకం రూపంలో వెలువడ్డాయి. తక్కినవన్నియూ రాత ప్రతులుగానే మిగిలిపున్నాయి. వీరు ” సుగుణాః ” అను మకుట ముతో వ్రాసిన 400 పద్యముల శతకములో నేటి భారత దేశపు రాజకీయ వ్యవహారములను, స్థితి గతులను తూర్పారబట్టారు. అలాంటిదే వీరి ” మదాంధబరాతము “కూడ. ఇది తేటగీతికలలో కూర్చబడినది.
భరతభూమి స్వతంత్రమై ప్రజల పాల నమ్ము ప్రారంభమైనట్టు నాటినుండి ధాత్రియెల్ల మహాకురుక్షేత్రమయ్యె సంశయా: చెప్పుమా దాని సరళి కొంతః
దేవుని ఎదుట ప్రమాణము గావించిన సాక్షి యిచ్చు కైఫీయతులు దేవిన దొరకని సత్యము
దేవు డపహరించెనే మొ తెలియదు సుగుణా ( సుగుణా! శతకము నుండి) ఇలా అహోబలరావు చాలా విషయాలు సీతారాం గురించి తెలిపారు.
ప్రబంధాలను ప్రాచీన సాహిత్యాన్ని బాగా చదువుకున్న జైసీతారామ్ తన 13వ యేటనే అందమైన కందపద్యం రాశారు. తన చుట్టూ వున్న దయనీయమైన దరిద్ర దృశ్యాలను చూసి స్పందించి ఆయన కవిత్వం రాశారు.
భాగ్యరమ మదాంధ్ర భారతం సుమతీశతకానికి పేరడీలు, మైక్రో కవితలు బాలగేయాలు, చలిమంటలు, అంగలాసిగాడు కుశాలిగాడు, లాంటి నాటికలు ఎన్నింటినో రాశారు రమ్ సీసాలు అన్న కావ్యం జై సీతారామ్ గారి రచనలలో ఆణిముత్యం.
ఆకావ్యం సమకాలీన రాజకీయాల పై విసుర్లు విసిరింది. చలిమంటలు ఆన్న రచన ఆయన కీర్తిని నలుదిశలకు చాటింది. అది అచ్చమైన ప్రజల వాడుక భాషలో కొనసాగిన కావ్యం
అనంతపురం జిల్లా, జిల్లా మాండలికాల అన్న జై సీతారామ్ గారికి మక్కువ ఎక్కువ. కవి అన్నవాడు తనచుట్టూ వున్న మాండాలికాలను ఉపయోగించి రచన చేయాలనేది ఆయన వాదన.

తెలుగు సాహిత్యంలో కవికోకిలలు, కవివృషభులు కవిసింహులు, కవికిశోర బిరుదులనుఎక్కువగా వింటాం . ఇంటి పేరుతో కాకుండా ఊరి పేరు తో ప్రసిద్ధిచెందిన కోగిర జై సీతారామ్ కు “కవికాకి” అనే ప్రత్యేక బిరుదు పొందారు.

సీతారామి రెడ్డి 1949 ఆగస్టు నుంచి 1985 మార్చి 31 వరకు ఉపాధ్యాయునిగా పనిచేశారు. రొద్దం మండలం బక్సంపల్లి పాఠశాలలో పదవీ విరమణ పొందారు.
1942లో ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొన్నారు.
1972లో ఎమర్జెన్సీ సమయంలో ఒక సంవత్సరము 5 నెలలు సికింద్రాబాదులోని ముషీరాబాద్ జైలులో ఖైదీగాజైలు శిక్ష అనుభవించారు.
అక్కడ వెంకయ్యనాయుడు , లాంటి అనేకమంది హేమాహేమీలతో గొప్ప పండితులు, కవులు మరియు రాజకీయ నాయకులు తో పలు విషయాల మీద చర్చలు జరిపేవారు.
“చెయ్యని తప్పు వెయ్యనీ శిక్ష’ సర్కార్ కంచం సర్కార్ మంచం నాకేం? జై సీతారాం! ” అనేవారు. ‘ఇందిరమ్మ జైలురా ఇంటికన్నా మేలురా” అని పాట పాడేవారంట.
అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ-అధ్యక్షులు బి.టి.యల్.యన్ చౌదరి చాలా మంచి మిత్రులు. గ్రంథాలయ వారోత్సవాల సభలో సీతారాంగారిని “కవికాకి “బిరుదు ఇవ్వాలను కొంటున్నామని ప్రశ్నించగా,
నిస్సంకోచంగా ముందు కొచ్చి “నెమలి జాతీయ పక్షి కాకి ప్రజల పక్షి. నిత్యం వాళ్ళను మేలుపుకొలుపుతుంది. నేను ఆలాంటికవినే. నాకాబిరుదుతగిందే అని సగౌరవంగా సభలో అందుకొన్నారు.
ఈసందర్భంగా సీతారాం మాట్లాడుతూ చాలా చమత్కారం ప్రదర్శించారు.
కోకిల వసంత కాలంలో మాత్రమే కూస్తుంది కానీ నేను పల్లె ప్రజల కష్టనష్టాలు, సుఖదుఃఖాలు కరవు ,కన్నీళ్లు గురించి నిత్యం నినందించే కవి కాకి అన్నారు.
వీరి రచనలన్నీ అనంతపురం జిల్లా సాహిత్యాభిలాషుల మనోఫలకాలపై చిరస్థాయిగా ముద్రింపబడ్డాయి. ఏ కవి సమ్మేళనం జరిగినా ఏ సాహిత్య గోష్ఠి జరిగిన అక్కడికక్కడే తన సంచిలోని కవితలను వివిపిస్తుండేవారు.
అరణ్యరోధనము పద్యాలు కావ్ – కావ్ శతకము కాకిగోల గేయాలు పండు వెన్నెల పిల్లల పాటలు కృష్ణార్జున యుద్ధం
రామాంజ నేయ యుద్ధము సీతారామకల్యాణము నాటకములు జయ భారతి బుడబుడక్కలకథ
నిట్టూర్పులు పద్యకావ్యం
విజయప్రభ బుర్రకథ
సుగుణా శతకము 400 పద్యాలు
మదాంధబరాతము వ్యంగ్య రచన
పండువెన్నెల పిల్లల పాటలు
మేం పిల్లలం 150 బాలగేయాల సంకలనం
అక్షరసైన్యం
జైసీతారాం సీసాలు
ఇవి వీరి రచనలు .వీటి లో కొన్ని పుస్తకం రూపంలో తీసుక రాలేక పోయారు .
ఉపాధ్యాయ జీవితాన్ని కొనసాగించిన ఒక సాధారణమైన వ్యక్తి. పదునైన కలంతో చురకలంటిన ధైర్యశాలి.
కోనపురం, నడింపల్లె, బొంతలపల్లె, కోగిర, రామగిరి మొదలైన ప్రాంతాలలో ఒకటవ తరగతి ఉపాధ్యాయుడిగా, ఏకోపాధ్యాయుడిగా 1949 – 85 మధ్యకాలంలో పనిచేశాడు.
ఆయన ఏ గ్రామములో పనిచేసినా, ఆ పాఠశాల యందు గోడలపై, సొంత ఖర్చులతో వర్ణమాల (అ,ఆ లు) గుణింతాలు – ఒకటి రెండు – ఎక్కాలు వారములు, నెలలు, సంవత్సరాలు రంగురంగుల పెయింట్లతో వ్రాసేవారు. మీరు చిత్రలేఖనం నందు కూడా నేర్పరులు కనుక నల్లబల్లపై చిత్రవిచిత్రమైన బొమ్మలు వేస్తూ, బాలగేయాలను పాడుతూ, అభినయిస్తూ, అప్పుడప్పుడు చిన్న చిన్న నాటకాలను రచించి బాలలచేత ప్రదర్శింపజేస్తూ, చిన్నారులలోని సృజనాత్మకతను వెలికితీత మెరుగులు దిద్దేవారు.
1983లో ఆనాటి ముఖ్యమంత్రి తెలుగు తేజం కళాప్రపూర్ణ నందమూరి తారక రామారావు చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకొన్నారు.1984-85 సంవత్సరానికి మూడవ తరగతి తెలుగువాచకాన్ని అందించాడు.
సీతారామి రెడ్డి 1985 మార్చి 31 వరకు ఉపాధ్యాయునిగా పనిచేశారు. రొద్దం మండలం బక్సంపల్లి పాఠశాలలో పదవీ విరమణ పొందారు.
పరిశ్రమలశాఖ మంత్రి యస్. రామచంద్రా రెడ్డి కి కోగిర జైసీతారామ్ కవిత్వమంటే చాలా ఇష్టం. వారిద్దరూ మంచి స్నేహితులు కూడా. ముసలితనంలో దయనీయ పరిస్థితుల్లో వున్న సీతారాం న్యాయంగా రావలసిన పెన్షన్ రాలేదు.
ఇందు కోసం పెనుకొండ ట్రెజరీ కార్యలయం ముందు నిరాహారదీక్ష చేశారు . మరి అప్పట్లో మంత్రి కి ఏ రాజకీయాలు అడ్డు వచ్చాయి తెలియదు. పెన్షన్ ఇప్పించలేకపోయారు.
తాను ఎంతబాధలో ఉన్నా ఆత్మీయ బంధుమిత్రులను ఎప్పుడూ నవ్వించేవారు. తన చమత్కార జిలిబిలి కవితలతో అందరినీ అలరించేవారు. తనకు తెలిసిన మిమిక్రీ’ కళానైపుణ్యాన్ని చూపించేవారు. చిన్న చిన్న గోష్ఠిలో కాని, పెద్ద సభలలోకాని వీరి వాణియే వేరు! బాణియే వేరు చక్కలిగిలి పెట్టి చురకలంటించినట్లుండేది వీరి స్వీయ కవితాపఠనం.
‘కవిత్వమంటే ఛందస్సు కాదు. ఢమ ఢమార్భా టాల మోత కాదు, సర్కస్ ఫీట్లు అసలే కాదు, మెరుపులా మెరసి, గాలిలా తాకి ఒక్క క్షణంలో హృదయాల్ని గిలిగింతలు పెట్టే చమత్కారమే కవిత్వం’ అంటూ జై సీతారాం నిత్యం వాడుకలోని
చిట్టి, చిట్టి పదాలతో ఎన్నో కవితా చమత్కారాలు చేశారు. ఆ వందలాది బాలగేయాలు రుషివ్యాలి ద్వారా ‘వెన్నెల విందు’, బాలసాహిత్య అకాడమీ ద్వారా ‘బాలల జండా’, టింబక్టు ప్రచురణ ద్వారా ‘మేం పిల్లలం’గా ‘బాలల జండా,టింబక్టు ప్రచురణ ద్వారా ‘మేం పిల్లలం’గా ప్రచురణ పొందాయి.
పిల్లలకు భాష నేర్పడం కోసం ఆయన నిత్యం పరిశోధకులుగా, ‘సున్నా వాచకం’ ’10 అక్షరాలతో
తెలుగులిపి’ లాంటి ప్రయోగాలెన్నో చేశారు. పాఠాలను పాటలుగా మార్చి, పిల్లలకు చదువంటే కష్టం కాకుండా ఇష్టపడేలా చేసేవారు. జై సీతారాం పిల్లల పాటలు తప్ప ప్రపంచం తెలియని అమాయక, అలౌకిక చక్రవర్తి ఏమీ కాదు. ‘నిట్టూర్పులు’, ‘మధాంధ భారతం’, ‘సమతా చతుశ్శతి’, ‘రమ్ సీసాలు’ లాంటి ఛందోబద్ధ రచనలతో సాహిత్యాభిమానులను ఎంతో అలరించి, అభినవ వేమనగా కీర్తి గడించారు.
పుట్టు పేదరికం, కుల పెత్తందారీతనం, అధికార జులుం ఆయనను వెంటాడాయి. ఆయన తన కలంతో ‘అక్షర సైన్యం’ నిర్మించుకొని ‘కచటతపలను రేపి గర్జింపచేస్తాను, గజడదబలను ఊపి గాండ్రింపజేస్తాను’ అంటూ ముందు నిలబడి
కవితా ప్రస్థానం గావించారు. జై సీతారాం హృదయం బీదలపట్ల, స్త్రీలపట్ల, శ్రమజీవులు, దేశంపట్ల ఆర్ధంగా స్పందించింది. ‘చెమట నీది, చేయి నీది –
చేతిలోని చేవ నీది, చేవ కొలదీ చేసిన – నీ చేని పంట ఏదిరా !’ మడక నీది,మాను నీది – కాడిమేడి నీదిరా, కాడిమేడి పండించిన కడుపు కూడు ఏమాయెరా
?’ అంటూ రైతన్న బాధలను కవితాగానం చేశారు.
” నలుబదేడు వయస్సు మీరిన,నా కుమార్తె స్వతంత్ర భారతి ఏమి లోపమో ! ఎవరి శాపమో ! ఇంకా సమర్తాడలేదు’ అని సార్ధకం కాని, సఫలీకృతం కాని స్వాతంత్ర్యానికి పెదవి విరిచారు. ‘మానవ
వేషాలు ధరించి – మగ వేషాల్లో మృగాలు ఎన్నో’ కట్టుకునేందుకు హీరోవాడు, కట్నం కుదరక విలనవుతాడు’ అంటూ కట్నాల వికృత‌ స్వరూపా లపై, సామాజిక‌ రుగ్మతలపై కలం కత్తి దూశారు. ఎమర్జెన్సీలో జైలు శిక్ష అనుభవిచారు. ఆ జైల్లో
కూడా ‘అరసం’, ‘విరసం’ దిగంబర కవులతో జరిగిన సాహిత్య గోష్టులతో తన‌ కలానికి పదును పెంచుకున్నారు.
రాయలసీమ భాషకు ఊపిరిపోస్తూ ప్రాంతీయ యాసలను కృత్రిమం కాకుండా, అనంతపురం జిల్లా మాండలికానికి ఒక గుభాళింపు తెచ్చారు.
‘నాదే ఒక కొత్త గొంతు! నాదే ఒక‌వింత వంత! నాదే ఒకనాటి – నేటి – రేపటి పంథా!’ అనే ధీమాను వ్యక్తం చేసేవారు.
ఇతడు చెయ్యి తిరిగిన రచయితే కాకుండా తబలా, హార్మోనియంలు వాయించడంలో దిట్ట. మంచి చిత్రకారుడు కూడా.
వీరికి ఇద్దరు కుమార్తెలు
గౌని అరుణమ్మ, గౌని జయరత్నమ్మ .4 గురు కుమారులు గౌని జయసింహారెడ్డి వ్యవసాయదారుడు .రామగిరి మండలం గంగంపల్లి లో నివసిస్తున్నారు.
గౌని జయ సూర్య రెడ్డి అనంతపురం లో వ్యాపారం చేస్తున్నారు. గౌని జయ ఓబుల్ రెడ్డి విశాఖపట్నంలో న్యావీ లో ఉద్యోగం చేస్తున్నారు. ఈయన కూడ కళాకారులే. చిత్రకారుడు .ఏంతో కళాత్మకంగా బొమ్మలు గీస్తారు. జయచంద్రారెడ్డి మంచి కళాకారుడు. రంగస్థల నటుడు .హాస్య నాటికలు ప్రదర్శిస్తుంటాడు. వివాహ వేడుకల వేదికలకు,సభా వేదిక లకు ,గృహాలకు అందమైన అలంకారం చేసే నైపుణ్యం ఉంది. వీరు ప్రస్తుతం పెనుగొండ లో నివాసం ఉన్నారు. కోగిర జై సీతారాం 2000 అక్టోబరు 9 న మరణించారు.కవికాకి జీవితం సమస్తం! కలం కాగితాలకే అంకితం!
కోగిర జై సీతారాం అముద్రిత రచనలు పుస్తక రూపంలోకి తేవడం, డిజిటలైజెషన్ చేయడం కోసం వారి కుమారుడు జయచంద్రా రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.
Chandamuri Narasimhareddy

(రచయిత చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత, అనంతపురం జిల్లా)