ఉత్తర ప్రదేశ్ పరిణామాలలో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వానికి తాము పరిష్కారం అన్న సంకేతం పంపిన రాహుల్ , ప్రియాంక
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన కొంత కాలంగా మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో బాధితులను పరామర్శించడాని కాంగ్రెస్ జాతీయ నేతలు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ లు యూపీ పర్యటన సందర్భంగా పోలీసులు వారి పట్ల వ్యవహరించిన తీరు అభ్యంతరకరమైనది.
దురదృష్ట సంఘటనలు చోటు చేసుకున్నపుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీలు , మీడియా అక్కడికి వెళ్లడం సహజం. నిజానికి యూపీ ప్రభుత్వం వారిని వెళ్ళనిచ్చి ఉంటే రాహుల్ గాంధీ ప్రస్తావించే అంశాలకు సమాధానం చెప్పే అవకాశం ప్రభుత్వానికి ఉండేది. అందుకు భిన్నంగా వ్యవహరించి ప్రభుత్వం తప్పు చేసింది.
దేశంలో మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. యూపీ లో జరిగిన ఘటనలకు రాజకీయాలతో ముడి పెట్టడం సరికాదు. ఇతర ప్రాంతాల్లో జరగలేదా ? అని పోటీ పెట్టడం దారుణం. దేశంలో అనేక ఘటనలు జరుగుతున్నా కొన్ని మాత్రమే వెలుగుచూస్తున్నాయి సమాజాన్ని ప్రభావితం చేసే సమయంలో వాటిపై చర్యలు తీసుకోవాలి గాని ఇతర ప్రాంతాల్లో జరిగే ఘటనలతో పోల్చి రాజకీయం చేయడం కేవలం తమ పార్టీ పట్ల అభిమానం తప్ప మరోటి కాదు.
రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీల యూపీ పర్యటన సమస్య గురించి దేశం చర్చించే లా చేసింది. పర్యటన సందర్భంగా వారు హుందాగా వ్యవహరించారు. ఉన్నత స్థాయి నేతలు అయినప్పటికీ సాదారణ ప్రజలు లాగానే వ్యవహరించారు. ఈ సమయంలో రాహుల్ ” దేశంలో రోడ్ల పై తిరిగే అధికారం కేవలం మోదికి మాత్రమే ఉన్నదా సామాన్యులకు లేదా ” అంటూ ప్రశ్నించారు. తన లాంటి పెద్ద నాయకుల పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా అని అడగకుండా తనను తాను సామాన్యుడు అని చెప్పడం రాహుల్ రాజకీయ పరిణితికి అద్దం పడుతోంది. మహిళల సమస్య పై వెళుతున్న నేపద్యంలో తన షోదరి ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో సాదారణ వ్యక్తిగా రాహుల్ ప్రవర్తించడం , రాహుల్ తోపులాటలో పడిపోయిన సమయంలో ప్రియాంక గాంధీ చూపిన చొరవ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సమస్యకు తామే పరిష్కారం అన్న భరోసా ఇచ్చారు. మోదీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం రాహుల్ , ప్రియాంక గాంధీల నేతృత్వంలో కాంగ్రెస్ ఉండగలదు అన్న సంకేతాన్ని పంపారు.